‘మీట్‌’... మరింత ‘స్మార్ట్‌’గా!

ABN , First Publish Date - 2020-12-20T17:41:25+05:30 IST

కార్తీకమాసం పూర్తయింది. ఇన్నాళ్లూ ముక్క రుచి చూడకుండా నోళ్లు కట్టుకున్న వాళ్లంతా... ఇప్పుడు ..

‘మీట్‌’... మరింత ‘స్మార్ట్‌’గా!

కార్తీకమాసం పూర్తయింది. ఇన్నాళ్లూ ముక్క రుచి చూడకుండా నోళ్లు కట్టుకున్న వాళ్లంతా... ఇప్పుడు ఆన్‌లైన్‌ డెలివరీల మీద పడ్డారు. ఒక్క క్లిక్‌ చేస్తే చాలు.. పొద్దున్నే తాజా చికెన్‌, మటన్‌, రొయ్యలు, పీతలు, చేపలు... ఏవి కావాలంటే అవి ఇంటి గుమ్మం ముందు వాలిపోతున్నాయి. కరోనా కాలంలో నాన్‌వెజ్‌ స్టార్టప్‌ డెలివరీ యాప్‌లు ఉప్పెనలా వచ్చి పడ్డాయి. ఒక్కసారి వీటి రుచి మరిగితే మానేయడం కష్టం అంటున్నారు మాంసం ప్రియులు..


వీధి చివర్లో ఉన్న మాంసం కొట్టుకు వెళ్లాలంటే చిరాకు... చేపల మార్కెట్‌కు వెళితే బేరమాడలేక ‘బేర్‌’మనాల్సిందే. అలాగని జిహ్వరుచిని చంపుకోలేం కదా. గంటల తరబడి దుకాణం ముందు క్యూలో నిల్చున్నా... నచ్చిన ‘ముక్క’లు వేస్తాడనే గ్యారెంటీ లేదు. పైగా ఇదసలే కరోనా కాలం... కూరగాయలు, గ్రాసరీల్లాగే ‘ఫ్రెష్‌ మీట్‌’ కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటే... ‘ఆ మజాయే వేరం’టోంది ‘స్మార్ట్‌’గా తాజా మాంసాన్ని ఆర్డర్‌ చేస్తున్న నవతరం. అవును... డె‘లీషియస్‌’గా ‘టెండర్‌కట్‌’ మాంసాన్ని ‘ఫ్రెష్‌ టు హోమ్‌’కు అందించి ‘లెట్స్‌ మీట్‌’ అంటున్న స్టార్టప్‌లు లే‘టేస్ట్‌’గా మాంసం ప్రియుల మనసు దోచుకుంటున్నాయి.


వీకెండ్స్‌ వచ్చాయంటే చాలు ఇంట్లో ‘నాన్‌వెజ్‌’ రుచులు ఉండాల్సిందే. ఉదయమే చేపల మార్కెట్‌తో పాటు, వీధి చివర ఉన్న చికెన్‌, మటన్‌ సెంటర్ల ముందు నాన్‌వెజ్‌ ప్రియులు క్యూలు కడతారు. కావాల్సిన ‘ముక్క’ పడాలంటే మరికాసేపు వేచి ఉండాల్సిందే. ఇప్పుడంటే బ్యాన్‌ అయ్యాయిగానీ, కొన్నాళ్ల క్రితం దాకా మాంసాన్ని నల్లటి పాలిథీన్‌ కవర్లలో వేసిచ్చేవారు. తీరా ఇంటికి తీసుకొచ్చాక ‘అంతా కొవ్వుందని, ముక్కలు సరిగా కట్‌ చేయలేదం’టూ శ్రీమతి సణుగుడు. ప్రతీ ఇంట్లో ఇలాంటి సీన్‌ కామన్‌.


