స్టూడెంట్‌.. జిల్లా కలెక్టర్‌!

ABN , First Publish Date - 2020-03-04T05:53:01+05:30 IST

బాగా చదివి కలెక్టర్‌ కావాలనే కోరిక చాలామంది విద్యార్థులకు ఉంటుంది. అయితే పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆ కల నిజమైతే అంతకన్నా ఆనందం ఉండదు. ఈ ఏడాది మహిళా దినోత్సవం బాలికలకు...

స్టూడెంట్‌.. జిల్లా కలెక్టర్‌!

బాగా చదివి కలెక్టర్‌ కావాలనే కోరిక చాలామంది విద్యార్థులకు ఉంటుంది. అయితే పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆ కల నిజమైతే అంతకన్నా ఆనందం ఉండదు. ఈ ఏడాది మహిళా దినోత్సవం బాలికలకు అలాంటి ఓ చక్కని అవకాశం కల్పించింది. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా కలెక్టర్‌ సుమన్‌ రావత్‌ చంద్ర బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి మహిళా దినోత్సవం ముంగిట వారం రోజుల పాటు ‘ఒక్కరోజు కలెక్టర్‌’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చదువులో మెరికల్లా ఉన్న విద్యార్థినులను ఎంపికచేసి వారం రోజుల పాటు రోజుకొకరు చొప్పున కలెక్టర్‌గా విధులు నిర్వహించే అరుదైన అవకాశం కల్పించారు. దాన్ని అందిపుచ్చుకొని జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన పూనమ్‌ దేశ్‌ముఖ్‌ అనే విద్యార్థిని మొదటి రోజు కలెక్టర్‌గా పనిచేసింది. ఆమె కలెక్టర్‌ సీట్లో కూర్చొని శ్రద్ధగా ఫైళ్లను తిరగేస్తున్న ఫొటోలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్‌ ఖాతాలో ఉంచింది. ఆ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ‘పూనమ్‌ కలెక్టర్‌గా తన విధులను చాలా చక్కగా నెరవేర్చింది, ఈ అవకాశం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని కలెక్టర్‌ సుమన్‌ రావత్‌ చంద్ర ట్వీట్‌ చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచి కార్యాక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ ప్రజల మనసులు గెలుచుకున్నారు. 

Updated Date - 2020-03-04T05:53:01+05:30 IST