చైతన్య యాత్ర

ABN , First Publish Date - 2020-02-15T06:14:10+05:30 IST

60 రోజులు... 6,500 కిలోమీటర్లు... సమాజ చైతన్యాన్ని కాంక్షిస్తూ సైకిల్‌పై వియత్నాంకు పయనమయ్యారు ఇద్దరు యువకులు. ముంబయ్‌ గేట్‌వే ఆఫ్‌ ఇండియా సాక్షిగా...

చైతన్య యాత్ర

60 రోజులు... 6,500 కిలోమీటర్లు... సమాజ చైతన్యాన్ని కాంక్షిస్తూ సైకిల్‌పై వియత్నాంకు పయనమయ్యారు ఇద్దరు యువకులు. ముంబయ్‌ గేట్‌వే ఆఫ్‌ ఇండియా సాక్షిగా... ఇంతటి సాహస యాత్రకు శ్రీకారం చుట్టిన ఈ యువకుల లక్ష్యం...సంకల్పమేంటి చూద్దాం. 


నీరు లేనిదే మనిషి మనుగడ లేదు. అందుకే నీటిని సంరక్షించాలి. ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాలి. ఈ విషయం ప్రపంచానికి తెలిసిందే అయినా.. మళ్లీ మళ్లీ చెప్పాలి. చైతన్యం రగిలించాలి. ఇది కెప్టెన్‌ మోహిత్‌ థామస్‌ ఆలోచన! ‘సాహసం కూడా ఓ విద్యే’ అని చాటి చెప్పాలనేది మితేష్‌ అభిలాష. ఏది చేసినా అందులో సామాజిక కోణం ఉండాలి. స్ఫూర్తి కలిగించాలి. ఆ ఉద్దేశంతోనే లక్ష్యం నిర్దేశించుకుని ఈ ఇద్దరూ సైకిల్‌పై ఆరు దేశాలను చుట్టేయాలని నిర్ణయించుకున్నారు. అదీ.. 60 రోజుల్లో 6,500 కి.మీ దూరం ప్రయాణం. 


ఎవరు వీరు... 

మితేష్‌ స్వస్థలం ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ పట్టణం. మోహిత్‌ థామ్‌సది ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌. ఇద్దరూ ముంబైలోని పలు కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగులకు, కళాశాలల విద్యార్థులకు సాహస క్రీడలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణనిస్తున్నారు. ఇరువురి అభిరుచులూ కలవడంతో ఈ సాహస యాత్రకు సంకల్పించారు. దీనికి కొన్ని కార్పొరేట్‌ సంస్థలు సహకరించాయి. 


ఎక్కడి నుంచి ఎక్కడికి? 

గత నెల 26న ముంబయిలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద ప్రారంభమైన ఈ యాత్ర బంగ్లాదేశ్‌, మయన్మార్‌, థాయ్‌ల్యాండ్‌, కంబోడియాల మీదుగా వియత్నాం చేరుతుంది. తేలికపాటి దుస్తులతో బ్యాగ్‌... గాలి, దుమ్మూధూళిని తట్టుకునేలా ముఖానికి మాస్క్‌, తలకు రక్షణగా హెల్మెట్‌.. ఇదే వీరి లగేజీ. భారత్‌లో ముంబై నుంచి హైదరాబాద్‌ మీదుగా 11 రోజులు ప్రయాణించి విజయవాడ చేరుకున్నారు మోహిత్‌, మితేష్‌. విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి విశాఖపట్టణం బయలుదేరారు. 


రోజుకు 120-130 కిలోమీటర్లు... 

‘సైకిల్‌పై రోజుకు 120 నుంచి 130 కి.మీ దూరం ప్రయాణించాలన్నది లక్ష్యం. ముంబై నుంచి విజయవాడకు 11 రోజుల్లో అలాగే వచ్చాం. చలి, ఎండ సమయాల్లో గాలి కాస్త ఇబ్బంది పెట్టడం మినహా, ప్రస్తుత వాతావరణం సైక్లింగ్‌కు అనుకూలంగానే ఉంది. రాత్రి 7 తర్వాత ఏ ఊరు చేరుకుంటే అక్కడ బస చేస్తున్నాం. ఊళ్లలో స్థానికులతో ముచ్చటించి, అక్కడి విశేషాలు తెలుసుకొంటున్నాం. ఇలా రకరకాల ప్రాంతాల వారిని కలవడం కొత్త ఉత్సాహాన్నిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు ఈ కుర్రాళ్లు. 


జనం బాగా స్పందిస్తున్నారు! 

