ఆకలి ఆ పని చేయిస్తోంది!
ABN , First Publish Date - 2020-06-25T05:30:00+05:30 IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని తలకిందులు చేసింది. జీవన విధానాన్నే కాదు... జీవితాలనూ సమూలంగా మార్చేసింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి కొందరు... తినడానికి తిండి లేక ఇంకొందరు...

కరోనా వైరస్ ప్రపంచాన్ని తలకిందులు చేసింది. జీవన విధానాన్నే కాదు... జీవితాలనూ సమూలంగా మార్చేసింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి కొందరు... తినడానికి తిండి లేక ఇంకొందరు... బతుకు పోరాటంలో ‘పాత్రలు’ రుమారయ్యాయి. అలాంటి ఓ పాత్రే ఢిల్లీకి చెందిన చాంద్ మహమ్మద్ది! చదివేది పన్నెండో తరగతి. అతనికి ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు, తల్లితండ్రులు. ఇంతమందిని పోషించడానికి అతడు కొత్తగా పనిలో చేరాడు. ఆ పని ఎక్కడో తెలుసా..? కొవిడ్‌తో చనిపోయినవారి శవాల మధ్య!
చాంద్ మహమ్మద్ది పెద్ద కుటుంబం. డాక్టర్ కావాలన్నది అతడి కల. కానీ... కరోనా ఆ కలలకు బ్రేక్ వేసింది. లాక్‌డౌన్‌తో అన్నయ్య ఉద్యోగం పోయింది. దీంతో ఇంట్లో ఒక పూట తింటే ఒక పూట పస్తులు. అదీగాక చెల్లెళ్ల స్కూల్ ఫీజ్ కట్టాలి. థైరాయిడ్‌తో బాధపడుతున్న అమ్మకు మందులు కొనివ్వాలి. అన్నీ అత్యవసరమే! కానీ ఎలా? మిగిలినవాళ్లు ఆడపిల్లలు, పెద్దవాళ్లు! ఈ అనూహ్య పరిస్థితుల్లో కుటుంబ అవసరాల కోసం ఇంటి భారాన్ని తనపై వేసుకున్నాడు చాంద్.
‘‘అన్నయ్యది కిరాణా షాప్‌లో చిన్న ఉద్యోగం. లాక్డౌన్ వల్ల దుకాణం మూసేశారు. అన్నయ్య పని పోయింది. దీంతో ఇంట్లో ప్రతి దానికీ వెతుక్కోవాల్సి వచ్చింది. అందుకే నేను ఏదో ఒక పని చేయాలనుకున్నా’’ అంటాడు చాంద్ మహమ్మద్. అతడి అన్నయ్య కొద్దిపాటి సంపాదన, రేషన్ సరుకులు... ఇవే ఆ కుటుంబానికి ఆధారం. ఈ పరిస్థితుల్లో చాంద్ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వెతగ్గా వెతగ్గా ‘లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్’లో ఓ ఉద్యోగం దొరికింది.అదేంటంటే కరోనా వైరస్ తో చనిపోయిన పేషెంట్ల పని!
‘‘నాతోపాటు మరో స్వీపర్ ఉన్నాడు. మేమిద్దరం రోజూ చనిపోయిన పేషెంట్ల శవాలను అంబులెన్స్‌లోకి ఎక్కించాలి. అక్కడి నుంచి శ్మశానానికి తీసుకువెళ్లాలి. స్ర్టెచర్ కిందకు దించి, శవాలను తగులబెట్టాలి. ఇలా రోజుకు రెండు మూడు బాడీలు తీసుకుపోవాల్సి ఉంటుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు చాంద్.
మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు అతడి డ్యూటీ. ఈ ఎనిమిది గంటలూ పీపీఈ కిట్ ధరించే ఉండాలి. దానివల్ల లోపల చెమటలు పట్టి చుక్కలు కనిపిస్తాయి. ఎందుకింత ప్రమాదకరమైన ఉద్యోగం ఎంచుకున్నావంటే... ‘‘ఉద్యోగం కోసం వెతికి వెతికి అలిసిపోయాను. అప్పు కోసం కూడా ప్రయత్నించాను. ఫలితం లేక చివరకు ఇందులో చేరాను. ఇది ప్రాణాలతో చెలగాటమని తెలుసు. వైరస్ సోకే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. కానీ... ఇప్పుడు నాకు పని అవసరం. డబ్బు లేక ఇంట్లోవాళ్లందరూ అవస్థలు పడుతున్నారు. మాకు తినడానికి తిండి కావాలి. అమ్మకు మందులు కొనాలి. చాలా రోజులు మేం ఒక పూటే తిన్నాం. వైర్‌సతో పోరాడితే బతికే అవకాశాలున్నాయేమో! కానీ ఆకలితో పోరాడి బతకలేం’’ అని భావోద్వేగంగా చెబుతాడు చాంద్. చెల్లెళ్ల స్కూల్ ఫీజే కాదు... తన స్కూల్ ఫీజ్ కూడా ఇంకా కట్టలేదు. ‘‘చదువుకోవాలంటే డబ్బులు కావాలి కదా! బాధాకరమైన విషయమేమిటంటే ఇంత ప్రమాదకర ఉద్యోగం చేస్తున్న నా లాంటి వారికి సదరు కంపెనీలు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించకపోవడం’’ అంటున్న చాంద్ జీతం నెలకు రూ.17 వేలు. దాంతో కొంతవరకైనా తన కుటుంబ కష్టాలు తీరతాయని ఆశిస్తున్నాడు.
చాంద్ చేస్తున్న ఉద్యోగం ఎంత కష్టమైనదో అతడి కుటుంబానికి తెలుసు. కానీ వారికి వేరే మార్గంలేదు. ‘‘నా గురించి మా అమ్మా నాన్నలు ప్రార్థనలు చేస్తున్నారు. అమ్మయితే రోజూ డ్యూటీకి వెళ్లివచ్చినప్పుడల్లా నన్ను చూసి ఏడుస్తుంది. ఆమెకు ఏదో ఒకటి చెప్పి ఓదారుస్తుంటాను’’ అని చాంద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను ఇంటికి వెళ్లినా ఎవరినీ ముట్టుకోడు... నలుగురితో హాయిగా మాట్లాడలేడు. ‘‘ఈ విపత్కర పరిస్థితి నుంచి అందరినీ బయటపడేయ’మని ఒంటరిగా కూర్చొని దేవుడిని ప్రార్థిస్తుంటాడు.