జీవితాన్ని మార్చిన చేతి వంట...
ABN , First Publish Date - 2020-09-16T05:30:00+05:30 IST
లాక్డౌన్ విధించడంతో ఇళ్లల్లో పనిచేస్తూ పొట్టపోసుకునే సరోజ దీదీ ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడింది. తనతో కలిపి నలుగురున్న

లాక్డౌన్ విధించడంతో ఇళ్లల్లో పనిచేస్తూ పొట్టపోసుకునే సరోజ దీదీ ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడింది. తనతో కలిపి నలుగురున్న కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలి! అనే దిగులు ఆమెను వెంటాడింది. సరిగ్గా అదే సమయంలో ఆమె చేతి వంట రుచి తెలిసిన అంకిత్ వెంగులేల్కర్ ఆమెకు పని కల్పించాడు.
ఆమెతో బెంగళూరులో స్థానికంగా ఫేమస్ రుచులను వండించి తాను అమ్మడం మొదలెట్టాడు. ఆమె వంటకాలు నచ్చడంతో ఆహారప్రియులు వరుస కట్టారు. ఇప్పుడు ఆమె పిల్లలకు కడుపునిండా తిండి పెడుతోంది. చేతినిండా పని, చాలినంత డబ్బుతో సంతోషంగా కొత్త రుచులను వండుతోంది.
ఇళ్లలో వంట, పాచి పని చేస్తూ, పూలు అమ్ముతూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేది సరోజ దీది. ఆమెకు చిన్న వయులోనే పెళ్లయింది. భర్త కాలం చేశాక ముగ్గురు పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత ఆమె మీద పడిది. ఆమె రెక్కాడితే గానీ పూట గడవని పరిస్థితి.
కష్టంగా సాగుతున్న ఆమె జీవితానికి లాక్డౌన్ రూపంలో విధి మరోసారి పరీక్ష పెట్టింది. చాలామంది పనిమనుషుల్లానే ఆమె రోడ్డున పడింది. ఎక్కడా పని దొరక్కపోవడంతో ముగ్గురు పిల్లల తిండి, వారి ఇతర అవసరాలు ఎలా తీర్చాలనే బెంగ పట్టుకుందామెకు. సరిగ్గా ఆ సమయంలో అంకిత్ వెంగులేల్కర్ సరోజకు బతుకు దారి చూపించాడు. ఆమె పనిచేసే నాలుగు ఇళ్లలో అంకిత్ ఇల్లు ఒకటి. అతడికి ఆమె ఎంత బాగా వంట చేస్తుందో తెలుసు.
ముగ్గురు పిల్లలను పోషించడం కోసం ఆమె పడుతున్న కష్టం చూసిన అంకిత్ రుచికరమైన హోమ్ ఫుడ్ సర్వీస్‌తో సరోజకు ఆర్థికంగా అండగా నిలవాలనుకున్నాడు. ఇప్పటి వరకైతే ఆమెతో బెంగళూరు వాళ్లు ఎక్కువగా ఇష్టపడే మంగళూరు స్టయిల్ పీతల కూర, రెడ్డీస్ చికెన్ వంటకాలు వండిస్తున్నాడు. వీళ్ల హోమ్ ఫుడ్ సర్వీస్ వారాంతాల్లో మాత్రమే. సరోజ చేతి వంట రుచిచూసిన వారంతా ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు.
నెల సంపాదన నాలుగు రోజుల్లోనే
వంటకు కావాల్సిన సరుకులన్నీ అంకిత్ తీసుకొస్తాడు. సరోజ వంట చేస్తుంది. ఫుడ్ ప్యాకింగ్, మార్కెటింగ్ అంతా అంకిత్ చూసుకుంటాడు. ‘‘సరోజ దీది చేతి వంట సూపర్‌గా ఉంటుంది. ఫుడ్ లవర్స్ మా ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఫుడ్ అమ్మడం ద్వారా వచ్చిన మొత్తం డబ్బును ఆమెకు అందిస్తున్నా. దాంతో ఆమె కష్టాల నుంచి గట్టెక్కనుంది. హోసూర్-సర్జాపూర్ లే అవుట్ పరిసరాల్లో ఉండేవారు ఎవరైనా టేస్టీ హోమ్ ఫుడ్ కావాలంటే సరోజ దీదీ ఫుడ్ ఉందని మర్చిపోవద్దు’’ అని ఈ మధ్యే అంకిత్ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌తో పాటు డబ్బులు చేత పట్టుకొని సంతోషంగా ఉన్న సరోజ దీది ఫొటో కూడా పోస్ట్ చేశారు.
