చిన్ని వ్యాపారవేత్తలను తయారుచేద్దాం!

ABN , First Publish Date - 2020-12-03T05:39:23+05:30 IST

‘‘నేను అనుభవంతో నేర్చుకోవడాన్ని గట్టిగా నమ్ముతా. కొన్ని సంవత్సరాల క్రితం నేను పిల్లలకు స్టెమ్‌ ఎడ్యుకేషన్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమేటిక్స్‌) మెలకువలు చెప్పే కంపెనీ నడిపాను.

చిన్ని వ్యాపారవేత్తలను తయారుచేద్దాం!

పిల్లల వినోదం, విజ్ఞానం కోసం పుస్తకాలు చాలా ఉన్నాయి. 

కానీ వారి చిన్ని బుర్రలో వచ్చే ఆలోచనలను ఆవిష్కరణలుగా 

మలిచేందుకు తోడ్పడే పుస్తకాలు కొన్నే! పిల్లలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పుస్తకాలు రాస్తున్నారు వృందా బన్సోడే. అయిదేళ్ల క్రితం ఆమె సహాయ రచయితగా వెలువరించిన ‘బికమ్‌ ఏ జూనియర్‌ ఇన్వెంటర్‌’ పుస్తకం ఎంత పాపులరో తెలిసిందే. పిల్లలకు అంకుర సంస్థల పట్ల ఆసక్తిని పెంచేందుకు తాజాగా ఆమె ‘బికమ్‌ ఏ జూనియర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’ పుస్తకం రాశారు. ఎందుకు ఈ పుస్తకం తెస్తున్నారో ఆమె మాటల్లోనే... 


‘‘నేను అనుభవంతో నేర్చుకోవడాన్ని గట్టిగా నమ్ముతా. కొన్ని సంవత్సరాల క్రితం నేను పిల్లలకు స్టెమ్‌ ఎడ్యుకేషన్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమేటిక్స్‌) మెలకువలు చెప్పే కంపెనీ నడిపాను. ఆర్థిక విషయాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోర్సులు కూడా నిర్వహించాం. ఆ సమయంలో పిల్లలతో కలిసి వ్యాపార ఆలోచనల మీద పనిచేయడం నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది. బెంగళూరులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ వాళ్లతో పలు అంకుర సంస్థలతో పనిచేశాను కూడా. నేను అర్థం చేసుకున్న విషయాలను పిల్లలతో పంచుకోవాలనే ఆలోచనతో ‘బికమ్‌ ఏ జూనియర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’ పుస్తకానికి రూపమిచ్చాను. ఈ పుస్తకం రాయాల్సిన అవసరం ఎందుకొచ్చిందటే.... ఈరోజుల్లో స్టార్టప్‌ కంపెనీలు పెట్టడం, కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టడం సాధారణం అయిపోయింది. ప్రభుత్వం కూడా అందుకు సహకారం అందిస్తోంది. పిల్లలు కూడా స్టార్టప్‌ వార్తలు, యువ విజేతల కథలు వింటూ పెరుగుతున్నారు. ఈ పుస్తకంలో భారతీయ స్టార్టప్స్‌, బ్రాండ్స్‌ (వైల్డ్‌క్రాఫ్ట్‌, బుక్‌ మై షో, ఐడీ ఫుడ్స్‌, పేపర్‌బోట్‌ డ్రింక్స్‌) గురించి, వాటిలో భాగమైన పిల్లల గురించి వివరించాను. అంతేకాదు వ్యాపారంలో ఎక్కువగా వాడుక పదాలైన లాభం, ఆదాయం, బృందంగా పనిచేయడం, డిజైన్‌ థింకింగ్‌లను రంగు రంగులబొమ్మలు, కథలు, యాక్టివిటీ పేజీలతో ఉదాహారణలతో వివరించాను.  


ఆలోచన విధానం మారాలి...

మనదేశంలో చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికీ తమ పిల్లలు డాక్టర్‌, ఇంజనీర్‌ అవ్వాలని మాత్రమే కోరుకుంటున్నారు. ఎందుకంటే అందులో కెరీర్‌ ఎలా ఉంటుందో వాళ్లకు తెలుసు. కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌ అనేది ఒక కొత్త విషయాన్ని చెప్పే ప్రయత్నం. ఒక వ్యాపారం ఏ స్థాయికి వెళుతుందనేది మొదట్లో ఎవరూ ఊహించలేరు. ఒకరకంగా ఇది కష్టసాధ్యమే. కానీ అద్భుతాలు ఊరికే సాధ్యం కావు కదా! కష్టపడాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. కరోనా ప్రభావం చిన్నాచితకా  ఉద్యోగస్థుల మీదనే కాదు రేపటిపై కూడా పడింది. భవిష్యత్తులో ఉద్యోగాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. ఇప్పుడు పదేళ్ల వయసున్న పిల్లలు పెద్దయ్యాక ఏ ఉద్యోగాలు చేస్తారో వాళ్లకే తెలియకపోవచ్చు. అందుకే చదువు, ఉద్యోగం, కెరీర్‌ గురించి తల్లిదండ్రుల ఆలోచనలు మారాలి. కరోనా రాకతో ఉద్యోగాలు, చదువు ఆన్‌లైన్‌కి మారాయి. ఈ పరిస్థితి ఇంకొన్నాళ్లు తప్పేలా లేదు. అందుచేత పరిస్థితులకు తగ్గట్టుగా, సృజనాత్మకంగా ఆలోచించడం ఈకాలం పిల్లలలకు ఎంతో అవసరం. వాళ్లు ఏ భయం లేకుండా ప్రయోగాలు చేయాలి. విఫలమయితే తిడతారనే ఆలోచన లేకుండా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ స్పిరిట్‌ను పెంపొందించుకోవాలి. అప్పుడే వారికి నాయకత్వం, రిస్క్‌ తీసుకోవడం, సరికొత్త ఆవిష్కరణలు చేయడం, వ్యవస్థను నిర్మించడం, ఇతరుల నైపుణ్యాలు కనిపెట్టడం, ఆలోచించడం, పనిచేయడం వంటి లక్షణాలు అబ్బుతాయి.


ఎంటర్‌ప్రెన్యూర్‌ స్పిరిట్‌ కోసం

పిల్లలలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ పట్ల ఆసక్తి, అవగాహన  పెరిగేందుకు వారితో బిస్కెట్లు లేదా కేకులు తయారు చేయించి అమ్మడం, అలాగే వెబ్‌సైట్‌, యాప్స్‌, పోస్టర్లు డిజైన్‌ చేయించడం, గేమ్స్‌ ఆవిష్కరించేలా వారిని తల్లిదండ్రులు, టీచర్లు ప్రోత్సహిచడం చాలా ముఖ్యం. ‘బికమ్‌ ఏ జూనియర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’ పుస్తకంలో పిల్లల సామర్థ్యాన్ని పెంచే విషయాలన్నీ రాసుకొచ్చాను. పెంగ్విన్‌ ర్యాండ్‌సమ్‌ హౌజ్‌ ముద్రించిన ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది’’.

Updated Date - 2020-12-03T05:39:23+05:30 IST