ఇంట్లో ఇలా చేద్దాం!
ABN , First Publish Date - 2020-03-24T10:53:39+05:30 IST
కరోనా వైరస్ వ్యాధి (కొవిడ్-19) ఊహించిన దానికన్నా వేగంగా విస్తరిస్తోంది. దీనికి కారణం వస్తువుల ఉపరితలాలపై..

కరోనా వైరస్ వ్యాధి (కొవిడ్-19) ఊహించిన దానికన్నా వేగంగా విస్తరిస్తోంది. దీనికి కారణం వస్తువుల ఉపరితలాలపై ఎక్కువ సమయం ఆ వైరస్ జీవించి ఉండడమేనని వైద్యులు అంటున్నారు. అందుకే మనం వ్యక్తిగత శుభ్రతతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
కనిపించకుండానే...
ప్లాస్టిక్ వస్తువులపై కరోనా వైరస్ 72 గంటల పాటు సజీవంగా ఉంటుంది.
స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపరితలంపై ఉన్న వైరస్ కణాలు నాలుగు గంటల తరువాత క్షీణిస్తున్నాయి. కానీ 48 గంటల వరకు వైరస్ ఉనికి మాత్రం ఉంటున్నట్లు గుర్తించారు.
అట్టపెట్టెలపై కరోనా వైరస్ త్వరగా చనిపోతోంది. అయితే 48 గంటల వరకు పూర్తిగా కనుమరుగు కావడం లేదు.
కరోనా వైరస్ ఉన్న ఏ ఉపరితలాన్నైనా ముట్టుకుని, అదే చేతిని ముఖంపై ముట్టుకుంటే వైరస్ సోకే అవకాశం ఉంది.
అందుకే సామాజిక దూరం పాటించాలి. ఎక్కువ జనం గుమిగూడే ప్రదేశాలకు వెళ్లకూడదు.
చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలి. ముఖంపై చేతులు పెట్టుకోకూడదు. కళ్లు రుద్దడం చేయకూడదు.
మనం ఏం చేయాలంటే...
- ఇంటిలో ఎక్కువ సార్లు ముట్టుకునే ప్రదేశాలను రోజూ శుభ్రం చేసుకోవాలి.
- ఇంట్లో వస్తువులను శుభ్రం చేసే ముందు చే తులను శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత గ్లౌజులు ధరించాలి.
- పేపర్ టవల్ లేదా స్వైప్స్ తీసుకోవాలి. ఒక స్ర్పే బాటిల్, శానిటైజర్ కూడా అవసరం.
- 99.9 శాతం మేర జెర్మ్స్‌ను చంపే ద్రావణాన్ని తీసుకోవాలి. ద్రావణం బాటిల్‌పై ఆ విషయం స్పష్టంగా రాసి ఉన్నదీ లేనిదీ చెక్ చేసుకోవాలి.
- ద్రావణాన్ని స్ర్పేబాటిల్‌లో నింపుకొని పేపర్ టవల్‌పై స్ర్పే చేయాలి.
- ఆ టవల్‌తో డోర్ హ్యాండిల్స్‌ను తుడుచుకోవాలి.
- అన్ని స్విచ్‌లూ శుభ్రంగా తుడవాలి. డ్రాలను కూడా శుభ్రం చేయాలి.
- రోజూ భోజనం చేసే టేబుల్‌ను తుడవాలి.
- ఫ్రిజ్ డోర్‌ను తుడవడం మరువద్దు.
- ఇంట్లో మైక్రో ఓవెన్ ఉంటే దాన్ని కూడా శుభ్రం చేయాలి.
- కుర్చీలు, వాటి వెనుక భాగాన్ని సైతం శుభ్రం చేసుకోవాలి.
- టీవీ రిమోట్, కంప్యూటర్ కీ బోర్డు, మౌస్‌ను తుడవాలి.
- బాత్‌రూమ్, సింక్, వాష్‌బేసిన్ కుళాయిలను తుడుచుకోవాలి.
- టాయిలెట్ ఫ్లష్ హ్యాండిల్ కూడా శుభ్రం చేయాలి.
- ఇప్పుడు చివరగా గ్లౌజులను శుభ్రంగా ఉతికి ఆరేయాలి.
- చేతులను మళ్లీ శుభ్రంగా కడుక్కొని పొడి తువ్వాలుతో తుడుచుకోవాలి.
