మహేశ్‌తో సరదాగా గడుపుతున్నాం!

ABN , First Publish Date - 2020-04-05T05:45:23+05:30 IST

ప్రజలకు ఉపయోగపడే ఏ అవగాహన కార్యక్రమానికైనా సెలబ్రిటీలు ముందుండాలి. కరోనా పట్టి పీడిస్తున్న తరుణంలో దాని నివారణకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని హీరో మహేశ్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ సూచనలిస్తున్నారు. ‘సేఫ్‌ హ్యాండ్స్‌’ పేరుతో తాను విసిరిన ఛాలెంజ్‌ గురించి...

మహేశ్‌తో సరదాగా గడుపుతున్నాం!

ప్రజలకు ఉపయోగపడే ఏ అవగాహన కార్యక్రమానికైనా  సెలబ్రిటీలు ముందుండాలి. కరోనా పట్టి పీడిస్తున్న తరుణంలో దాని నివారణకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని హీరో మహేశ్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ సూచనలిస్తున్నారు. ‘సేఫ్‌ హ్యాండ్స్‌’ పేరుతో తాను విసిరిన ఛాలెంజ్‌ గురించి, కరోనా కాలంలో ఫ్యామిలీతో మహేశ్‌ గడుపుతున్న తీరు గురించి ఆమె ‘నవ్య’తో మాట్లాడారు.


అందుకే సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌! 

కరోనా రోజురోజుకి ఎలా విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఓ విపత్తు వస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. దీనిని నియంత్రించడానికి వ్యాక్సిన్‌, మెడిసిన్‌ లాంటిది ఏదీ లేదు. మనమే జాగ్రత్త వహించి, కొన్ని నియమాలు పాటించాలి. ఇంటికే పరిమితం కావాలి. స్వీయ నిర్భందంలో ఉండడం వల్ల వ్యాప్తి తగ్గుతుంది. అదే దీని నియంత్రణకు సరైన మందు. ఇలాంటి సమయంలో సొసైటీకి గైడెన్స్‌ చాలా అవసరం. అందుకే ఓ వీడియో చేసి సోషల్‌ మీడియా వేదికగా ‘సేఫ్‌ హ్యాండ్స్‌’ ఛాలెంజ్‌ విసిరాను. ఇది నా వంతు బాధ్యత అనుకున్నా. దగ్గు, తుమ్ముల వల్ల కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వైరస్‌ కాబట్టి శుభ్రత, సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యం. ముక్కు, నోటికి మాస్క్‌ తప్పనిసరిగా ఉపయోగించాలి. చేతుల్ని తరచూ 20-30 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలి. కనీసం అభిమానులు ఈ వీడియో చూసినా అది వేల మందికి చేరుతుందనే నమ్మకంతో చేసిన ప్రయత్నమిది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భయపడుతూ ఇబ్బందుల్లో ఇరుక్కోవడం, అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కరోనా వైరస్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో వచ్చే అన్నింటిని నమ్మవద్దు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు వైద్య, పోలీస్‌, పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయం. 


బతికుంటే... సంపాదించుకోవచ్చు...

చాలామంది కరోనాను రెగ్యులర్‌ ఫ్లూ లాగా భావిస్తున్నారు. ఆ ఆలోచన తప్పు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన వైరస్‌. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వైరస్‌ కాబట్టే.. దేశంలోని మొత్తం స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, మాల్స్‌ అన్నీ మూతపడ్డాయి. మన ప్రధాని మోదీ తీసుకున్న ‘జనతా కర్ఫ్యూ’, జాతీయ ‘లాక్‌డౌన్‌’ చాలా మంచి నిర్ణయాలే! జనాలు బయటకు రాకపోతే వైరస్‌ ఛైన్‌ లింక్‌ తెగుతుంది అన్నది వాస్తవం. గత ఆదివారం దేశవ్యాప్తంగా అందరూ ఇళ్లకే పరిమితమై జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. అయితే కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వల్ల సాధారణ ప్రజలు పనులు లేక, నిత్యావసర వస్తువులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది బాధాకరమే! అయితే వైద్య సౌకర్యాలు, వసతులు తక్కువైన మన దేశంలో కరోనాను తరిమికొట్టడానికి ఇంతకన్నా మంచి మార్గం ఇంకోటి లేదు. ఆరోగ్యంకన్నా ముఖ్యమైనది ఏదీ లేదు. బతికుంటే ఎలాగైనా కష్టపడి సంపాదించుకోవచ్చు. 