కాలం మారింది... దుస్తుల దగ్గరి నుంచి, ఎలకా్ట్రనిక్‌ వస్తువుల దాకా... గ్రాసరీ దగ్గరి నుంచి, కూరగాయల దాకా... బిర్యానీ నుంచి, పిజ్జాల దాకా.... ఇంటికి అవసరమైన ప్రతీది ఆన్‌లైన్‌లో ‘స్మార్ట్‌’గా అందుబాటులోకి వచ్చి చాలాకాలమే అయ్యింది. ఇప్పుడు ఈ కోవలోకి తాజాగా ‘ఫ్రెష్‌ మీట్‌’ కూడా వచ్చి చేరింది. ఆర్డరిస్తే అరగంటలో కోరుకున్న చేపలు, మటన్‌, చికెన్‌ను కావాల్సిన సైజ్‌లో కట్‌ చేసి... ఆకట్టుకునే ప్యాక్‌లో అత్యంత పరిశుభ్రంగా అందిస్తున్నాయి కొన్ని స్టార్టప్‌ కంపెనీలు. నిజానికి ఐదేళ్ల క్రితమే ఈ ట్రెండ్‌ మొదలైనప్పటికీ ‘ఫ్రెష్‌మీట్‌’కు సంబంధించిన అంశం కాబట్టి కస్టమర్లలో నమ్మకం ఏర్పరచుకోవడానికి వాటికి ఇన్నేళ్లు పట్టింది. ప్రస్తుతం ఆయా నగరాల్లో ‘ఫ్రెష్‌ మీట్‌’ అందిస్తున్న సంస్థలు డజనుకు పైగా ఉన్నాయి. వాటిలో ‘లీషియస్‌’, ‘టెండర్‌ కట్స్‌’, ‘ఓన్లీ మీట్‌’, ‘మస్తాన్‌’, ‘రాయల్‌ చికెన్‌’, ‘మీటిగో’, ‘ఫిష్‌ హుక్‌’, ‘ఫ్లెష్‌కార్ట్‌’, ‘లెట్స్‌ మీట్‌’, ‘ఫిపోలా’, ‘జాప్‌ఫ్రెష్‌’, ‘ఫ్రెష్‌ టు హోమ్‌’ మొదలైనవి రోజురోజుకు కస్టమర్లను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా 25 నుంచి 35 ఏళ్ల నవతరం ఇస్తున్న ఆర్డర్లతో ఆయా స్టార్టప్‌ల బిజినెస్‌ మూడు మటన్‌లు, ఆరు చికెన్‌లుగా అభివృద్ధి చెందుతోంది. 


పెద్ద మార్కెట్‌... కానీ...

మనదేశంలో మాంసం విక్రయాల విలువ ఏటా 3 వేల కోట్ల డాలర్లుగా (సుమారుగా 2 లక్షల 25వేల కోట్ల రూపాయలు) ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అయితే ఈ మార్కెట్‌ అసంఘటితంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ మనదేశంలో 92 శాతం మాంసం విక్రయాలు రోడ్ల పక్కన ఉన్న చిన్న చిన్న షాపుల్లోనే జరుగుతున్నాయి. సరైన ఉష్ణోగ్రతలు లేని ప్రదేశంలో, సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అపరిశుభ్ర వాతావరణంలో వీటి విక్రయాలు జరుపుతుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆర్గానిక్‌, ఫామ్‌ఫ్రెష్‌ కూరగాయల్లాగే... మాంసం ఉత్పత్తులను ఈ తరానికి హైజెనీక్‌గా అందించేందుకు, ఆధునిక ఆలోచనలతో ఈ రంగంలో పలు స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. మాంసం విక్రయాలు మనదేశంలో శరవేగంగా పెరిగే అవకాశాన్ని వీరు గుర్తించారు.


‘మీట్‌ సైన్స్‌’ డాక్టర్స్‌!

