మైక్రోగ్రీన్స్ బుల్లి మొక్క... బలం పక్కా

ABN , First Publish Date - 2020-09-20T18:02:10+05:30 IST

సూక్ష్మంలో మోక్షం అంటామే.. అలాంటిదే ఈ సూక్ష్మమొక్కల తిండి. ఇప్పుడు ఏ సెలబ్రిటీ ఇళ్లలో చూసినా మైక్రోగ్రీన్స్‌ మురిపిస్తున్నాయి.

మైక్రోగ్రీన్స్ బుల్లి మొక్క... బలం పక్కా

సూక్ష్మంలో మోక్షం అంటామే.. అలాంటిదే ఈ సూక్ష్మమొక్కల తిండి. ఇప్పుడు ఏ సెలబ్రిటీ ఇళ్లలో చూసినా మైక్రోగ్రీన్స్‌ మురిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పోషకాహారంలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్న ఈ నయాహారం... కవర్‌స్టోరీ.. 


మనందర్నీ కాలు కదపకుండా చేసింది కరోనా మహమ్మారి. ఇల్లే ప్రపంచం అయ్యింది. బాల్కనీలు, టెర్రస్‌లే తోటలయ్యాయి. ఆ ఒత్తిడిలో కొత్త ఆలోచనలు మొలకెత్తాయి. ఇప్పుడు ఆహ్లాదమైనా, ఆరోగ్యమైనా ఇంట్లోనే వెతుక్కోవాలి, అక్కడే వండుకోవాలి. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా తప్పలేదు. సమంత తన టెర్రస్‌లో పండించిన ఆకుకూరల ఫోటోలను సోషల్‌మీడియాలో పెట్టి ఆనందిస్తుంది. ఇంట్లో పెరిగే చిన్నచిన్న మొక్కల్ని చూసి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ముచ్చటపడుతుంది. ఇలా సెలబ్రిటీలు చేస్తున్న పోస్టుల్లో - చిన్న చిన్న ట్రేలలో పండించిన బుల్లిమొక్కలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. మొలకల తరువాత దశ.. గుబురుగా పెరిగిన లేలేత మొక్కలు అవి. వాటిని మైక్రోగ్రీన్స్‌ అంటున్నారు. సూక్ష్మంలోనే మోక్షం అంటామే.. అలా సూక్ష్మపోషకాలకు పెట్టింది పేరు మైక్రోగ్రీన్స్‌. ఇప్పుడు ఎక్కడ చూసినా వాటి గురించే ముచ్చట.. బుల్లిమొక్కలతో బలానికి బలం.. బరువు తగ్గడమూ సులభం.. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్మార్ట్‌ ఫుడీలకు ఇస్మార్ట్‌ ఫుడ్‌ అన్నమాట.


మైక్రోగ్రీన్స్‌ను ముద్దుగా సూక్ష్మ లేదా బుల్లి మొక్కలుగా పిలుచుకోవచ్చు. ఒక విత్తనం మొలకల నుంచి మొక్కగా మారే దశకు వచ్చినప్పుడు.. మైక్రోగ్రీన్స్‌ అంటారు. మొలకలకి సాధారణంగా 2-7 రోజుల ఎదుగుదల చక్రం ఉంటుంది. అంకురోత్పత్తి తరవాత మైక్రోగ్రీన్స్‌గా ఎదగడానికి 7-21 రోజుల సమయం పడుతుంది. వీటిలో ఆకులు, కాండమే ఆహార యోగ్యం. పోషక విలువల్లో వీటి తరవాతే మిగతావి. రెండు ఆకులు తింటే చాలు అవసరమైన మినరల్స్‌, విటమిన్స్‌ అందుతాయి. అందుకే వీటికి సూపర్‌ ఫుడ్స్‌గా పేరొచ్చింది. ఇటీవల చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలపై టాపింగ్స్‌ (అలంకరణ) కోసం వీటిని వాడుతున్నారు. మైక్రోగ్రీన్స్‌ రంగు, సువాసన, తాజాదనం వల్ల.. ఏ డిష్‌నైనా అందంగా, నోరూరించేలా చేస్తున్నాయి. ఇంట్లో కూడా ఉప్మా చేసినా ఇడ్లీ చేసినా పైన కొత్తిమీర తురుము చల్లినట్టుగా మైక్రోగ్రీన్స్‌ను చల్లితే.. పిల్లలతో సహా ఇంటిల్లిపాదీ వావ్‌ అంటారు. 


