తల్లీ... నిను దలంచి నీ మోదీ!

ABN , First Publish Date - 2020-09-20T05:30:00+05:30 IST

ఒక యువకుడుప్రతి రోజు తనకు ఎదురయిన అనుభవాలన్నింటినీ జగత్‌జనని.. దేవి మాతకి ఉత్తరాలుగా రాసేవాడు. ఆ ఉత్తరాలన్నింటినీ ఎప్పటికప్పుడు మంటల్లో వేసి కాల్చేసేవాడు. కానీ ఒక రోజు ఆ యువకుడి మిత్రుడు ఉత్తరాలను కాల్చవద్దని వారించాడు. ఆ ఉత్తరాలన్నింటి సంకలనం ముందు గుజరాతీలోను.. తాజాగా ఇంగ్లీషులోను ప్రచురితమయ్యాయి...

తల్లీ... నిను దలంచి  నీ మోదీ!

ఒక యువకుడుప్రతి రోజు తనకు ఎదురయిన అనుభవాలన్నింటినీ జగత్‌జనని.. దేవి మాతకి ఉత్తరాలుగా రాసేవాడు. ఆ ఉత్తరాలన్నింటినీ ఎప్పటికప్పుడు మంటల్లో వేసి కాల్చేసేవాడు. కానీ ఒక రోజు ఆ యువకుడి మిత్రుడు ఉత్తరాలను కాల్చవద్దని వారించాడు. ఆ ఉత్తరాలన్నింటి సంకలనం ముందు గుజరాతీలోను.. తాజాగా ఇంగ్లీషులోను ప్రచురితమయ్యాయి. 


ఆ యువకుడు నరేంద్ర మోదీ.. 

ఆయన రాసిన పుస్తకమే ‘లెటర్స్‌ టూ మదర్‌’. హార్పర్‌కోలిన్స్‌ ప్రచురించిన ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు నవ్య పాఠకులకు ప్రత్యేకం..

‘‘ఇది ఒక సాహిత్య రచన కాదు. ఈ పుస్తకంలో ఉన్న భాగాలు నా ఆలోచనలకు ప్రతిరూపాలు.. మీ అందరిలాగానే నేను కూడా ఒక సామాన్యమైన వ్యక్తిని. నాలోను బలాలూ ఉన్నాయి. బలహీనతలు ఉన్నాయి. ఈ బలాలు, బలహీనతలను గమనిస్తూ ఒక వ్యక్తిగా పరిణతి చెందడానికి ఎప్పకటిప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను. గతంలో నేను తీవ్రమైన ఒత్తిడికి గురయినప్పుడు.. జగత్‌జననీ దేవికి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడిని. ప్రతి రోజూ నిద్రపోయేముందు... నా మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ ఉత్తరాల రూపంలో పెట్టేవాడిని. ప్రతి రోజూ అందరూ ఎప్పుడు పడుకుంటారా అని ఎదురుచూస్తూ ఉండేవాడిని. వారు పడుకున్న తర్వాత ఒక మూలకు వెళ్లి నా నోట్‌బుక్‌లో ఉత్తరం రాసేవాడిని.నేను రచయితకు కాను. ఆ మాటకు వస్తే మనలో చాలా మంది రచయితలు కాదు. కానీ అందరూ తమ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచాలనుకుంటారు. ఈ కోరిక బలమైనప్పుడు పెన్ను, కాగితం తీసుకొని రాయటం మొదలుపెడితే ప్రశాంతత లభిస్తుంది. నాకు ఇలా రాయడం ఎంతో ఉపకరించింది. ప్రపంచంలోనే అతి గొప్ప శక్తి నన్ను రక్షిస్తోందనే భావన కలిగేది. ఇలా కొన్ని సంవత్సరాలు క్రమం తప్పకుండా రాసేవాడిని. రెండు, మూడు నెలలకు ఒకసారి ఈ కాగితాలను చింపేసి వాటిని మంటలో పడేసేవాడిని. ఒక రోజు నేను ఇలా కాగితాలను మంటలో పడేస్తున్న సమయంలో నా స్నేహితుడు, ఆర్‌ఎస్‌ఎస్‌లో సహచరుడు నరేంద్ర భాయ్‌ పన్‌చాసరా అనుకోకుండా మా ఇంటికి వచ్చారు. నా చేతిలో ఉన్న కాగితాలను లాక్కున్నారు. కాగితాలను కాల్చేస్తున్నందుకు నన్ను మందలించారు. ‘‘నువ్వు వీటిని రాశావు. కొద్ది కాలం ఉంచావు. అంటే అవి నీకు విలువైనవనే అర్థం. వాటిని కాల్చేయడమంటే నీ మనస్సాక్షిని నువ్వు అగౌరపరచడమే’’ అన్నారు. ఆయన మాటలు నాపై తీవ్రమైన ప్రభావం చూపించాయి. ఇంకెప్పుడు నేను రాసిన కాగితాలను కాల్చనని ఆయనకు మాట ఇచ్చాను. ఇది జరిగిన చాలా కాలానికి ఇమేజ్‌ పబ్లిషర్స్‌ వీటన్నింటినీ పుస్తక రూపంలో వేస్తామని నాకు ఉత్తరాలు రాయటం మొదలుపెట్టారు. ఈ ఉత్తరాల గురించి వారికి ఎలా తెలిసిందో నాకు ఇప్పటికీ తెలియదు. ఈ పుస్తక ప్రచురణకు నేను అంగీకరించలేదు. కానీ మళ్లీ పన్‌చాసరా భాయ్‌ ఈ పుస్తక ప్రచురణకు అంగీకరించమని నాపై ఒత్తిడి పెట్టారు. నేను పుస్తక ప్రచురణకు అంగీకరించకపోతే- ఆ ఉత్తరాలను కాల్చేస్తాననేది ఆయన భయం కావచ్చు. ఇలా ఈ ఉత్తరాలను 2014లో ‘సాక్షి భావ్‌’ అనే పేరిట ప్రచురించారు. 

నేను ఒక రచయితను కాను. నాకు రాసే విధానం.. దానిలో ఉండే మెళకువలు తెలియవు. కానీ నాకు భావోద్వేగాలు బాగా తెలుసు. నాలో భావోద్వేగం గాఢంగా ఉన్నప్పుడు... నా మనసులో భావాలను దాచుకోలేనప్పుడు మాత్రమే వీటిని రాశాను. దేవి మాత ఈ విషయాన్ని అర్థం చేసుకుంటుందని నాకు కచ్చితంగా తెలుసు. ఆమెకు నా ఉద్దేశాలు తెలుసు. నేను రాసినవి తెలుసు. రాయనవి కూడా తెలుసు..’’

(నరేంద్ర మోడీ రాసిన ముందుమాట నుంచి)


Updated Date - 2020-09-20T05:30:00+05:30 IST