లిబియా శాంతి కపోతం...
ABN , First Publish Date - 2020-10-19T05:34:46+05:30 IST
గత కొన్ని సంవత్సరాలుగా అశాంతి, హింసాత్మక ఘటనలకు నిలయమైన లిబియాలో మన్సూర్ శాంతి సందేశాన్ని వినిపిస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్‌గా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూనే,

కరుడుగట్టిన ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు వెళ్లడం అంటే ఒక రకంగా ప్రాణాలను పణంగా పెట్టడమే. కానీ ఆమె ఆ సాహసానికి ఒడిగట్టారు. అంతర్యుద్ధం, ఉగ్రమూకల దాడులతో అల్లకల్లోలంగా మారిన లిబియాలో అమాయకుల ప్రాణాలకు గత 30 ఏళ్లుగా రక్షణగా నిలుస్తున్నారు టబస్సుమ్ మన్సూర్ (59). లిబియాలో గత నెలలో ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న ఏడుగురు భారతీయులను విడుదల చేయడంలో స్కూల్ ప్రిన్సిపాల్ అయిన మన్సూర్ కృషి, సాహసం ఎనలేనిది.
గత కొన్ని సంవత్సరాలుగా అశాంతి, హింసాత్మక ఘటనలకు నిలయమైన లిబియాలో మన్సూర్ శాంతి సందేశాన్ని వినిపిస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్‌గా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూనే, ప్రజల ప్రాణాలకు భరోసానిస్తున్నారు. తాజాగా ఉగ్రవాదుల చెరలో నెల రోజులు బందీలుగా ఉన్న ఏడుగురు భారతీయులకు విముక్తి లభించేలా చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు.
లిబియాలో బ్రెగా నుంచి ట్రిపోలి వెళ్లే మార్గం (800 కిలోమీటర్లు)లో ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువ. ఆ దారి గుండా పగటిపూట వెళ్లాంటేనే భయం వేస్తుంది. ఏ ప్రమాదం లేకుండా గమ్యం చేరితే అదే పదివేలు అనుకుంటారంతా. గత సెప్టెంబర్ 13న బ్రెగా నుంచి ఆల్ షోలా ఆల్ ముడీవా ఎనర్జీ కంపెనీలో పనిచేసే ఏడుగురు భారతీయులు ఎస్‌యూవీ వాహనంలో ట్రిపోలీ విమానాశ్రయానికి ప్రయాణమయ్యారు. అంతా సవ్యంగా జరిగితే వారు నెల క్రితమే మనదేశంలో అడుగుపెట్టేవారు.
కానీ వారిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. డబ్బు చెల్లిస్తేనే వారిని విడిచిపెడతామని షరతులు పెట్టారు. ప్రభుత్వం చర్చలు జరిపి వారిని విడిపిద్దాం అనుకుంటే లిబియా అంతర్యుద్ధం వల్ల ఇప్పుడు అక్కడ సాధారణంగా మధ్యవర్తులతో దౌత్యచర్చలు జరిగే పరిస్థితి లేదు. అంతేకాదు ట్రిపోలీలో భారతీయ దౌత్యాధికారి లేరు. లిబియా తూర్పు, పడమర భాగాల్లో రెండు ప్రభుత్వాలున్నాయి. దాంతో ఉగ్రవాదుల డిమాండ్‌కు తలొగ్గడం తప్ప మరో దారి కనిపించలేదు. అప్పుడే బెంగాజీలోని ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ టబస్సుమ్ మన్సూర్ రంగంలోకి దిగారు.
ఉగ్రవాదులున్న చోటుకు వెళ్లారు
ఒకపక్క ట్యూనిషీయాలోని భారతీయ దౌత్యవేత్త పునీత్ రాయ్ కుండాల్ ప్రతిరోజు తన లేఖల ద్వారా ట్రిపోలి మీద దౌత్యపరమైన ఒత్తిడి తేసాగారు. మరోపక్క మన్సూర్ స్థానిక పెద్దలు, బెంగాజీలోని తన నెట్‌వర్క్‌తో నిరంతరం మంతనాలు జరిపేవారు. చివరకు ఉగ్రవాదులు బందీలను విడుదల చేసేందుకు ఒప్పుకున్నారు. అయితే వారిని తీసుకొచ్చేందుకు ఎవరు వెళ్లాలి? అనే ప్రశ్న ఎదురైనప్పుడు మన్సూర్ ముందుకొచ్చారు.