ఏముంటాయి?

మైక్రోగ్రీన్స్‌కు విత్తనాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో దొరుకుతున్నాయి. వీటి పనిముట్లు, పరికరాలు, ప్రత్యేక మట్టి, ట్రేలను అమ్మే కంపెనీలు కూడా వచ్చాయి. కాయగూరలు.. వన మూలికల విత్తనాల నుంచి తొలిగా చిగురించే ఆకులే మైక్రోగ్రీన్స్‌ అని చెప్పుకున్నాం కదా. ఈ మొక్కలు రెండు, మూడు అంగుళాల పొడవు పెరుగుతాయి. మైక్రోగ్రీన్స్‌ ట్రెండ్‌ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. ఎనభైల నుంచి వీటి వినియోగం మొదలైనా.. ఊపందుకుంది మాత్రం ఇప్పుడే. ప్రస్తుతం మార్కెట్లో 30 రకాల మైక్రోగ్రీన్స్‌ మొక్కలు లభ్యమవుతున్నాయి. ముల్లంగి, ఎర్ర ముల్లంగి, బ్రొకొలి, కాలిఫ్లవర్‌, క్యారెట్‌, పాలకూర, తోటకూర, క్యాబేజి, బీట్‌రూట్‌, తులసి, కొత్తిమీర, వాము, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, కీర దోసకాయ, బీన్స్‌, బఠానీ, మెంతి, ఆవాలు, శనగలు తదితరాలను ప్రముఖంగా పేర్కొనాలి. వరి, గోఽధుమ, మొక్కజొన్న, బార్లీల బుల్లి మొక్కల్ని పెంచడానికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే గోధుమగడ్డి చాలా మందికి తెలుసు. సాధారణ విత్తనాలకీ, మైక్రోగ్రీన్స్‌ విత్తనాలకీ వ్యత్యాసం ఉంటుంది. పెంచడం సులభమా?

చాలా సులభం. చిన్న బాల్కనీ సైజు జాగా ఉంటే చాలు. ఎలాగూ పూల కుండీలు ఉంటాయి కదా. ఆ స్థలం చాలు. అయితే ఎండ తప్పక తగలాలి. సూర్యరశ్మి లేకపోతే మొక్కలు ఆరోగ్యంగా పెరగవు. మైక్రోగ్రీన్స్‌కు సాధారణ విత్తనాలు వాడకూడదు. ప్రత్యేకంగా విక్రయించే మైక్రోగ్రీన్స్‌ విత్తనాలను మాత్రమే వినియోగించాలి. సాధారణ విత్తనాలు వీటికి పనికిరావు. ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో మైక్రోగ్రీన్స్‌ సీడ్స్‌ పేరుతో ప్రత్యేకంగా లభ్యమవుతున్నాయి. ఇక, బుల్లి మొక్కల్ని ఎలా పెంచాలో తెలుసుకుందాం. వీటిని పెంచడానికి ఓ కంటెయినర్‌ కావాలి. నర్సరీలలో అనేక రకాల సైజుల్లో సీడ్‌ ట్రేలు దొరకుతాయి. మీ జాగాను బట్టి వాటిని ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే ఇళ్లలోని మొక్కల కుండీలైనా ఫర్లేదు. నాలుగైదు ఇంచుల లోతు ఉన్న ఏ పాత్రలోనైనా వీటిని పండించవచ్చు. ముందుగా వాటిలో ఓ మ్యాట్‌ పెట్టాలి. తోటలోని మట్టి లేదా నర్సరీలో దొరికే మట్టిని (కోకోపిట్‌) మ్యాట్‌పైన పోయాలి. ఈ మట్టిలో రసాయనాలు, పెస్టిసైడ్స్‌ లేకుండా చూసుకుంటే సేంద్రీయ మైక్రోగ్రీన్స్‌ను పండించినట్లు అవుతుంది. మ్యాట్‌పైన మూడు నాలుగు అంగుళాల ఎత్తు వరకు మట్టిని తీసుకుని దాన్నంతా చదునుగా చేసుకోవాలి. ఆ మట్టిపై విత్తనాల్ని వెదజల్లాలి. సమంగా చల్లాలనేం లేదు.. ఎలా చల్లినా మొలకెత్తుతాయి. విత్తనాలను కవర్‌ చేస్తూ పైన ఒక పొర మట్టిని పరచాలి. సూర్యరశ్మి అవసరం..