మాంసం అమ్మకాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు... అదొక సైన్స్‌ అంటున్నాయి స్టార్టప్‌ కంపెనీలు. ఆరోగ్యకరమైన మాంసం కావాలంటే గొర్రెలు, కోళ్లకు సంబంధించిన వయసు, బరువును కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఎలాంటి వాతావరణంలో పెంచాలి? వాటికి ఎలాంటి ఆహారాన్ని అందించాలి? ఎప్పుడు వాటిని కట్‌ చేయాలి? అనే అంశాలను బట్టే మాంసం నాణ్యత ఆధారపడి ఉంటుంది. ‘టెండర్‌’ మీట్‌ను అందించడమే లక్ష్యంగా ఆయా స్టార్టప్‌లు ప్రత్యేకంగా ఆహార నిపుణులను, వెటర్నరీ డాక్టర్స్‌ను నియమించుకుంటున్నాయి. 


మారినేటెడ్‌... రెడీ టు కుక్‌...

సాధారణంగా చాలామంది నాన్‌వెజ్‌తో కర్రీ, ఫ్రై మాత్రమే చేస్తుంటారు. ఏదైనా వెరైటీగా తినాలంటే రెస్టారెంట్‌ నుంచి తెప్పించుకుంటారు. కానీ ‘ఫ్రెష్‌ మీట్‌’ స్టార్టప్‌లు ఇంటికే రకరకాల రుచులను తీసుకొస్తున్నాయి. ‘ఫ్రెష్‌ మీట్‌’తో పాటు రెడీ టు కుక్‌, మారినేటెడ్‌ మాంసాన్ని కూడా అందుబాటులోకి తెచ్చాయి.ఉదాహరణకు మీరు ‘అఫ్ఘానీ ముర్గ్‌ షేక్‌ కబాబ్‌’ తినాలనుకుంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే 75 రూపాయలకు ఒక కబాబ్‌ను మారినేట్‌ చేసి ఇంటికి పంపిస్తారు. దాన్ని ఎంచక్కా కాస్తంత నూనెలో వేయించుకుని తినేయడమే. ‘భేట్కీ తవా ఫ్రై’, ‘కట్‌లెట్‌’, ‘మలాయ్‌ టిక్కా’, ‘చికెన్‌ వింగ్స్‌’, ‘నీలగిరి ఫిష్‌ టిక్కా’, ‘చిల్లీ చికెన్‌’, ‘అమృత్‌సర్‌ అచారీ ముర్గ్‌’, ‘క్రీమీ చికెన్‌’, ‘చికెన్‌ 65’, ‘బెంగాలీ ఫిష్‌ ఫింగర్‌’, ‘లక్నో మటన్‌ గలౌటీ’, ‘ప్రాన్స్‌ జఫ్రానీ’, ‘తందూరీ చికెన్‌’, ‘తవా ఫ్రై’, ‘రోస్ట్‌ చికెన్‌’... ఇలా రెస్టారెంట్లలో దొరికే అన్ని రకాలను మారినేట్‌ చేసి పంపుతారు. వాటిని తవాలో నూనె పోసి, లేదా మైక్రోవేవ్‌ ఒవెన్‌లో పెట్టి... వేడివేడిగా తినడమే. ఈ రంగంలో అందరికన్నా ముందున్న ‘లీషియస్‌’ ఒకడుగు ముందుకేసి ‘బటర్‌ చికెన్‌’, ‘కాంటినెంటల్‌ చికెన్‌’, ‘షవర్మా చికెన్‌’, ‘మస్టర్డ్‌ చికెన్‌’ వంటి వెరైటీ నాన్‌వెజ్‌ స్ర్పెడ్స్‌ను కూడా అమ్ముతోంది. వాటిని బ్రెడ్‌పైగానీ, రొట్టెలపైగానీ స్ర్పెడ్‌ చేసి తినొచ్చు. 


ఇదీ లెక్క...

మనదేశంలో నాన్‌వెజ్‌ మార్కెట్‌ విలువ ఏడాదికి 2 లక్షల 25 వేల కోట్ల రూపాయలు.

ఇందులో పౌలీ్ట్ర మార్కెట్‌ విలువ 66 వేల కోట్ల రూపాయలు.

ఇప్పటికీ మన దేశంలో 92 శాతం మాంసం విక్రయాలు రోడ్ల పక్కన ఉండే చిన్న చిన్న దుకాణాల్లోనే జరుగుతున్నాయి.

లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ ఫ్రెష్‌మీట్‌ స్టార్టప్స్‌ బిజినెస్‌ 300 శాతం పెరిగింది.

కస్టమర్ల ఆర్డర్లకు సరిపడా సప్లయ్‌ చేయలేక కొన్ని కంపెనీలు స్విగ్గీ, జొమాటోలతో టైఅప్‌ పెట్టుకున్నాయి. 

లాక్‌డౌన్‌ వేళ దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అత్యధికంగా ఆర్డర్‌ ఇచ్చిన ఫుడ్‌ చికెన్‌ బిర్యానీ (5.5 లక్షల ఆర్డర్లు). 


ప్రాసెస్‌ నుంచి డెలివరీ దాకా...

ఇంతకు ముందు కొన్ని సూపర్‌మార్కెట్‌లలో ‘ఫ్రోజోన్‌ మీట్‌’ మాత్రమే లభించేది. అయితే సాధారణంగా మాంసాన్ని ఫ్రెష్‌గా తినాలనుకుంటారు ఎవరైనా. అందుకే క్యూలో నిల్చోవడం కాస్త కష్టమైనా, ఓపిక చేసుకుని ఇంటికి దగ్గర్లో ఉన్న మటన్‌, చికెన్‌ సెంటర్లకు, ఫిష్‌ మార్కెట్‌కు వెళ్తుంటారు. చాలామంది నాన్‌వెజ్‌ తినడానికి ఇష్టపడతారుగానీ, వాటిని తేవడానికి వెళ్లాలంటే మాత్రం చిరాగ్గా ఫీలవుతారు. అందరికీ సరైన మీట్‌ను ఎంచుకునే సామర్థ్యం ఉండదు. అంత గిరాకీలో షాపువాడు ఎలాంటి ముక్కలు వేస్తాడో తెలియదు. దాంతో కొన్నిసార్లు గొడవకు దిగాల్సి వస్తుంది. లేదంటే మరో దుకాణానికి వెళ్లాలి. అక్కడ కూడా దాదాపుగా ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుంది. కస్టమర్లలో తలెత్తే ఈ అసౌకర్యాన్నే స్టార్టప్‌లు తమకు అనుకూలంగా మలుచుకున్నాయి.


ముందుగా ‘మీట్‌’ అనగానే అదేదో అంటరాని పదార్థంగా భావిస్తూ, ఎవరి కంటా పడకుండా నల్లటి పాలిథీన్‌ కవర్లలో సీక్రెట్‌గా ఇంటికి తీసుకొచ్చేది కాదనే కాన్సెప్ట్‌ను పోగొట్టి... దానిని రెగ్యులర్‌ ‘ఫుడ్‌’గా బ్రాండ్‌నేమ్‌తో అందించడంలో ‘ఫ్రెష్‌ మీట్‌’ స్టార్టప్‌లు విజయవంతమయ్యాయి. ఒక్కో స్టార్టప్‌ రోజుకు సుమారుగా 3 వేల నుంచి 17 వేలకు పైగా ఆర్డర్లకు అనుగుణంగా ఫ్రెష్‌ మీట్‌ను డెలివరీ చేస్తున్నాయంటే డిమాండ్‌ ఏమేరకు ఉందో అర్థమవుతుంది.


