లాక్‌డౌన్‌ లాఫింగ్‌ స్టార్‌

ABN , First Publish Date - 2020-05-20T05:30:00+05:30 IST

నవ్వు నాలుగు విధాల లాభం. నవ్వితే ఫీల్‌ గుడ్‌ హార్మోన్లు విడుదలై మనసుకు ప్రశాంతత కలిగిస్తాయి. మానసిక రుగ్మతలు తగ్గుతాయి. యూట్యూబ్‌ స్టార్‌ రోహిత్‌ గుప్తా చేస్తున్నదదే. లాక్‌డౌన్‌తో ఇళ్లలోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారిని నవ్విస్తూ...

లాక్‌డౌన్‌ లాఫింగ్‌ స్టార్‌

నవ్వు నాలుగు విధాల లాభం. నవ్వితే ఫీల్‌ గుడ్‌ హార్మోన్లు విడుదలై మనసుకు ప్రశాంతత కలిగిస్తాయి. మానసిక రుగ్మతలు తగ్గుతాయి. యూట్యూబ్‌ స్టార్‌ రోహిత్‌ గుప్తా చేస్తున్నదదే. లాక్‌డౌన్‌తో ఇళ్లలోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారిని నవ్విస్తూ... ఉపశమనం కలిగిస్తున్నాడు. హాస్య గుళికలు వేసి వారిలో మనోల్లాసాన్ని పెంచుతున్నాడు. 


కరోనా ఒత్తిడిలో చిత్తవుతున్న ఈ తరుణంలో కాసేపు హాయిగా నవ్వితే అన్నీ మర్చిపోతాం. రోజురోజుకూ పెరుగుతున్న లాఫింగ్‌ క్లబ్‌ల ఉద్దేశం కూడా ఇదే! అందుకే తన యూట్యూబ్‌ వీడియోల ద్వారా నెటిజన్లకు సరైన సమయంలో సరైన ‘డోస్‌’ ఇస్తున్నాడు రోహిత్‌ గుప్తా. బాలీవుడ్‌ తారలను అనుకరిస్తూ, వారి గొంతులను మిమిక్రీ చేస్తూ, అప్పుడప్పుడూ ప్రాంక్స్‌ చేస్తూ కడుపుబ్బ నవ్విస్తున్నాడు. అతడి మిమిక్రీ నైపుణ్యానికి తారలు సైతం ఫిదా అవుతున్నారు. ఇక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై అయితే ఫాలోయర్స్‌కు లెక్కే లేదు. 


ఎంబీయే చదివి... 

ఎంబీయే చదివిన రోహిత్‌... తనలోని టాలెంట్‌కు మార్కెటింగ్‌ నైపుణ్యాన్ని జోడిస్తున్నాడు. హాస్యం పండించడం అతడి అభిరుచి. దాన్నే కెరీర్‌గా ఎంచుకొని, విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. ‘రోహిత్‌ గుప్తా’ అంటూ తన పేరు మీదనే నాలుగేళ్ల కిందట యూట్యూబ్‌ ఛానల్‌ మొదలుపెట్టాడు. అతడి తొలి మిమిక్రీ వీడియో 2016లో విడుదలైంది. దానికి వచ్చిన స్పందన అనూహ్యం. ‘‘ఇలా వదిలానో లేదో... అలా హిట్టయ్యిందా వీడియో. పోస్ట్‌ చేసిన రోజే దాదాపు పది లక్షల వ్యూస్‌ వచ్చాయి. చాలామంది బాలీవుడ్‌ డైరెక్టర్లు మెచ్చుకున్నారు. నా మీద నాకు నమ్మకాన్ని పెంచిన క్షణమది’’ అంటూ ఆ రోజులు గుర్తు చేసుకున్నాడు రోహిత్‌. 




సెలబ్రిటీలా అనిపిస్తుంది... 

ఏదో నచ్చింది చేసేసి... నెట్‌లో వీడియో వదిలేయడు రోహిత్‌. వీక్షకుల మనసు తెలుసుకుని, ఇప్పటి ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని కంటెంట్‌ రూపొందిస్తాడు. ‘‘ఎంబీయేలో ఉన్నప్పుడు చాలా సబ్జెక్ట్స్‌ చదివాను. వాటిల్లోని విజ్ఞానాన్ని వీడియోలు రూపొందించడంలో ఉపయోగిస్తాను. నా మిమిక్రీతో లక్షల మందిని అలరించగలుగుతున్నానంటే... నిజంగా అది నా అదృష్టం. మిమిక్రీ చేస్తున్నప్పుడు కొందరు నిజంగా ఆ తారలే తమతో మాట్లాడుతున్నారనుకొంటారు. హీరో సంజయ్‌ దత్‌ అనో, షారుఖ్‌ ఖాన్‌ అనో చెబితే వారు నమ్మేస్తారు. అలా కాల్‌ చేసినప్పుడు వాళ్ల స్పందన వింటే... నాకూ కాసేపు సెలబ్రిటీనన్న అనుభూతి కలుగుతుంది. అది నాలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. 