కష్టపడి మైక్రోగ్రీన్స్‌ విత్తనాలైతే నాటాం. అవి నీడలో పెరిగితే సరిపోదు. ఎండ తప్పనిసరి. మైక్రోగ్రీన్స్‌ ఎదుగుదలలో నీళ్లు కూడా ఎంతో అవసరం. ఒకసారి నీళ్లు పోసి మరో రెండు మూడు రోజులకు పోస్తే ప్రయోజనం లేదు. కుండీల్లోని మట్టి నిత్యం తడిగానే ఉండాలి. హ్యాండ్‌ స్ల్పింక్లర్‌తో నీటిని చల్లితే చాలు. మట్టంతా ముద్దయి.. నీరు పొంగిపొర్లేలా చేయకూడదు. సాధారణ గది ఉష్ణోగ్రతలో ఆ కుండీని అలాగే రెండు రోజులు ఉంచాలి. అంకురం మొలకెత్తిన తరవాత సూర్యరశ్మి తగిలే ప్రదేశానికి కుండీని తరలించాలి. రోజూ కనీసం మూడు నాలుగు గంటలు సూర్యరశ్మి లభించే ప్రదేశంలో ఉంచాలి. కిటికీ పక్కన, బాల్కనీ, ఆరు బయట .. ఎండ పడే ఏ ప్రదేశమైనా ఫర్లేదు. రెండు రోజులకోసారి నీటిని చల్లుతూ ఉండాలి. నాలుగు రోజులయ్యాక చిన్నచిన్న ఆకులు, వాటి కింద చిన్నపాటి కాండం బయటికి పొడుచుకొస్తాయి. వారం రోజులు తిరిగేసరికి .. కుండీ నిండుగా పచ్చటి మైక్రోగ్రీన్స్‌ మొలకెత్తి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ మొక్కలు రెండు, మూడు అంగుళాల పొడవు పెరిగాక.. కట్‌ చేసి ఆహారంగా తీసుకోవచ్చు. పొడువాటి కాడలు కావాలనుకుంటే, మరో రెండు రోజులు ఆగవచ్చు. వీటిని కట్‌ చేయడానికీ ఓ పద్ధతి ఉంది. కత్తెర లేదా కత్తితో దిగువన కాడల్ని పట్టుకుని మెల్లగా మొక్కల్ని కోయాలి. వాటిని తాజా నీటితో శుభ్రంగా కడిగి నేరుగా వినియోగించవచ్చు. కడిగిన తరవాత మొక్కల్ని తుడిచి పేపర్‌ కవర్లో పెట్టి ఫ్రిజ్జులో భద్రపరచవచ్చు. సలాడ్స్‌, స్మూతీలు, శాండ్‌విచ్‌లు, కూరల్లో అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.


ఎక్కడ దొరుకుతాయి?