ఓపెన్‌ మార్కెట్లో లభించే మాంసంతో పోల్చుకుంటే తాము డెలివరీ చేస్తున్నవి పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటాయని స్టార్టప్‌ కంపెనీలు చెబుతున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా ఫామ్స్‌ ఏర్పాటు చేసుకుంటున్నాయి. ‘‘మాంసానికి సరైన ఉష్ణోగ్రతలు అవసరం. బయట దుకాణాల్లో వాటిని మెయింటెయిన్‌ చేయడం చాలా కష్టం. ఒక్కోసారి 5 నుంచి 60 డిగ్రీల వరకు కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మాంసం విషపదార్థంగా మారుతుంది. మేము 4 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో మాంసాన్ని ఉంచుతాం కాబట్టి సేఫ్‌గా ఉంటుంది. ధరల విషయానికొస్తే లోకల్‌ మార్కెట్‌ ధరలకు మా ధరలకు పెద్దగా తేడా ఉండదు. కొన్నిసార్లు మార్కెట్‌ ధర కన్నా తక్కువకే ఆఫర్లు ఇస్తుంటాం’’ అని ‘టెండర్‌కట్స్‌’ వ్యవస్థాపకుడు, సీఈవో నిశాంత్‌ చంద్రన్‌ అంటున్నారు. చెన్నై ప్రధాన కేంద్రంగా సాగుతున్న ఈ స్టార్టప్‌ హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో కస్టమర్లకు ‘ఫ్రెష్‌ మీట్‌’ను అందిస్తోంది. ప్రాసెస్‌, ప్యాకింగ్‌ నుంచి డెలివరీ దాకా స్టార్టప్‌ కంపెనీలు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నాయి.

 

కోరిన విధంగా...

సరికొత్త స్టార్టప్‌లు మాంసం ప్రియుల మనసు దోచుకోవడానికి మరో కారణం... కోరుకున్న సైజులో, కొత్త రుచులను ఆస్వాదించే అవకాశం ఏర్పడటం. ఉదాహరణకు కొందరికి నాన్‌వెజ్‌ బిర్యానీ ఇష్టం. మరికొందరికి కర్రీ ఇష్టం. ఇంకొందరికి ఫ్రై ఇష్టం. నాన్‌వెజ్‌తో వెరైటీలు చేసుకోవాలనే ఆసక్తి కూడా చాలామందిలో ఉంటుంది. అందుకే ఒక్కో రకానికి ఒక్కో ‘కట్‌’ ఉంటుంది. స్టార్టప్‌ యాప్‌లోకి వెళితే... రకరకాల ‘కట్‌’ల ఫొటోలు, ధరలతో సహా కనిపిస్తాయి. ‘కర్రీ కట్‌’, ‘బిర్యానీ కట్‌’, ‘ఫ్రై కట్‌’, ‘బెంగాలీ కట్‌’, ‘టిక్కా కట్‌’తో పాటు ‘స్టీక్స్‌’, ‘స్లయిస్‌’, ‘బోన్‌లెస్‌ క్యూబ్స్‌’, ‘ఫిల్లెట్‌’... ఇలా రకరకాలుగా ప్రాసెస్‌ చేసిన మాంసం ఫొటోలు నోరూరిస్తాయి. వీటితో పాటు ఖీమా, మటన్‌ కపూరా, బ్రెయిన్‌, లివర్‌ చంక్స్‌, సూప్‌ బోన్స్‌, రిబ్స్‌, చాప్స్‌, చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌, లాలిపాప్స్‌, గిజార్డ్‌, రకరకాల సీఫుడ్‌, ఎగ్స్‌ ... ఇలా ఏది కావాలంటే అది లభిస్తుంది.


వాటిల్లోనే కావాలంటే ‘కాంబో ప్యాక్స్‌’ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. రెగ్యులర్‌ కస్టమర్లకు ఫ్రీ డెలివరీ ఆఫర్‌ కూడా ఉంటోంది. కస్టమర్లు తమకు ఏ సమయంలో డెలివరీ కావాలో ఆప్షన్లు ఇవ్వొచ్చు. సమయాన్ని బట్టి ఆఫర్లలో ఒక్కోసారి భారీ డిస్కౌంట్లు కూడా లభిస్తుంటాయి. నవతరం ఈ ఆఫర్లకు ఫిదా అవుతోందని ఆయా స్టార్టప్‌లకు వస్తున్న ఆర్డర్లను చూస్తే అర్థమవుతుంది. ‘‘మా స్టార్టప్‌ ప్రారంభించిన తర్వాత ప్రతీ ఏడాది 300 శాతం పెరుగుదల కనిపిస్తోంది. కస్టమర్లకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మాంసాన్ని అందించానేదే మా సిద్ధాంతం. లోకల్‌ స్టాల్స్‌తో మాంసం అపరిశుభ్రంగా ఉంటుంది. పైగా వారికి కోల్డ్‌ స్టోరేజీలు కూడా ఉండవు. మా వరకు మేము ప్రత్యేకమైన ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటుచేసుకుని, స్వచ్ఛమైన ఐస్‌ను మేమే తయారుచేసి, మాంసం రవాణాకు వినియోగిస్తున్నాం. క్లీన్‌ వైట్‌ ప్యాకెట్స్‌లో మా మాంసాన్ని ‘ఫుడ్‌’లాగే కస్టమర్లు అందుకుంటారు. 2023కు వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ‘లీషియస్‌’ వ్యవస్థాపకులైన అభయ్‌, వివేక్‌గుప్తా అంటున్నారు. 

