ఆపద సమయంలో ఆచరణవాది
ABN , First Publish Date - 2020-03-24T10:57:45+05:30 IST
ఎక్కడో చైనాలో తలెత్తిన వైరస్ తీవ్రతను ఆమె ముందుగానే అనుమానించారు. యంత్రాంగాన్ని....

ఎక్కడో చైనాలో తలెత్తిన వైరస్ తీవ్రతను ఆమె ముందుగానే అనుమానించారు. యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. చికిత్సల్లో విజయం వైపు వైద్య వ్యవస్థను నడిపించారు. ఒకప్పుడు టీచర్ అయిన కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ఇప్పుడు కరోనా నియంత్రణలో ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్నారు. గతంలో నిఫా వైరస్ విషయంలోనూ ఆమె అందరికీ ఆపద్బాంధవురాలయ్యారు.
‘‘ప్రశంసించాల్సిన, అనుసరించాల్సిన ఆదర్శ నాయకురాలొకరు ఇన్నాళ్ళకు మనకు దొరికారు. ఇలాంటివారు మరింతమంది రావాలని కోరుకుందాం. అనసరమైన మాటలు లేవు. పనికిమాలిన పరిహాసాలు లేవు. మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారాలు లేవు. రాజకీయ అవకాశవాదాన్ని కప్పిపుచ్చుకుంటూ ఆడే నాటకాలు లేవు. సామాజిక సేవలో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యక్తి. టీచర్! మీ నాయకత్వాన్ని కొనసాగించండి!’’ కరోనా విపత్తును ఎదుర్కోవడంలో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ చేపడుతున్న సమర్థమైన చర్యలను అభినందిస్తూ మలయాళ నటుడు అనూప్ మీనన్ ఇటీవల చేసిన ట్వీట్ ఇది.
ఆయనే కాదు, అనేక మంది సినీ ప్రముఖులూ, వైద్య రంగ నిపుణులూ ఇప్పుడు శైలజపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విదేశాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయ మలయాళీలు పంపే డబ్బే ఆర్థిక వ్యవస్థకు ఇరుసుగా పని చేస్తున్న కేరళలో కరోనా వైరస్ కట్టడికి ఆమె ఆధ్వర్యంలో సాగుతున్న కృషి మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలోని మొదటి మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆ రాష్ట్రంలోనే బయటపడ్డాయి. అయితే శైలజ మార్గదర్శకత్వంలో వైద్య బృందాలు ఆ వ్యాధి వ్యాప్తిని నియంత్రించగలుగుతున్నాయి. కరోనా పాజిటివ్‌గా తేలిన రోగుల చికిత్స విషయంలో అనేక దేశాలు తల్లడిల్లిపోతున్న తరుణంలో, ఈ వైరస్ సోకిన ముగ్గురికి కేరళ వైద్యులు సమర్థంగా చికిత్స చేశారు.
‘‘కరోనా లాంటి అంటువ్యాధులతో పోరాడాలంటే శాస్త్రీయ దృక్పథం, మానవత్వం, గట్టి పరిశోధన కావాలి. అవసరమైతే సంస్కరణలు చేపట్టాలి. మూఢవిశ్వాసాలు, నిర్ధారించుకోకుండా ప్రతీదీ నమ్మేయడం, భావోద్వేగాలకు గురి కావడం, హేతుబద్ధత లేకపోవడం లాంటివి మొత్తం ప్రక్రియను పట్టాలు తప్పిస్తాయి, శాస్త్రీయంగా వ్యాధి ముప్పును నివారించడానికి పాటుపడుతున్న నిపుణులు, వైద్య కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని నీరుకారుస్తాయి. అందుకే వైరస్ గురించి మూర్ఖమైన వాదాలను వ్యాప్తి చేసే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం’’ అంటారు శైలజ.
వైద్యం గురించి నాకేం తెలీదు!
