కలల్ని సాధించాలి...
ABN , First Publish Date - 2020-03-16T05:50:55+05:30 IST
మహిళలకు పెళ్లయి పిల్లలు పుడితే... ‘ఇక తమ కలలకు వాళ్లు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే’ అనే అభిప్రాయం చాలామందిలో...
మహిళలకు పెళ్లయి పిల్లలు పుడితే... ‘ఇక తమ కలలకు వాళ్లు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే’ అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అయితే ఒక సాధారణ గృహిణి నుంచి బాడీ బిల్డర్, డీజే, ఫొటోగ్రాఫర్‌గా... ఇలా తను కన్న కలలను పట్టుదలతో పండించుకున్నారు కిరణ్ డెంబ్లా. అందుకోసం ఆమె ఏం చేశారంటే...
‘‘ఎందరినో ప్రేరేపించగల గొప్ప సత్తా మహిళలకు ఉందని నా గాఢాభిప్రాయం. ‘పెళ్లి, పిల్లలే పరమావధిగా జీవితమంతా గడపాల్సిందేనా?’ అనే ఆలోచన నన్ను నలుగురిలో ‘సమ్‌థింగ్ స్పెషల్’గా నిలబెట్టింది. నేను కూడా ఒక సాధారణ గృహిణిగానే జీవితాన్ని మొదలెట్టా. ఆ తర్వాతే బాడీ బిల్డర్‌గా, డీజేగా మారా. ఫిట్‌నెస్‌కి ప్రతీకగా నన్ను నేను నిలబెట్టుకున్నా. సాధారణ గృహిణుల్లో సైతం బాడీ బిల్డింగ్ వైపు మళ్లే స్ఫూర్తిని రగిలించగలిగా. ఆసక్తి, పట్టుదల ఉండాలేగాని దేన్నైనా ఆడవాళ్లు సాధించగలరు. నేను పర్వతారోహకురాలిని కూడా. అయితే ఇప్పటి కిరణ్‌కు, పది సంవత్సరాల క్రితం కిరణ్‌కు చాలా తేడా ఉంది. ఇల్లాలిగా నాకు అప్పట్లో కుటుంబమే లోకం. అయితే రెండో బిడ్డ పుట్టిన తర్వాత తీవ్ర ఒత్త్తిడికి గురయ్యా. దాంతో బాగా లావయ్యా. దేనిమీద దృష్టి పెట్టలేకపోయా. అలాగే ఉంటే ఆత్మవిశ్వాసం కోల్పోతానని గ్రహించి, వెంటనే స్విమ్మింగ్ చేయడం ప్రారంభించా. ఈత వల్ల బరువు వేగంగా తగ్గుతామంటారు కానీ నా విషయంలో అది సాధ్యంకాలేదు. తర్వాత కొందరు స్నేహితులతో కలిసి యోగ చేయడం మొదలెట్టా.
ఆ సమయంలోనే జిమ్‌కి వెళ్లాలన్న ఆసక్తి పెరిగింది. జిమ్‌కి వెళ్లడంతో బరువు మెల్లగా తగ్గడం మొదలైంది. ఏడు నెలల్లో 24 కిలోలు తగ్గాను. దీంతో నాలో ఆత్మవిశ్వాసాన్ని పెరిగింది. అప్పటి నుంచి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నా. 2013లో బుడాపెస్ట్‌లో జరిగిన ‘వరల్డ్ బాడీ బిల్డింగ్ పోటీ’లో పాల్గొన్నా. అందులో పాల్గొనడానికి ఇంట్లోనే వ్యతిరేకత ఎదుర్కొన్నా. కారణం బాడీ బిల్డింగ్ ఈవెంట్‌లో పాల్గొనాలంటే బికినీ ధరించాలి. ఈ విషయంలో నా భర్తకు సర్దిచెప్పాలని చూశా కానీ ఆయన మొండిగా ఉన్నారు. అయితే నేను కూడా అంతే మొండిగా పోటీలో పాల్గొంటానని కరాఖండీగా చెప్పా. బాడీ బిల్డింగ్ చేయాలంటే నాన్‌వెజ్ తినాల్సిందే. అయితే నాన్‌వెజ్ తినడానికి వీల్లేదన్నారు ఇంట్లో వాళ్లు. కానీ నేను వారి మాటలు లెక్కచేయలేదు. ఇలాంటి ఎన్నో సవాళ్లన్నీ ఎదుర్కొని ‘వరల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్’లో ఆరో స్థానంలో నిలిచా.

బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నందుకు నాపై సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోల్స్ వచ్చాయి. వాటితో తీవ్ర మానసికవేదనకు గురైనప్పటికీ నాకు నేను ధైర్యం చెప్పుకుని గట్టిగా నిలబడ్డా. ఈ విజయాలను నేను నలభై ఏళ్ల వయసులో సాధించాను. నాకు శాస్త్రీయ సంగీతం వచ్చు. ప్రొఫెషనల్ డీజేగా కూడా పని చేశా. ఫొటోగ్రఫీలో కూడా నన్ను నేను నిరూపించుకున్నా. నేను మహిళలకు చెప్పేదొకటే.. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అలాగే ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వండి. అలా చేస్తే మీ జీవితంలో మీకే తెలియనన్ని అద్భుతాలను సృష్టిస్తారు. సూపర్ ఉమన్ అవుతారు.’’
