మోక్షప్రదాయక ఏకాదశి

ABN , First Publish Date - 2020-12-25T06:07:45+05:30 IST

శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులను అనుగ్రహించే రోజు ‘ముక్కోటి ఏకాదశి’ అని భక్తుల విశ్వాసం. క్షీరసాగర మథనంలో అమృతం, హాలాహలం పుట్టినదీ, ఆ గరళాన్ని గొంతులో బంధించి..

మోక్షప్రదాయక ఏకాదశి

  • నేడు వైకుంఠ ఏకాదశి

శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులను అనుగ్రహించే రోజు ‘ముక్కోటి ఏకాదశి’ అని భక్తుల విశ్వాసం.  క్షీరసాగర మథనంలో అమృతం, హాలాహలం పుట్టినదీ, ఆ గరళాన్ని గొంతులో బంధించి... శివుడు గరళ కంఠునిగా మారినదీ ఈ రోజేనని, మూడు కోట్ల ఏకాదశులతో సమానమైనది కాబట్టి దీన్ని ‘ముక్కోటి ఏకాదశి’ అంటారనీ, ఈ రోజున చేసే పుణ్యకార్యాలకు అనంతమైన ఫలం లభిస్తుందనీ పురాణాలు చెబుతున్నాయి.


అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించిన రోజుగా ప్రసిద్ధమైన ‘గీతాజయంతి’ కూడా ఈ రోజునే జరుపుకొంటారు. రావణుడు పెట్టే బాధలు భరించలేక దేవతలు, మునులు వైకుంఠానికి వెళ్ళి మొరపెట్టుకున్న రోజు కాబట్టి దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అనే పేరు కూడా వచ్చిందనీ మరో కథ ఉంది.. వైకుంఠ ఏకాదశి మాహాత్మ్యం భాగవతంలోని అంబరీషుని కథలో ప్రస్తావితమయింది. ఈ రోజున విష్ణ్వాలయాల్లోకి ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి, స్వామిని దర్శించుకొని, ఆయనను పూజిస్తే ఎన్నో జన్మల పాపాలు పోతాయన్న నమ్మకం ఉంది. ‘ఉత్తరం’ అంటే ‘పైన ఉన్నది’, ‘ఉన్నతమైనది’, ‘ఉత్కృష్టమైనది’ అనే అర్థాలున్నాయి.అహంకార, మమకారాలను వదిలిపెట్టి, ఆ ఉన్నతమైన ద్వారం దాటి, స్వామిని దర్శించి, శరణాగతి కోరితే మోక్షాన్ని ప్రసాదిస్తాడన్నది పెద్దల మాట. మరో విశేషం ఏమిటంటే... ఇది సౌరమానం ప్రకారం పరిగణించే ఏకాదశి. సౌరమానంలోని ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి’గా వ్యవహరిస్తారు. చాంద్రమానంలోని మార్గశిర మాసంలో వైకుంఠ ఏకాదశి వస్తే ‘మోక్షదైకాదశి’ అంటారు. పుష్య మాసంలో వస్తే ‘పుత్రదైకాదశి’ అని పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి వ్రతం విశేష ఫలదాయకమనీ, ఈ రోజున చేసే వ్రతం ద్వారా సర్వ పాపాల నుంచీ విముక్తి కలుగుతుందనీ, తామస గుణాలను తొలగించి, సర్వ శుభాలనూ కలిగిస్తుందనీ పురాణోక్తి.

Updated Date - 2020-12-25T06:07:45+05:30 IST