మనసులు గెలవాలని... 

అందరిలానే తనలోని మిమిక్రీ కళాకారుడిని నలుగురికీ పరిచయం చేయాలనుకున్నాడు రోహిత్‌. ‘‘దానికి నేను ఎంచుకున్న మార్గం... ప్రాంక్‌. అంటే అవతలివాళ్లను ఆటపట్టించడం. అలా కొన్ని చేసి, మా ఇంట్లోవాళ్లకు, స్నేహితులకు చూపించాను. అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతోనే యూట్యూబ్‌ ఛానల్‌ మొదలుపెట్టాను’’ అంటాడు రోహిత్‌. అప్పటికప్పుడు అతడు పేల్చే జోకులకు పగలబడి నవ్వనివారుండరు. అందుకు సెలబ్రిటీలూ మినహాయింపు కాదు. రోహిత్‌ ప్రతిభను ‘బీబీసీ రేడియో’ కూడా గుర్తించింది. ఇంటర్వ్యూ చేసింది. విశేషమేమంటే... బీబీసీ ఇంటర్వ్యూ చేసిన మొట్టమొదటి భారత యూట్యూబర్‌ అతడే! ‘జీవితంలో నేను సాధించిన అతిపెద్ద విజయం ఇదే’... అని భావోద్వేగంతో చెబుతాడీ యూట్యూబ్‌ స్టార్‌. 


హాస్యంతో ఉపశమనం... 

నవ్వుతున్నంతసేపూ బాగానే ఉంటుంది. కానీ నవ్వించడం అంత సులువు కాదంటాడు రోహిత్‌ గుప్తా. ‘‘వీక్షకులు ఎప్పటికప్పుడు నా నుంచి కొత్తదనాన్ని ఆశిస్తారు. దానికి తగ్గట్టుగా ప్రతి వీడియోనూ భిన్నంగా, వినూత్నంగా రూపొందించాలి. ముఖ్యంగా ఎదుటివాళ్లను నవ్వించడం చాలా కష్టమైన పని. మనలో తెలివితేటలు ఉండాలి. స్వతహాగా చమత్కారి అయ్యుండాలి. దాని కోసం అహర్నిశలూ పరిశోధన, కృషి సాగిస్తూనే ఉంటాను’’ అంటాడతను. రోహిత్‌ ఓ ఆర్జేకు కాల్‌ చేసి, బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌లా మాట్లాడిన వీడియో సూపర్‌ హిట్టయ్యింది. అత్యధికంగా 11 మిలియన్ల మంది దాన్ని చూశారు. అలాగే బాలీవుడ్‌ హీరోయిన్లు కరిష్మా, కరీనా కపూర్‌, నోరా ఫతేతో చేసిన ప్రాంక్స్‌ నెట్‌లో పిచ్చగా పేలాయి. ప్రస్తుత లాక్‌డౌన్‌లో బయటకు వెళ్లలేక... ఇంట్లో ఉండలేక మానసిక రుగ్మతలతో అవస్థలు పడుతున్న వారికి తన హాస్యంతో ‘లాక్‌డౌన్‌’ చేస్తున్నాడు రోహిత్‌. అలసిన మనసులకు కాస్తంత ఉపశమనం కలిగిస్తున్నాడు. 




వెండి తెరపై వెలగాలని... 

మిమిక్రీ చేయడం ఒక్కటే కాదు, పలు యాసల్లో కూడా రోహిత్‌ మాట్లాడగలడు. ముంబయ్‌లో పుట్టి పెరగడంవల్లే తనకిది సాధ్యమైందంటాడు. ‘‘గుజరాతీలు, సింధీలు, మరాఠీలు, దక్షిణాది ప్రజలు... చుట్టూ వివిధ సంస్కృతులు, భాషలు మాట్లాడే వారితో కలిసి పెరిగా. వారిని చూస్తూ, అనుకరిస్తూ ఇతర భాషలు, యాసలపై అవగాహన తెచ్చుకున్నాను. అవే నా వీడియోల్లో ఉపయోగిస్తుంటా’’ అంటాడు. డిజిటల్‌ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ తెచ్చుకున్నా... రోహిత్‌కు మరో లక్ష్యం కూడా ఉంది. అదేమిటంటే... వెండి తెరపై కూడా పాపులర్‌ అవ్వాలని!  ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ యూత్‌ స్టార్‌ ఆ కల కూడా త్వరలోనే నెరవేర్చుకోవచ్చు.


Updated Date - 2020-05-20T05:30:00+05:30 IST