 

కరోనాతో ఆన్‌లైన్‌ కళకళ...

కరోనా అనేక వ్యాపారాలను దెబ్బతీసినప్పటికీ ఆన్‌లైన్‌ మార్కెట్‌ మాత్రం ఊపందుకుంది. మాస్క్‌లు, సోషల్‌ డిస్టెన్స్‌ కారణంగా చాలామంది సహజంగానే షాపుల్లోకి, రెస్టారెంట్లకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ‘ఏదైనా సరే ఆన్‌లైనే ఆరోగ్యకరం’ అనే భావనలో ఉన్నారు. ‘స్మార్ట్‌’గా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంటి గుమ్మం వద్దకే కోరుకున్నది డెలివరీ అవుతోంది. ఇంటి సరుకులు, కూరగాయలను కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేస్తున్నారు. ‘మీట్‌’ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండేందుకు ‘ఫ్రెష్‌ మీట్‌’ యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ఈ కరోనా కాలంలో ‘మీట్‌’ ఆన్‌లైన్‌ అమ్మకాల జోరు బ్రహ్మాండంగా సాగుతోంది. ‘కొవిడ్‌ ముందు కన్నా ఇప్పుడు మా బిజినెస్‌ రెట్టింపు అయ్యింది. పైగా నాణ్యత నచ్చిన కస్టమర్లు రెగ్యులర్‌గా ఆర్డర్లు ఇస్తున్నారు.


ఇంతకుముందు కేవలం వారాంతాల్లోనే ఆర్డర్లు ఎక్కువగా వచ్చేవి. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి వారమంతా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి’’ అని ‘జాప్‌ఫ్రెష్‌’ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ సీఈవో, సహ వ్యవస్థాపకుడైన దీపాన్షు మన్‌చందా అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, జైపూర్‌, చంఢీగర్‌లలో ‘ఫ్రెష్‌మీట్‌’ అందిస్తున్న ‘జాప్‌ఫ్రెష్‌’ను మిగతా నగరాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో ‘ఫ్రెష్‌ మీట్‌’ యాప్‌లు ఆర్డర్లతో హోరెత్తుతున్నాయి. రానున్న కాలంలో సూపర్‌ మార్కెట్లలాగే మెల్లమెల్లగా ఈ ఆన్‌లైన్‌ ఫ్రెష్‌మీట్‌ ట్రెండ్‌ నగరాల నుంచి పట్టణాలకు కూడా విస్తరించే అవకాశాలు లేకపోలేదు. ధరలు అందుబాటులో ఉండి, నాణ్యమైన మాంసాన్ని అందిస్తే ఇంట్లో కూర్చుని ‘స్మార్ట్‌’గా ఆర్డర్‌ చేసేందుకు కస్టమర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటారు కదా.          

   - చల్లా శ్రీనివాస్‌ 


ఇద్దరూ ఇద్దరే...

