అమ్మకు, నాకూ అదే కామన్‌ క్వాలిటీ!

ABN , First Publish Date - 2020-07-05T05:30:00+05:30 IST

‘మహానటి’తో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు కీర్తీ సురేశ్‌. నటిగా తన ఎదుగుదలకు తల్లి మేనక నేర్పించిన డెడికేషన్‌, పర్ఫెక్షన్....

అమ్మకు, నాకూ అదే కామన్‌ క్వాలిటీ!

‘మహానటి’తో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు కీర్తీ సురేశ్‌. నటిగా తన ఎదుగుదలకు తల్లి మేనక నేర్పించిన డెడికేషన్‌, పర్ఫెక్షన్‌ కారణమంటున్నారు కీర్తి. ‘నవ్య’తో ఆమె చెప్పుకొచ్చిన సంగతులివి...


చిన్నప్పటి నుంచి అమ్మ సినిమాలు చూస్తూ పెరిగా. నాన్న, అమ్మని సెట్‌లో చూసి నాకూ నటించాలనిపించేది. నటనను వృత్తిగా ఎంచుకోవాలని అప్పుడే అనిపించింది. అమ్మ స్ఫూర్తితో 2000 సంవత్సరంలో బాలనటిగా తెరంగేట్రం చేసి మూడు సినిమాల్లో నటించా. ఆ తర్వాత చదువు మీద దృష్టిపెట్టా. 2013లో మలయాళంలో ‘గీతాంజలి’ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యా. అంటే బాలనటిగా సినిమా పరిశ్రమతో నాకు 20 ఏళ్లు, హీరోయిన్‌గా 8 ఏళ్ల అనుబంధం ఉంది. ఇప్పటి వరకూ 15కు పైగా సినిమాలు చేశా. ఈ జర్నీలో ప్రతి రోజు ఓ మధుర జ్ఞాపకమే! నా జర్నీ మొత్తాన్ని ఓ కథగా రాస్తే మంచి   పుస్తకం అవుతుంది (నవ్వుతూ).


ఆ కిటుకులు తెలుసుకుంటున్నా...

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మైలురాళ్లు అని చెప్పుకోవడానికి కొన్ని సినిమా లున్నాయి. ముఖ్యంగా తెలుగులో ‘మహానటి’ నాకు ఓ మంచి జ్ఞాపకం. అందులో సావిత్రిగారి పాత్ర పోషించడం, దానికి జాతీయ పురస్కారం దక్కడం నటిగా నాపై బరువు, బాధ్యతల్ని పెంచింది. ఆ తర్వాత వస్తున్న కథలన్నీ ఆ తరహావే. కానీ జీవితానికి ‘మహానటి’లాంటి బయోపిక్‌ ఒకటి చాలు. ఆ సినిమా తర్వాత కథల ఎంపికలో నా ఆలోచన మారింది. నటనకు స్కోపున్న సినిమాలే చేయాలనుకుంటున్నా. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతోపాటు కమర్షియల్‌ సినిమాలూ చేస్తా. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘పెంగ్విన్‌’ చిత్రం ‘మహానటి’ తరహాలో గుర్తింపు తీసుకొచ్చింది. నాకు సవాల్‌ విసిరిన పాత్ర అది. ఇందులో అమ్మ పాత్ర పోషించడానికి మా అమ్మ మేనక ఎంతో సహకరించారు. ఇకపై నాలుగు సినిమాలు అంగీకరిస్తే అందులో ఒకటైనా మహిళా ప్రాధాన్యం ఉన్న కథ ఉండేలా చూసుకుంటా. కానీ అలా చేయాలంటే బ్యాలెన్స్‌ చేయడం తెలిసి ఉండాలి. ప్రస్తుతం ఆ కిటుకులు నేర్చుకుంటున్నా. 


పర్ఫెక్షన్‌తో పనిచేస్తా...

పదిహేను సినిమాలు చేసిన అనుభవం నాకుంది. ఒక సినిమా చేసినా, పది సినిమాలు చేసినా దర్శకుడే  కెప్టెన్‌ ఆఫ్‌ ద షిప్‌. ఎంత పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అయినా దర్శకుడు చెప్పిందే చేయాలి. ఆ విషయంలో నేను కరెక్ట్‌గా ఉంటా. డెబ్యూ డైరెక్టర్‌తో సినిమానా అని నోరెళ్లబెడితే కెరీర్‌కి ఫుల్‌స్టాప్‌ పడుతుంది. నేను ఎక్కువగా డెబ్యూ డైరెక్టర్‌లతోనే పనిచేశా. కొత్త దర్శకుడితో పని చేయను అనుకుంటే ‘మహానటి’ లాంటి అద్భుతం నా చేతికి వచ్చేది కాదు. నేను పనికి విలువిస్తాను. డెడికేషన్‌, పర్ఫెక్షన్‌తో పనిచేస్తా. అమ్మకు, నాకు కామన్‌ క్వాలిటీ ఇదే! 
సంగీతంతో మాయం...

