సాహసం ఆయన ఇంటిపేరు

ABN , First Publish Date - 2020-05-31T05:30:00+05:30 IST

అదృష్టం అడ్రస్‌ అన్వేషిస్తూ చాలా మంది బయలుదేరుతుంటారు. కానీ కొందరిని మాత్రమే అదృష్టం వెతుక్కుంటూ వచ్చి అందలం ఎక్కిస్తుంటుంది. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి హీరో కృష్ణ...

సాహసం ఆయన ఇంటిపేరు

  • నేడు కృష్ణ 78వ జన్మదినం సందర్భంగా..


అదృష్టం అడ్రస్‌ అన్వేషిస్తూ చాలా మంది బయలుదేరుతుంటారు. కానీ కొందరిని మాత్రమే అదృష్టం వెతుక్కుంటూ వచ్చి అందలం ఎక్కిస్తుంటుంది. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండే వ్యక్తి హీరో కృష్ణ. నటుడిగా ఆయన 50 ఏళ్లు కొనసాగారంటే నటనతో పాటు ఆయన మంచితనం కూడా ఓ కారణం. ‘సినీరంగంలో మంచివాళ్లు ఎవరున్నారయ్యా.. కృష్ణలాంటి ఒకరిద్దరు తప్ప’ అని మహాకవి శ్రీశ్రీ అనడం కృష్ణ వ్యక్తిత్వానికి ఓ మంచి నిదర్శనం. కృష్ణ నటనను విమర్శించే వారు ఉండవచ్చేయో కానీ ఆయన వ్యక్తిత్వాన్ని వేలు పెట్టి చూపించే వారు ఉండరు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ యుగంలో కూడా తనదైన ప్రత్యేకతను నిలుపుకొన్న హీరో కృష్ణ. తెలుగు సినిమా వయసు 88 ఏళ్లయితే, అందులో కృష్ణ వాటా 50 ఏళ్లు. 


ఎన్టీఆర్‌ పౌరాణికాలతో, ఏయన్నార్‌ సాంఘికాలతో ఓ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకొని ప్రేక్షకుల్ని అలరిస్తున్న తరుణంలో కృష్ణ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తనకంటూ ఓ ప్రత్యేక బాణీ ఉండాలనుకొని ఆయన క్రైమ్‌ చిత్రాల వైపు మొగ్గు చూపారు. ఆ జానర్‌లో కృష్ణకు పోటీ ఎవరూ లేకపోవడంతో అచిరకాలంలోనే మాస్‌కు దగ్గరయ్యారు. అయితే కేవలం క్రైమ్‌ చిత్రాలకే కాకుండా అన్ని రకాల చిత్రాల్లో నటించి ఆయన పేరు తెచ్చుకొన్నారు. 


హీరో కృష్ణ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత తెరపై సాహస ప్రయోగాలు, అందుకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చాలామంది చెబుతుంటారు. అది వాస్తవం కూడా. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక కొత్త చరిత్ర సృష్టించడానికే కృష్ణ పుట్టారా! అనిపిస్తుంటుంది కొన్ని సంఘటనల గురించి తెలుసుకొన్న తర్వాత. నిర్మాతగా కృష్ణ తీసినన్ని వైవిధ్యమైన చిత్రాలు, హీరోగా ఆయన చేసిన సాహసాలు మరెవరూ చేయలేదనడం అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం అన్వేషిస్తూ, వైవిధ్యమైన చిత్రాలు నిర్మిస్తూ పరిశ్రమకు మార్గదర్శకంగా నిలిచారు. మంచితనం, మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగా, ధైర్యసాహసాలే ఊపిరిగా జీవించే నాయకునిగా, సంచలన నిర్మాతగా కృష్ణ పేరు తెచ్చుకొన్నారు. వివాదాలకు దూరంగా ఉండడం ఆయనకు మొదటి నుంచీ అలవాటు. అందరూ తనవారేనని నమ్మే మనస్తత్వం ఆయనిది. నిర్మాత నష్టపోతే తను నష్టపోయానని భావించే వ్యక్తి. ఐదు పదుల నటజీవితంలో 365 చిత్రాల్లో నటించిన ఘనత కృష్ణది. 


హీరోగా, నిర్మాతగానే కాదు దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకొన్నారు. దర్శకునిగా తన పేరు వేసుకోకపోయినప్పటికీ పద్మాలయా సంస్థ నిర్మించిన చిత్రాల నిర్మాణంలో కృష్ణ కీలక పాత్ర పోషించేవారు. ‘సింహాసనం’తో దర్శకునిగా పరిచయమైన ఆయన మొత్తం 14 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

-వినాయకరావు 


Updated Date - 2020-05-31T05:30:00+05:30 IST