ఇంతకూ అరవై మూడేళ్ళ శైలజ వైద్యురాలేమీ కాదు. ఆమె మంత్రి పదవిని చేపట్టడం కూడా ఇదే తొలిసారి. కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా కూతుపరంబాలో జన్మించిన శైలజ సైన్స్ పట్టభద్రురాలు. కన్నూరులోని శివపురం హైస్కూల్‌లో సైన్స్ టీచర్‌గా పని చేశారు. కాలేజీలో చదువుతున్నప్పుడే సీపీఐ (ఎం) భావజాలం పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. ఆ పార్టీ విద్యార్థి విభాగంలో చేరి చురుగ్గా పని చేశారు. ఉపాధ్యాయినిగా ఉద్యోగవిరమణ తీసుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు కూడా! నాలుగేళ్ళ కిందట కేరళ ఆరోగ్య, సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ‘‘ఆ పదవిలోకి వచ్చేసరికి వైద్య శాస్త్రం గురించి నాకున్న అవగాహన అంతంత మాత్రమే. భౌతిక, రసాయన శాస్త్రాల బోధన, వామపక్ష కార్యకర్తగా ఉన్న అనుభవం కలిసి విషయాలను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తున్నాయి’’ అని అంటారామె. ఆ అవగాహనే విపత్కర సమయాల్లో సత్వరం స్పందించేలా చేస్తోంది.
నిఫా వైరస్ సమయంలోనూ...
2018, 2019 సంవత్సరాల్లో... రెండుసార్లు నిఫా వైరస్ కేరళను కుదిపేసినప్పుడు శైలజ చురుగ్గా స్పందించారు. వైద్యులతో కలిసి ఆమె చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఆ అనుభవం కరోనా వైరస్ విషయంలో పనికొచ్చింది. కొత్త వైరస్ చైనాలో తలెత్తిందన్న వార్తలు చూడగానే దాని లక్షణాలేమిటో శైలజ, ఆమె బృందం గమనించడం ప్రారంభించారు. ఆ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకున్నారు. ఆ లక్షణాలు కేరళ ఒకరికి కనిపించగానే ఆలస్యం చెయ్యకుండా రంగంలోకి దిగారు.
‘‘మంత్రులు తమకు కేటాయించిన శాఖల సబ్జెక్టుల్లో నిష్ణాతులు కాకపోవచ్చు. కానీ కళ్ళూ, చెవులూ తెరుచుకొని ఉంటే ఒక మార్పు తేగలుగుతారు. నేను శాస్త్రవేత్తలనూ, నిపుణులనూ అనుసరిస్తాను. అంతే తప్ప... గోమూత్రం, ఆవు పేడ ప్రయోజనాల గురించి చెప్పేవాళ్ళను కాదు. కరోనా వైరస్ పేరు వినగానే అదేమిటో అర్థం చేసుకోవడానికి ఇంటర్నెట్‌లో శోధించాను. ఆ తరువాత రోజూ కొన్ని గంటల సేపు కథనాలు చదివి, తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. దీనికి కావలసిందల్లా విషయాలను గ్రహించే సామర్థ్యం’’ అని చెబుతారు శైలజ.

ముందు చూపే ఫలితాలిచ్చింది!