మనసు భారంగా ఉన్నప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు నాకు నచ్చిన పాటలు వింటా. మ్యూజిక్‌ వింటే ఎలాంటి స్థితిలో ఉన్నా మామూలు మనిషిని అయిపోతా. నా చిన్ననాటి స్నేహితురాలు ఆర్తితో మాట్లాడితే నా  ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. ఏ విషయాన్నైనా తనతోనే పంచుకుంటా. 


అమ్మ జోక్యం ఉండదు...

నేను చేసే ఏ సినిమా కథలోనూ అమ్మ జోక్యం చేసుకోదు. తుది నిర్ణయం నాదే. కాకపోతే గైడ్‌ చేస్తుంటుంది. ట్రెండ్‌ను బట్టి ఎలాంటి కథలు ఎంచుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఒడుదొడుకులు ఎదురైనప్పుడు ఏ రకంగా హ్యాండిల్‌ చేయాలి అన్న విషయాలు చెబుతుంటుంది. నా సినిమాలు చూసి నాన్న సురేశ్‌కుమార్‌ పెద్దగా పేర్లు పెట్టరు కానీ.. అమ్మా, అక్క బాగా విమర్శిస్తుంటారు. ఏదన్నా సన్నివేశం ఎబ్బెట్టుగా ఉంటే ఆట పట్టించడం, ఏడిపించడమే పనిగా పెట్టుకుంటారు. కథానాయికగా నాకు వచ్చిన గుర్తింపు చూసి వారు చాలా ఆనందపడుతున్నారు. వారి ఆనందమే నాకు బెస్ట్‌ కాంప్లిమెంట్‌. అమ్మ ప్రతి విషయంలోనూ చాలా పర్టిక్యులర్‌గా, పర్ఫెక్షనిస్ట్‌గా ఉంటుంది. ఆమె సక్సెస్‌కి అదే కారణమని తరచూ చెబుతుంటారు. నాకూ అదే అలవాటైంది. ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిన పెళ్లా అంటే సమాధానం చెప్పలేను. ఏదైనా ఇంట్లో చెప్పగలిగే ధైర్యం, స్వేచ్ఛ ఉన్నాయి. అయినా పెళ్లికి చాలా టైమ్‌ ఉంది. 
ఎగ్జయిటింగ్‌ కథ ఉంటే...

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఇప్పుడు రోజురోజుకీ పెరుగుతోంది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుంది. అన్ని భాషల్లోనూ స్టార్లు సైతం వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నారు. నాకూ ఆ ఆలోచన ఉంది. కానీ ఇప్పట్లో చేయను. ఎగ్జయిటింగ్‌ కథ కుదిరినప్పుడు తప్పకుండా చేస్తా. 


పెండింగ్‌ పనులు పూర్తి చేశా...

లాక్‌డౌన్‌ సమయం మొత్తం కేరళలోనే ఉన్నా. చక్కగా కుటుంబ సభ్యులతో గడిపా. చిన్ననాటి స్నేహితులతో మాట్లాడేదాన్ని. కాలేజీ రోజుల్లో వయోలిన్‌ నేర్చుకోవడం మొదలుపెట్టా. సినిమాల్లోకి వచ్చాక దానికి కొంత గ్యాప్‌ ఇచ్చా. లాక్‌డౌన్‌ సమయంలో మళ్లీ వయోలిన్‌ నేర్చుకోవడం మొదలుపెట్టా. అలాగే ప్యాషన్‌ డిజైనింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ క్లాస్‌లకు అటెండ్‌ అయ్యా. నాకు ఇష్టమైన వంటలు చేశా. కొత్త కథలు విన్నా. ఈ రెండేళ్లలో కాస్త బొద్దుగా తయారయ్యాను. లాక్‌డౌన్‌లో వ్యాయామాలు బాగా చేసి కండలు కరిగించి నాజూగ్గా తయారయ్యా. నేను వెజిటేరియన్‌ని. దక్షిణాది వంటకాలంటే ఇష్టం. పప్పు, రసం, ఉల్లి దోశ, రోటి పచ్చళ్లను ఎక్కువగా ఇష్టపడతా. చీర, జీన్స్‌, షర్ట్‌లో కంఫర్ట్‌గా ఫీలవుతా.


నా బలం డెడికేషన్‌ నాలో నాకు నచ్చేది నవ్వు, కనుబొమలు నాన్నంటే హెల్పింగ్‌ నేచర్‌. స్నేహానికి, బంధుత్వానికి చాలా విలువ ఇస్తారు. 


ఆలపాటి మధు

Updated Date - 2020-07-05T05:30:00+05:30 IST