దీంతో ఒక్కసారిగా వీరి హోమ్ ఫుడ్ సర్వీస్ ఆర్డర్లు పెరిగాయి. ‘‘హోమ్ ఫుడ్ సర్వీస్ సరోజకు ఎంతో ఉపయోగపడింది. గడిచిన నాలుగు రోజుల్లోనే ఆమె నాలుగు ఇళ్లలో నెల రోజులు వంట, ఇంటి పని చేస్తే వచ్చే మొత్తం (రూ. 6వేలు) సంపాదించింది’’ అని సంతోషంగా చెబుతారు అంకిత్.
భర్త అకాల మరణంతో కష్టాలు మొదలు
సరోజకు కొత్త కొత్త వంటకాలు అందరూ మెచ్చేలా వండడం కొత్తేమి కాదు. పందొమ్మిదేళ్ల క్రితం సరోజ, ఆమె భర్త ఎంజీ రోడ్డు పక్కన చిన్న దుకాణం పెట్టి చిరుతిళ్లు అమ్మేవారు. ఖర్చులు పోనూ కొంత మిగిలేది. దాంతో సంతోషంగా రోజులు గడిచిపోయేవి. అయితే ఆమె భర్త కొంతకాలానికే అకాల మరణం చెందడంతో కుటుంబం, పిల్లల భారం సరోజ మీద పడింది.
‘‘నాకు పదేళ్లున్నడప్పుడు ఒక మేడమ్ ఇంట్లో పనిచేసేదాన్ని. అక్కడ కోల్‌కతాకు చెందిన వంటమనిషి ఉండేది. ఆమె నాకు రకరకాల వంటకాలు నేర్పించింది. నా భర్త, నేను ఇడ్లీ, దోశ, లెమన్ రైస్, టొమాటో రైస్, వడ సాంబార్ అమ్మేవాళ్లం. నా భర్త చనిపోయాక నేనొక్కదాన్నే షాపు నడపలేకపోయాను. పిల్లల బాధ్యత, షాపు చూసుకోవడం కష్టంగా అనిపించింది. అందుకే ఆ షాపు మూసేసి, చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా.
లాక్డౌన్ మాలాంటి వాళ్ల పొట్టకొట్టింది. ఎక్కడా పని దొరకక దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో అంకిత్ నాతో ఇంటి ఫుడ్ వండించి, మార్కెట్ చేసి, డబ్బులు వచ్చేలా చేశాడు’’ అంటుంది సరోజ. ఇప్పుడు స్థానికంగా సరోజ దీదీ చేతి వంటకు ఎంతో పేరుంది. ఒకప్పుడు ఇళ్లలో పనిచేస్తూ, జీతం కోసం నెలంతా ఎదురుచూసిన ఆమె ప్రస్తుతం ఏ ఇబ్బంది లేకుండా గడిపేస్తుంది. భవిష్యత్తులో మరిన్ని కొత్త రుచులను ప్రయత్నించడంతో పాటు హోమ్ ఫుడ్ సర్వీస్‌ను విస్తరించే ఆలోచనలో ఉన్నారు అంకిత్, సరోజ.

సరోజ దీది చేతి వంట సూపర్‌గా ఉంటుంది. ఫుడ్ లవర్స్ మా ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఫుడ్ అమ్మడం ద్వారా వచ్చిన మొత్తం డబ్బును ఆమెకు అందిస్తున్నా. దాంతో ఆమె కష్టాల నుంచి గట్టెక్కనుంది.