ఇప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్‌లో దొరకని వస్తువులంటూ ఏమీ లేవు. మైక్రోగ్రీన్స్‌ కిట్‌లను కూడా విక్రయిస్తున్నారు. అయితే నాణ్యమైన సంస్థలు ఉత్పత్తి చేసే వాటినే కొనుగోలు చేయాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం సుమారు 30 జాతుల మైక్రోగ్రీన్స్‌ విత్తనాలు లభిస్తున్నాయి. మైక్రోగ్రీన్స్‌ గ్రోయింగ్‌ కిట్స్‌ పేరుతో వివిధ రకాల వస్తువులను సైతం విక్రయిస్తున్నాయి కొన్ని సంస్థలు. ఒక కిట్‌లో - మొక్కల్ని పెంచుకునే ట్రేలు, విత్తనాలు, అవసరమైన సరంజామా ఉంటుంది. ఉద్యానవన పెంపకంలో ఏమాత్రం అనుభవం లేకపోయినా సరే.. ఈ మైక్రోగ్రీన్స్‌ కిట్స్‌ను సులభంగా వాడొచ్చు. అభిరుచికి తగినట్టుగా అనేక రకాల మైక్రోగ్రీన్స్‌ను ఓ పెద్ద ట్రేలో పండించవచ్చు. లేదా చిన్న చిన్న ట్రేలలో ఒక్కో మొక్క జాతిని పెంచొచ్చు. అలాగే సంప్రదాయబద్ధమైన సాయిల్‌ కిట్స్‌, మట్టి లేకుండా పండించగల హైడ్రోపోనిక్‌ కిట్స్‌ కూడా లభ్యమవుతున్నాయి. ఇక మ్యాట్‌ల విషయానికి వస్తే కొబ్బరి, వెదురు లాంటివీ ఆర్డర్‌ చేసుకోవచ్చు. స్నేహితులు లేదా బంఽధువుల జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులకు కానుకగా మైక్రోగ్రీన్స్‌ సీడ్స్‌ ప్యాక్‌లను అందిస్తున్నారిప్పుడు. తీసుకున్నవాళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఇచ్చిన వాళ్ల బంధం బలపడుతుంది. పచ్చకానుకతో చక్కటి ప్రయోజనం నెరవేరుతుంది. 


సూపర్‌ పవర్‌

మైక్రోగ్రీన్స్‌ తక్కువ సమయంలో పెరిగేవే కాదు.. చాలా ఆరోగ్యకరం, ఎంతో రుచికరం. విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ వీటిల్లో ఎక్కువ మొత్తంలో కేంద్రీకృతమై ఉంటాయి. పెద్దగా పెరిగిన మొక్కల కంటే వీటిలో అయిదు శాతం పోషక విలువలు అఽధికం. ఉదాహరణకు సాధారణ రెడ్‌ క్యాబేజీలో కంటే రెడ్‌ క్యాబేజి మైక్రోగ్రీన్స్‌లో విటమిన్‌ ఈ నలభై రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఓ గుప్పెడు రెడ్‌ క్యాబేజీ మైక్రోగ్రీన్స్‌లో రెండు కేజీల రెడ్‌ క్యాబేజీలో ఉన్నన్ని విటమిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, న్యూట్రియంట్స్‌ ఉంటాయట. అంటే దీనిని బట్టి ఇవి ఎంత శక్తిమంతమైనవో ఊహించవచ్చు.


మైక్రోగ్రీన్స్‌లో అత్యధికంగా ఉండే పోషకాల్లో.. ఖనిజాలు, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింకు, విటమిన్లు ఎ, బి, సి, ఇ, కె, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్‌.. ఇలా అనేకం ఉంటాయి.


మితమే హితం..