సరిగ్గా ఐదేళ్ల క్రితం... కశ్మీరీ పండిట్‌ అభయ్‌ హంజూరా తన మిత్రుడు చంఢీగడ్‌కు చెందిన వివేక్‌ గుప్తాను కలిశాడు. అప్పటికి అభయ్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గా ఉన్న వివేక్‌ మిత్రుడి ఆలోచన వినగానే వద్దని వారించాడు. ఇండియాలో మాంసం అమ్మకాలు లోకల్‌గా ఉండే దుకాణాల్లో మాత్రమే జరుగుతాయని, ‘ఆన్‌లైన్‌లో అమ్మకం’ అనే కాన్సెప్ట్‌ వర్కవుట్‌ కాదన్నాడు. అయితే అభయ్‌ పట్టుపట్టడంతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. డెలీషియస్‌ (రుచికరమైన) అనే పదం నుంచి ‘లీషియస్‌’ పేరిట 2015లో స్టార్టప్‌ను ప్రారంభించారు.


ఆ తర్వాత ఇద్దరూ తమ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, కుకింగ్‌లో 25 ఏళ్ల అనుభవం ఉన్న జో మనహలన్‌ అనే చెఫ్‌ను సలహాదారుగా పెట్టుకున్నారు. మూడు నెలల పాటు పరిశోధనలు చేసి, తొలుత 300 కోళ్లతో బెంగళూరులో స్టార్టప్‌ కార్యక్రమాలను ప్రారంభించి ఆ తర్వాత హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబయికి విస్తరించారు. ప్రస్తుతం వీరికి 7 నగరాల్లో డెలివరీ సెంటర్స్‌ ఉన్నాయి. నాలుగు ప్రధాన నగరాల్లో ప్రాసెసింగ్‌ సెంటర్స్‌ ఉన్నాయి. ఒక రకంగా ఈ విభాగంలో తొలి ఫుడ్‌ బ్రాండ్‌ ‘లీషియస్‌’. ప్రస్తుతం ప్రతీ నెలా 375 టన్నులకు పైగా మాంసాన్ని మూడు లక్షలకు పైగా కస్టమర్లకు అందిస్తున్నారు. 


ఈ ‘మీట్‌ సైన్స్‌’ డాక్టర్స్‌ వాటి పోషణ నుంచి ప్రాసెస్‌దాకా పర్యవేక్షిస్తుంటారు. సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ప్రతీ 15 రోజులకు ఒకసారి కంపెనీలు నిర్వహిస్తున్న లేదా కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న ఫామ్స్‌కు వెళ్లి బయోచెక్‌ చేస్తుంటారు. అందుకే లోకల్‌ మీట్‌కు, స్టార్టప్స్‌ అందిస్తున్న మీట్‌కు నాణ్యతలో స్పష్టమైన తేడా ఉంటోందంటున్నారు నవతరం కస్టమర్లు.


అయితే మాంసం ఎగుమతులకు ఇస్తున్న ప్రాధాన్యత... వినియోగంలో ఉండటం లేదనేది పలు గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు అమెరికాలో సగటున ఒక వ్యక్తి 80 కిలోలు, మలేషియాలో 40 కిలోల మాంసాన్ని తీసుకుంటుంటే మనదేశంలో అది కేవలం 4 కిలోలు మాత్రమే ఉంది. భారత సాంప్రదాయ భోజనంలో 80 నుంచి 85 శాతం కార్బోహైడ్రేట్స్‌ ఉంటే 10 నుంచి 15 శాతం ప్రొటీన్లు ఉంటున్నాయి. అయితే కరోనా సమయంలో అందరికీ ప్రొటీన్లపై అవగాహన పెరిగింది. దాంతో చేపలు, మటన్‌, చికెన్‌, గుడ్లు వంటి ‘ప్రొటీన్‌ రిచ్‌’ ఆహారాన్ని తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్‌ కూడా ఆన్‌లైన్‌లో మాంసం విక్రయాలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ తరానికి క్వాలిటీ పేరిట డె‘లిషియస్‌’ ‘టెండర్‌ కట్‌’ మాంసం ఉత్పత్తులను నేరుగా ఇళ్లకే పంపించే ‘ఫ్రెష్‌ టు హోమ్‌’ కాన్సెప్ట్‌ను నెమ్మది నెమ్మదిగా అలవాటు చేస్తున్నారు.

Updated Date - 2020-12-20T17:41:25+05:30 IST