‘‘ఉగ్రవాదులున్న చోటుకు వెళ్లి బందీలను తీసుకురావడానికి మన్సూర్ ముందుకొచ్చారు. ఉగ్రవాదులు ఆమె ప్రాణాలకు హాని తలపెడతారేమోననే భయం మాలో ఉండేది. అయితే లిబియా అధికారులు ఆమెకు భద్రతగా పోలీసు వాహనాలను పంపించారు. అప్పుడు మాకు నమ్మకం కుదిరింది’’ అని చెబుతారు ఉగ్రవాదులతో చర్చల్లో పాలుపంచుకొన్న ఒక అధికారి. అయితే బందీల విడుదలలో తన ప్రమేయం గురించి చెప్పేందుకు మాత్రం మన్సూర్ ఇష్టపడలేదు.
కానీ ఆమె కోరగానే లిబియా ప్రభుత్వం, అధికారులు, స్థానిక పెద్దలు సహకారం అందించారు. నిజం వైపు నిలబడడం, ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం వంటి లక్షణాలను చిన్నతనం నుంచే అలవర్చుకున్న మన్సూర్ న్యాయం వైపు నిలబడిన ప్రతిసారి విజయం సాధించడం విశేషం.
లిబియా మార్పులకు ప్రత్యక్ష సాక్షి
అది 2011వ సంవత్సరం. అప్పటి లిబియా అధ్యక్షుడు గడాఫీని గద్దెదించేందుకు పౌరులు వీధుల్లోకి వచ్చి పోరాటం మొదలెట్టారు. గడాఫీ మద్దతుదారులు వారిని అణచివేసే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య జరిగిన పరస్పర దాడులతో బెంగాజీ పట్టణంలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ చిక్కుకొన్న భారతీయలను సురక్షితంగా బయటపడేసే బాధ్యతను మన్సూర్ తీసుకొన్నారు.
బెంగాజీలో మన్సూర్ స్థానిక అధికారులు, గిరిజన తెగల పెద్దలతో మాట్లాడి, సుమారు మూడు వేల మంది భారతీయులను మాల్టా గుండా ఓడలు, విమానాల ద్వారా స్వదేశానికి తరలించారు. దాంతో అప్పట్లో మన్సూర్ పేరు చర్చనీయాంశమైంది. అంతర్యుద్ధం వల్ల లిబియాలో వచ్చిన మార్పులకు సాక్ష్యంగా నిలిచిన ఆమెను అక్కడ ఎంతో గౌరవంగా చూస్తారు.
లిబియా ప్రభుత్వం ఆమెను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ లిబియాలో సభ్యురాలిగా నియమించింది కూడా. మూడు వేల మంది భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు పాటు పడిన మన్సూర్‌ను 2017లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘ప్రవాసీ భారతీయ రతన్ పురస్కారం’తో గౌరవించింది. ఫ
టబస్సుమ్ మన్సూర్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. గత 30 ఏళ్ల క్రితం లిబియాలోని బెంగాజీలో ఇండియా స్కూల్ ప్రారంభించారు. ఇప్పుడు ఆమె స్కూల్ బెంగాజీలోనే మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌గా గుర్తింపు సాధించింది. ప్రధాన స్కూల్‌తో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ నెట్‌వర్క్‌కు బెంగాజీలో రెండు బ్రాంచీలున్నాయి. యుద్ధం, హింసాత్మక ఘటనలతో సర్వం కోల్పోయిన పిల్లలకు ఈ బ్రాంచీలలో ఉచితంగా చదువు చెబుతారు.