మైక్రోగ్రీన్స్‌ మంచివేనా? వీటి వల్ల శరీరానికి ఏదైనా హాని జరుగుతుందా? అనే సందేహాలు కలగక మానవు. మైక్రోగ్రీన్స్‌ సురక్షితమైనవేనని నిపుణులు చెబుతున్నారు. మొలకలతో పోలిస్తే వీటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందడం అరుదు. అంతేకాకుండా కాండం, ఆకులు తప్పించి వేర్లు, విత్తనాలను తీసుకోము కాబట్టి మంచివే. మైక్రోగ్రీన్స్‌ను వృద్ధిచేసే మ్యాట్‌లను మళ్లీ మళ్లీ వాడేవి కాకుండా ఒకసారి మాత్రమే వినియోగించే వాటిని కొనడం ఉత్తమం. ఉడికించడం వల్ల కూరగాయల్లోని బ్యాక్టీరియా, ఫంగస్‌ తదితరాలను దూరం చేయవచ్చు. అయితే మైక్రోగ్రీన్స్‌ను ఉడికిస్తే అందులోని పోషక పదార్థాలు తగ్గుతాయి. అందుకే వీటిని పచ్చిగా తినడం మంచిది. కాబట్టి పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు వీటికి దూరంగా ఉండడమే శ్రేయస్కరం. అలాగే ఎక్కువ మోతాదుల్లో పోషకాలు ఉండడం వల్ల కొద్దిగానే తీసుకోవాలి. మితిమీరి తినొద్దు. ఇతరత్రా సమస్యలున్న వాళ్లు పోషకాహార నిపుణులను సంప్రదించవచ్చు. 

ప్రాచీన కాలం నుంచీ మన ఆహారంలో గింజలకు ఎనలేని ప్రాధాన్యం ఉంటూ వచ్చింది. ఆ తరువాత ఆధునిక కాలంలో మొలకలు తింటే తిరుగులేదు అన్నారు. ఇప్పుడు అత్యాధునిక కాలం.. ఆరోగ్యం కోసం ప్రతిదీ ఆచితూచి ఆలోచించి తినాల్సిన పరిస్థితి. అందుకే.. గింజ, మొలకల తరువాత దశలో పెరిగే.. మైక్రోగ్రీన్స్‌ ఇంకా మంచివి అంటున్నారు పోషకాహార నిపుణులు. కాలం మారుతున్న కొద్దీ - మన తిండి మోతాదు తగ్గిపోయి.. పోషక విలువల శక్తి పెరిగాలి.. అలా యుక్తితో తినేవాళ్ల కొత్త తిండి మైక్రోగ్రీన్స్‌. 


డి.పి.అనురాధఇంట్లోనే పెంచుకోండి..

పూర్తిగా పెరిగిన మొక్కలు, కూరలు లేదా ఆకులతో పోలిస్తే మైక్రోగ్రీన్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువే. ముఖ్యంగా కెరోటొనాయిడ్స్‌, టోకోఫెరాల్స్‌ అధికం. ఏ రకమైన మైక్రోగ్రీన్స్‌ అనే దాన్ని బట్టి వాటి రంగు, రుచి మారుతుంటుంది. పూర్తిగా పెరిగిన ఆకులతో పోలిస్తే ఫైబర్‌ తక్కువగా, ప్రక్టోజ్‌ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని పచ్చిగా తినేందుకు రుచిగా ఉంటాయి. చాలా రకాల ఆకుకూరల్లో విటమిన్‌ - సి ఉన్నప్పటికీ వండడం వల్ల అది తగ్గిపోతుంది. అదే మైక్రోగ్రీన్స్‌ను పచ్చిగా తినడం వల్ల వాటిలోని విటమిన్‌ సి కూడా మనకు అందుతుంది. పోషకాలు ఎక్కువున్నా, మామూలు ఆకుకూరలతో పోలిస్తే వీటి ఖరీదు ఎక్కువ. అంతే కాకుండా కొన్ని మైక్రోగ్రీన్స్‌ ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందుకని మైక్రోగ్రీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలంటే వాటిని ఇంటి వద్దే చిన్న చిన్న కుండీల్లో పెంచుకున్నట్టయితే ఎప్పటికప్పుడు తాజాగా కోసి వాడుకోవచ్చు. వాడే ముందు చల్లటి నీటిలో బాగా కడగడం మర్చిపోకూడదు.

డా. లహరి సూరపనేని, పోషకాహార నిపుణురాలు


ఏంటి లాభం?