హౌస్‌ అరెస్ట్‌ చేశా..!

చదువుకొనే పిల్లలకు పరీక్షలు వాయిదా పడడం, సెలవులు ఇవ్వడంతో సరదాగా బయటకు వెళ్లి గడపాలనుకుంటారు. మొదట మా పిల్లలు గౌతమ్‌, సితార కూడా అదే ఆలోచన చేశారు. కానీ బయట పరిస్థితి భయంకరంగా ఉంది. అందుకు వాళ్లను గడప దాటనివ్వకుండా హౌస్‌ అరెస్ట్‌ చేసేశాం. ‘అమ్మా... బోర్‌ కొడుతోందీ’ అన్నారు మొదట్లో! కానీ ప్రాణంగా పెంచుకునే పిల్లలకు ఆరోగ్యం చాలా ముఖ్యం కదా! అందుకే, కరోనా పరిస్థితుల్లోనూ, ‘లాక్‌డౌన్‌’లో ఇంట్లోనే ఉండాల్సిన అవసరాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి.. ఇంట్లోనే.. వాళ్లకు కావలసిన ఆటలు, ఆహారం అందిస్తున్నాం. మా ఇంట్లో పని చేసే అందరి విషయంలో నేను జాగ్రత్తలు తీసుకుంటున్నా. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ఫ్యామిలీ మొత్తం మూడు నెలల పాటు వెకేషన్‌ ప్లాన్‌ చేశాం. కరోనా  కారణంతో  ఆ ప్లాన్‌ మొత్తం మారిపోయింది. అది కూడా మన మంచికే అనుకున్నా. ఇప్పుడు మహేశ్‌తో  ఇంట్లోనే సరదాగా గడుపుతున్నాం. 


సరైన సమాధానం దొరుకుతుంది...

‘ఇఫ్‌ యు కాంట్‌ గో అవుట్‌ సైడ్‌.. గో ఇన్‌సైడ్‌’ స్లోగన్‌కి నా వైపు నుంచి బలమైన అర్థం ఉంది. ఇలాంటి భయాందోళనల మధ్య మనం బయటకు వెళ్లలేని పరిస్థితిలో కామ్‌గా ఉండి మన మనసుతో గడపడం వల్ల చాలా ప్రశాంతత చేకూరుతుంది. జవాబు దొరకని ఎన్నో ప్రశ్నలకు ధ్యానంతో సమాధానం దొరుకుతుంది. ప్రజలకు ఉపయోగపడే ఏ అవగాహన కార్యక్రమానికైనా నేను ముందుంటా. 


మహేశ్‌కు ఆ రెండూ ప్రాణం...

షూటింగ్‌లు ఉన్నప్పుడు మహేశ్‌కు ఇంత ఖాళీ సమయం దొరకదు. ఆయనకు సినిమాలు, పిల్లలంటే ప్రాణం. షూటింగ్‌లు లేకపోవడంతో ఆయన పూర్తి సమయాన్ని కుటుంబం కోసం కేటాయించారు. తరచూ పిల్లలతో ఆటలాడుతున్నారు. ఇప్పుడు ఆయనకు పిల్లలతో అనుబంధం మరింత పెరిగింది. ఆటలు పూర్తయ్యాక అన్ని భాషల చిత్రాలూ చూస్తారు. పుస్తకాలు చదువుతారు. 


సితార ఏకసంథాగ్రాహి...

సితార డాన్స్‌లు చూసి డాన్స్‌ మాస్టర్‌ని పెట్టి నేర్పిస్తున్నాం అనుకుంటారంతా. తను ఏకసంథాగ్రాహి. ఏదైనా ఒక్కసారి చూసిందంటే పట్టేస్తుంది. వాళ్ల నాన్న సినిమాలో పాటల్ని అలా నేర్చుకునే డ్యాన్స్‌ చేస్తుంది. తన డ్యాన్స్‌ చూసి సితార ఎంత బాగా చేస్తోందో అని మీరెలా అనుకుంటారో.. మేమూ అలాగే ఆశ్చర్యపోతాం. దానికి అంత గ్రాస్పింగ్‌ పవర్‌ ఉంది. ఈ మధ్యనే సితార చేసిన ‘మైండ్‌ బ్లాక్‌’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. 


ఆలపాటి మధుUpdated Date - 2020-04-05T05:45:23+05:30 IST