‘మా ఆహార్యం చూస్తేనే ప్రజల్లో కాస్త ఆసక్తి కలుగుతుంది. కాస్త జనసమ్మర్దం ఉన్నచోట ఆగినప్పుడు.. యాత్ర ఎందుకు, ఎక్కడికి అని ఆసక్తిగా అడుగుతున్నారు. వియత్నాం అని చెప్పినప్పుడు.. అబ్బో అంత దూరమా అని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు లక్ష్యాన్ని వివరిస్తూ జనజాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులు, ఉద్యోగులు మా యాత్రపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వారి వారి ఆశయాలు.. లక్ష్యాలను చెబుతున్నారు’ అని విశేషాలు పంచుకున్నారు మోహిత్‌, మితేష్‌.  


నేర్చుకొంటూ... నేర్పిస్తూ... 

యాత్ర ఆసాంతం.. జల సంరక్షణ, అడ్వెంచర్‌ ఈస్‌ ఎడ్యుకేషన్‌పైనే కాకుండా, పరిసరాల పరిశుభ్రత, బాల్యవివాహాలు, రోడ్డు ప్రమాదాలు, అక్షర్యాస్యత, ఉపాధి అవకాశాలు... వ్యక్తిత్వ వికాసం, విద్య, క్రీడలు.. అవకాశాలు.. ఇలా సందర్శించిన ప్రాంతాలను బట్టి ఆయా ప్రజల మనోభావాలకు అనుగుణంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈ యువకులు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల ప్రజల వ్యక్తిత్వం, భాష, సంస్కృతి, అలవాట్లు.. వంటి అనేక అంశాలపై అవగాహన చేసుకొంటూ ముందుకు సాగుతున్నారు. 


ప్రతి చుక్కా ఒడిసిపట్టాలి... 

‘అనేక గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ర్టాలు, దేశాల్లో నీటి కొరత ఉన్నా.. అవసరానికి మించి వాడుతూ దుర్వినియోగం చేస్తున్నాం. వర్షపు నీటిని ఎంతమంది భూమిలోకి ఇంకేలా గుంతలు తవ్వుతున్నారు? ఈ విషయాలు ఎవరికీ తెలియదనికాదు. కానీ ఎవరూ చొరవ తీసుకోరు. ప్రతి నీటి బొట్టునూ లెక్కబెట్టేంతగా సద్వినియోగం చేసుకోవాలి’ అంటారు మితేష్‌. భవిష్యత్తు తరాల కోసమైనా నీటి పొదుపు పాటించాలని, తమ ఈ చిన్న ప్రయత్నం కొంతమందిలోనైనా చైతన్యం రగిలించగలిగితే తమ యాత్ర సఫలమైనట్టేనని మితేష్‌ భావిస్తున్నారు. 


సాహసం కూడా విద్యే!... 

‘ఏ పని చేయాలన్నా ముందు ధైర్యం కావాలి. కానీ... చిన్న చిన్న పనులను ఆనాలోచితంగానే పూర్తి చేస్తాం. దానికి పెద్ద సాహసం చేయాలని అనుకోం. అయితే వాటి ఫలితం గొప్పగా ఉన్నప్పుడు మనం చేసిన పని ఎంత గొప్పదో.. ఎంత సాహసంతో కూడినదో అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు.. సాహసంతో చేసే పనులను ఎంచుకుని.. అందులో విజయం సాధిస్తే ఆ మజాయే వేరు. ఇదే నేను చెప్పదలచుకున్నాను. బంగీ జంప్‌ చేయాలనుకోవడం, ట్రెకింగ్‌, రోప్‌వాక్‌ చేయడం వంటి వాటికి చాలా ధైర్యం కావాలి.  పరుగు పందెంలో పాల్గొనడానికి పెద్ద సాహసం అవసరం లేదు. కానీ.. గెలవాలన్న తపన, పట్టుదల గొప్ప సాహసమే! ఇలా ప్రతి రంగంలోనూ సాహసంతో చేసే పనులుంటాయి’ అనేది కెప్టెన్‌ మోహిత్‌ చెప్పే ఫిలాసఫీ. ఇదే విషయాన్ని యువతరానికి చెప్పి, వారిని కార్యోన్ముఖులను చేయాలనే ఉన్నతాశయం ఆయనది. సమాజ శ్రేయస్సును బాధ్యతగా భావించిన ఈ ఇద్దరు మిత్రుల యాత్ర నిర్విఘ్నంగా సాగాలని ఆకాంక్షిస్తూ మనమూ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పేద్దాం! 


వియత్నామే ఎందుకు? 

‘మా లక్ష్యం ఎక్కువ మందికి ప్రేరణ ఇవ్వడం. ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం. విభిన్న భాషలు, సంస్కృతులు కలిగిన ఎక్కువ మందిని కలవడం. వారిని జాగృతం చేయడం. ఇందుకు సుదీర్ఘ ప్రయాణం అవసరం. ముంబై నుంచి వియత్నాం వరకు అతిపెద్ద రోడ్డు మార్గం.. మా లక్ష్యానికి దగ్గరగా ఉంది!. అందుకే ఈ మార్గం ఎంచుకున్నాం.’ 

శ్రీశైలం శ్రీనివాసు, అమరావతి 

Read more