ఎంత తిన్నామన్నది కాదు, ఏం తిన్నామన్నదే ఇప్పుడు ముఖ్యం. బంగారం తూకమేసినట్లు.. క్యాలరీల లెక్కన తిండితినాల్సిన పరిస్థితి. లేకపోతే ఆధునిక జీవనశైలి గాడి తప్పుతుంది. అధిక బరువుతో పాటు అనేక అనర్థాలు తలెత్తుతాయి. ఇప్పటి వరకు - ఆకు కూరలు, కాయగూరల్ని తినడం ఆరోగ్యకరం అన్నది మనందరికీ తెలుసు. తక్కువ మోతాదులో ఎక్కువ పోషక విలువలున్న ఆహారం తినాలనుకున్నప్పడు మైక్రోగ్రీన్స్‌ చక్కటి మార్గం. ఇవి తరచూ తింటుంటే.. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు. 

గుండెజబ్బులు: యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటైన పాలిఫెనాల్స్‌ మైక్రోగ్రీన్స్‌లో అధికం. కాబట్టి వీటిని భుజించడం వల్ల చెడుకొవ్వు తగ్గుతుంది, హృద్రోగాలను అడ్డుకుంటుంది. అల్జీమర్స్‌: వృద్ధాప్యంలో శాపంగా మారుతోన్న వ్యాధి అల్జీమర్స్‌ (తీవ్ర మతిమరుపు). మైక్రోగ్రీన్స్‌లో అత్యధికంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకోవచ్చు.

మధుమేహం: యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి రక్త సరఫరా సజావుగా జరిగేలా చూస్తాయి. దీంతో మధుమేహ సమస్య తగ్గుతుంది. 

క్యాన్సర్లు: కూరగాయల్లో అధికంగా ఉండే పాలిఫెనాల్స్‌ వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు దరిచేరవు. అత్యధిక స్థాయిలో పాలిఫెనాల్స్‌ ఉన్న మైక్రోగ్రీన్స్‌ క్యాన్సర్‌ నిరోధకాలుగా పనిచేస్తాయి. అయితే ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.
ఏ మొక్కలో ఏం ఉంది?


ప్రకృతి మనందరికీ కన్నతల్లి. అన్నీ ఇచ్చింది. ఆ క్రమంలోనే ప్రతి మొక్కకు ఒక ఆరోగ్య విశిష్టత ఉంది. మైక్రోగ్రీన్స్‌లోనూ అదే వైవిధ్య కనిపిస్తుంది. ఎందులో ఏముందో తెలుసుకుందాం..


ముల్లంగి

చాలా తొందరగా మొలకెత్తే మైక్రోగ్రీన్స్‌ మొక్కల్లో ముల్లంగి మొదటి స్థానంలో ఉంది. కొత్తగా ఈ మొక్కల్ని పెంచాలని అనుకునేవారికి రాడిష్‌ మంచి ఛాయిస్‌. విటమిన్‌ బి, సిలు, జింక్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ముల్లంగి మైక్రోగ్రీన్స్‌లో ఉన్నాయి. ఏడాదంతా కూడా సాధారణ ఉష్ణోగ్రతల్లోనే ఈ మొక్కల్ని సాగు చేయవచ్చు. 


బ్రొకోలి

శరీరంలోని మలినాలను తొలగించడానికి బ్రొకోలి చక్కగా ఉపయోగపడుతుంది. బ్రొకోలి మైక్రోగ్రీన్స్‌లో విటమిన్‌ ఎ, సి, ఇ, కెలు ఉంటాయి. ఇవేగాక ప్రొటీన్లు అధికం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌ ఖనిజాలు లభ్యమవుతాయి. సూప్‌, 

స్మూతీలకు ఈ ఆకులు అదనపు రుచిని కలిగిస్తాయి. మట్టి పాత్రలో బ్రొకొలి మైక్రోగ్రీన్స్‌ బాగా పండుతాయి. ఎనిమిది నుంచి పది రోజుల్లో మొలకెత్తుతాయివి.


