అమ్మకు పెళ్లి
ABN , First Publish Date - 2020-05-10T18:57:07+05:30 IST
‘చాలమ్మా చాలు... మా కోసం చేసిన త్యాగాలు చాలు. నువ్వు ఇన్నాళ్లు అనుభవించిన ఒంటరితనం చాలు. మాకోసం కొవ్వొత్తిలా కరిగింది చాలు. ఇకపై నీకంటూ ఒక మనిషి అండగా ఉండాలి’ ఒంటరి తల్లుల పట్ల...
‘చాలమ్మా చాలు... మా కోసం చేసిన త్యాగాలు చాలు. నువ్వు ఇన్నాళ్లు అనుభవించిన ఒంటరితనం చాలు. మాకోసం కొవ్వొత్తిలా కరిగింది చాలు. ఇకపై నీకంటూ ఒక మనిషి అండగా ఉండాలి’ ఒంటరి తల్లుల పట్ల నేటితరం పిల్లల ఆలోచన ఇది. తమను పెంచి పెద్ద చేసిన ఒంటరి తల్లులకు తోడు వెతికే పనిని సోషల్ మీడియా సాక్షిగా చేశారు కొందరు పిల్లలు. సరైన జోడీని శోధించి తమ అమ్మలకు మళ్లీ పెళ్లి చేశారు...
మా అమ్మకేం తక్కువ
ఆస్థావర్మ ఢిల్లీకి చెందిన లా విద్యార్థిని. ఆమెకు తండ్రి ఎలా దూరమయ్యాడో తెలియలేదు కానీ... సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు ప్రకారం ఆస్థాను తల్లే పెంచింది. ఆమె తల్లి వయసు 50 ఏళ్లలోపే. చక్కటి రూపం కూడా. తన తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని భావించింది ఆస్థా. ట్విట్టర్‌లో అమ్మ ఫోటో పెట్టి ‘మా అమ్మకు యాభై ఏళ్ల వయసుండే వరుడి కోసం అన్వేషిస్తున్నా. అతను కచ్చితంగా శాకాహారి అయి ఉండాలి. మద్యం అలవాటు ఉండకూడదు.’ అని ట్వీట్ చేసింది. ఆమె పోస్టు వైరల్ అయ్యింది. కొంతమంది ‘ఇదేం పాడుపని’ అంటూ ట్రోల్ చేశారు. అయినా ఆస్థా వెనకడుగు వేయలేదు. ‘మా అమ్మకేం తక్కువ, ఆమె ఉన్నత విద్యావంతురాలు. నా కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. ఒంటరిగా కష్టపడి నన్ను పెంచింది. అమ్మకు దూరమైన ప్రేమను ఆమెకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను’ అని రీట్వీట్ చేసింది. ట్రోల్ చేసిన నోళ్లన్నీ మూతబడ్డాయ్. ఆస్థా అమ్మకు మంచి వరుడు దొరకాలని మనమూ కోరుకుందాం.

తన జీవితం మళ్లీ చిగురించాలి
‘నేను చేస్తున్న ఈ పనికి చాలా మంది నవ్వుకోవచ్చు. మరికొందరు విమర్శించవచ్చు. నేనవన్నీ పట్టించుకోను. మా అమ్మ ఇంతవరకు భరించిన ఒంటరితనం చాలు. ఇకపై ఆమె సంతోషంగా ఉండాలి. ఆమె జీవితం మళ్లీ చిగురించాలి. డబ్బు లేకపోయినా ఫర్వాలేదు... అమ్మను బాగా చూసుకునే వ్యక్తి ఉంటే చెప్పండి’ ఇది గౌరవ్ అధికారి అనే కుర్రాడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు వివరాలు. అమ్మ డోలాతో సహా తానున్న ఫోటోను జతగా పోస్టు చేశాడు. ఇతను ఉండేది పశ్చిమబెంగాల్‌లోని హుగలీ జిల్లాలో. అతని తల్లికి 45 ఏళ్లు. చిన్నవయసులోనే భర్త గుండెపోటుతో మరణించాడు. అప్పట్నించే కొడుకే సర్వస్వంగా బతుకుతోంది. గౌరవ్‌కి ఉద్యోగం వచ్చింది. ఉదయం 7 గంటలకు బయటకు వెళితే రాత్రెప్పుడో ఇంటికి చేరుకుంటాడు. అప్పటివరకు అతని తల్లి డోలా ఒంటరిగా కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తల్లి అలా ఇంట్లో ఒంటరి అవ్వడం నచ్చలేదు గౌరవ్‌కి. అందుకే మంచి పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాడు. ఇప్పటికే వైద్యులు, మెరైన్ ఇంజినీర్లు, టీచర్లు ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు.

హ్యాపీ మ్యారీడ్ లైఫ్...
గోకుల్ శ్రీధర్‌ది కేరళలోని కొల్లాం జిల్లా. అతని తల్లి మినీ అయ్యప్పన్. గోకుల్‌కు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నలో ఒక మృగాన్నే చూస్తూ పెరిగాడు. అమ్మని తరచూ కొట్టడం, తన్నడం, తిట్టడం వాళ్ల నాన్నకు నిత్యకృత్యమైపోయింది. తల్లిని తీసుకుని ఇంట్లోంచి బయటికి వచ్చేశాడు. మినీ అయ్యప్పన్ చిన్న ఉద్యోగం చేస్తూ కొడుకును చదివించడం ప్రారంభించింది. పస్తులుండి మరీ కొడుకు కాలేజీ ఫీజులు కట్టేది. ఆమె కష్టాన్ని వృథా కానీయలేదు గోకుల్. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం తెచ్చుకున్నాడు. వెంటనే తన తల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేశాడు. ఆర్మీలో కల్నల్‌గా చేసి రిటైర్ అయిన వేణుని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు మినీ అయ్యప్పన్ ఆనందంగా ఉంది.

కూతురే పెళ్లి పెద్ద
గీతా అగర్వాల్... జైపూర్‌లో నివసించే ఓ ఒంటరి తల్లి. భర్త గుండెపోటుతో మరణిస్తే బతుకుదెరువు కోసం చిన్న స్కూల్లో టీచర్‌గా చేరింది. ఒక్కగానొక్క బిడ్డ సంహితని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని చేసింది. కూతురు ఎక్కడో అమ్మకు దూరంగా ఉద్యోగం చేసుకుంటుంటే... ఈ తల్లి ఒంటరితనంతో డిప్రెషన్‌కు గురైంది. తల్లిని ఒప్పించి రెండో పెళ్లి చేయడానికి సిద్ధమైంది. బంధువులు వ్యతిరేకించారు. ‘యాభైమూడేళ్ల వయసులో మళ్లీ పెళ్లేంటి? అంటూ నోళ్లు నొక్కుకున్నారు. అయినా సంహిత వెనకడుగు వేయలేదు. మ్యారేజ్‌బ్యూరోలు, మాట్రిమోని వెబ్‌సైట్లు వెతికి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కేజీ గుప్తా సంబంధాన్ని వెతికి పట్టుకుంది. ఆయనకు 55 ఏళ్లు. భార్య పదేళ్ల క్రితమే చనిపోయింది. మంచి వ్యక్తిత్వం, అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం. అమ్మను ఒప్పించి ఇద్దరికీ ఘనంగా పెళ్లి చేసింది. రిసెప్షన్ కూడా అదరగొట్టింది.