చైనాలోని వూహాన్‌లో కరోనా వైరస్ వ్యాధి తలెత్తిందన్న వార్తాకథనాలు చూడగానే ఆమె అప్రమత్తం కావడానికి ఆ సామర్థ్యమే కారణం. నిజానికి సమయానికి చైనా కూడా ఈ వైరస్ వల్ల తలెత్తే ప్రమాదాల గురించి పూర్తిగా అప్రమత్తం కాలేదు. కానీ ఇలాంటి వాటిని తేలిగ్గా తీసుకోరాదన్న పాఠాన్ని నిఫా వైరస్ అనుభవం ఆమెకు నేర్పింది. ‘‘వూహాన్‌లో వైద్యం, ఇంజనీరింగ్ చదువుతున్న కేరళ యువతకు ఆ వైరస్ సోకి, వారు స్వరాష్ట్రానికి తిరిగి వస్తే, అది ఇక్కడ వ్యాప్తి చెందే ప్రమాదం గురించి నేను ఆలోచించాను. వెంటనే కేరళ ఆరోగ్య కార్యదర్శికి ఫోన్ చేసి, నా ఆందోళన వ్యక్తం చేశాను’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆమె ఆందోళన సరైనదేనని గ్రహించిన ప్రభుత్వం వెంటనే చర్యలకు నడుం బిగించింది. క్షేత్రస్థాయిలో వైద్య వర్గాలన్నిటినీ మోహరించడం మొదలుపెట్టింది. కరోనా బాధిత దేశాల నుంచి వచ్చినవారికి కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వారికి పరీక్షలు చేశారు. విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. మిగిలిన రాష్ట్రాల్లో క్వారంటైన్ పీరియడ్ 14 రోజులుంటే కేరళలో 28 రోజులు. దాదాపు 4,800 మందిని ఐసొలేషన్ వార్డుల్లో, లేదా ఇంట్లో క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్యలన్నీ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అందుకే ఇప్పుడు శైలజను అందరూ వర్గాలకు అతీతంగా అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే వాటిని తాను పెద్దగా పట్టించుకోనని చెబుతారు శైలజ. ‘‘ఇవన్నీ నీటి బుడగల్లాంటివి, శాశ్వతం కాదు. అంతా బాగా చేసినా ఒక చిన్న పొరపాటు జరిగితే అంతా కుప్పకూలిపోతుంది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అగ్రశ్రేణి ఆటగాడిపై ఉండే ఒత్తిడి లాంటిదిది. అతను స్కోర్ చేసినప్పుడు అంతా బాగుందంటారు. చెయ్యలేకపోతే, అంతకు ముందు అతను చేసినదాన్ని ఎవరు గుర్తుంచుకుంటారు?’’ అని ప్రశ్నిస్తారు శైలజ. ప్రతిపక్ష నేత చెన్నితలై రమేశ్ లాంటి కొందరు శైలజకు ‘మీడియా మేనియా’ ఉందంటూ చేసిన విమర్శలను ఆమె దృష్టిలో పెట్టుకొని ఆమాట అని ఉండొచ్చు. అలాంటి విమర్శల మాట ఎలా ఉన్నా ఆపత్సమయంలో ఆచరణాత్మకవాదిగా ఆమెను కేరళ ప్రజలు గుర్తుంచుకుంటారు.
ఆ టీచరంటే అంత గౌరవం!
2018లో కేరళలో నిఫా వైరస్ విజృంభణ మీద ‘వైరస్’ (2019) అనే సినిమా వచ్చింది. ఇందులో శైలజను పోలిన పాత్రను తెరపై చూపించడం విశేషం. ఆ పాత్రను నటి రేవతి పోషించారు. ‘టీచర్’ అంటూ ఇంత గౌరవాన్నీ, అభిమానాన్నీ శైలజ పొందడానికి ప్రధాన కారణం ఆమె వ్యవహారశైలి. ఉన్నతాధికారి నుంచి చిరుద్యోగి వరకూ అందరితో ఆమె కలిసిపోతారు. వ్యాధుల నియంత్రణకు పని చేసిన కార్యదర్శుల నుంచి సామాజిక ఆరోగ్య కార్యకర్తల వరకూ అందరి పేర్లనూ ఆమె తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తారు. అనవసరమైన విమర్శలు చేసి సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతియ్యవద్దని కోరుతూ ఉంటారు.
పాలనలో సామాన్య ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనే పనితీరును ఆమె ప్రవేశపెట్టారు. ప్రజలు నేరుగా తనతో మాట్లాడి సందేహాలు తీర్చుకొనే వీలు కల్పించారు. కేరళలో కరోనా వైరస్ నిర్ధారణ అయిన తొలి వ్యక్తిని శైలజ స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు. ‘‘ఆమె నన్ను పలకరించడంతో ఎంతో ఊరట కలిగింది’’ అని ఆ విద్యార్థి ఆమెకు కృతజ్ఞత తెలిపాడు. ‘‘రోగులను కలవడానికి ఐసొలేటెడ్ వార్డుల్లోకి రావద్దని చాలామంది నాకు సలహా ఇచ్చారు. కానీ అది నా బాధ్యత’’ అని ఆమె అంటారు.