బీట్‌రూట్‌

ప్రత్యేకమైన రంగు కారణంగా బీట్‌రూట్‌తో చేసిన ఏ ఆహార పదార్థమైనా కళ్లను ఇట్టే ఆకట్టుకుంటుంది. బీట్‌రూట్‌ మైక్రోగ్రీన్స్‌లో జింక్‌, ఐరన్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఖనిజాలు అధికం. ఇంకా విటమిన్‌ ఎ, బి, సిలతో పాటు కె కూడా ఉండడం విశేషం. ఏడాదంతా ఈ బుల్లి మొక్కల్ని పండించవచ్చు. బీట్‌రూట్‌ మైక్రోగ్రీన్స్‌ మొలకెత్తడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాయి. వీటికి 18 నుంచి 20 రోజుల సమయం అవసరం. 


పాలకూర

ముదురు ఆకు పచ్చరంగు పాలకూర మైక్రోగ్రీన్స్‌ను రసాల్లోనూ, స్మూతీస్‌గానూ వాడొచ్చు. ఇందులో ఐరన్‌, పొటాషియం, కాల్షియంతో పాటు విటమిన్‌ ఎ, సి అధికం. అధిక రక్తపోటు నియంత్రణకు, క్యాన్సర్‌ నివారణకు, మధుమేహాన్ని తగ్గించేందుకు ఈ బుల్లిమొక్కలు సహాయపడతాయి. ఇవి ఏపుగా పెరిగేందుకు చక్కని వెళుతురు, గాలీ ఉండాలి. 


పొద్దుతిరుగుడు

శరీరానికి అవసరమైన ఎన్నో పోషక పదార్థాలు పొద్దుతిరుగుడు మైక్రోగ్రీన్స్‌లో ఉన్నాయి. విటమిన్‌ ఎ, బి, సిలు ఇందులో పుష్కలం. కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, సల్ఫర్‌, జింక్‌ ఖనిజాలు సమృద్ధిగా లభ్యమవుతాయి. ఎదిగిన మొక్కలతో పోలిస్తే వీటిలో క్యాన్సర్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు అయిదు రెట్లు అధికం. కాస్త తీపిగా ఉండే ఈ బుల్లిమొక్కల్ని సలాడ్స్‌లో భాగంగా తీసుకోవచ్చు. అయితే ఈ విత్తనాలను మట్టిలో వెదజల్లే ముందు పది గంటల పాటు చల్లని నీటిలో నానబెడితే ఆశించిన దిగుబడి వస్తుంది.


ఆల్‌ఫాల్ఫా 

గడ్డి జాతికి చెందిన మైక్రోగ్రీన్స్‌ ఇవి. వీటి వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి, రొమ్ము క్యాన్సర్‌ రాకుండా అరికడతాయి. మధుమేహాన్నీ నియంత్రిస్తాయి. ఎముకల ఆరోగ్యానికీ పాటుపడతాయి. దీనికంతటికీ కారణం.. పొటాషియం, ఐరన్‌, కాల్షియం, జింక్‌ ఖనిజాలతో పాటు విటమిన్‌ ఎ, బి1, బి6, సి, ఇ, కెలు ఆల్‌ఫాల్ఫా మైక్రోగ్రీన్స్‌లో దండిగా ఉండటం. 


పాక్‌చోయి

చైనీస్‌ క్యాబేజీగా పాక్‌చోయి పేరుతెచ్చుకుంది. కాస్త ఆవాల్లాంటి రుచి కలిగి ఉంటుంది. ఆహార పదార్థాలపైన అందంగా అలంకరిస్తుంటారు. మిగతా వాటితో పోలిస్తే పాక్‌చోయి మైక్రోగ్రీన్స్‌ని సులభంగా పెంచవచ్చు. వీటిలో విటమిన్‌ ఇ, సి, కె సమృద్ధిగా లభిస్తాయి. ఐరన్‌, బీటా కెరొటిన్‌ ఎక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. ఎముకల దృఢత్వానికీ మంచిది. అయితే ఈ విత్తనాలకు ఎక్కువ వెళుతురుంటే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి తక్కువ లైటింగ్‌లో పెంచొచ్చు.

Read more