ఓ కబాబ్ ఓ డిజర్ట్
ABN , First Publish Date - 2020-11-21T06:20:36+05:30 IST
శీతాకాలం.. రాత్రి వేళ.. అలా సరదాగా ఏవైనా స్టార్టర్స్ తింటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. అందుకే మీ కోసం అంగూరీ ముర్గ్, కల్మీ కబాబ్‌లు అందిస్తున్నాం. ఈ రెండు తినేసిన తర్వాత- తియ్యగా ఏదైనా తింటే హాయిగా ఉంటుంది కదూ.. మీలాంటి స్వీట్ ప్రియుల కోసమే షాహీ తుక్డా, కద్దు కా హల్వా

శీతాకాలం.. రాత్రి వేళ.. అలా సరదాగా ఏవైనా స్టార్టర్స్ తింటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. అందుకే మీ కోసం అంగూరీ ముర్గ్, కల్మీ కబాబ్‌లు అందిస్తున్నాం. ఈ రెండు తినేసిన తర్వాత- తియ్యగా ఏదైనా తింటే హాయిగా ఉంటుంది కదూ.. మీలాంటి స్వీట్ ప్రియుల కోసమే షాహీ తుక్డా, కద్దు కా హల్వా రుచులు. ఈ వంటల్లో విశేషమేమిటంటే- వీటిని చేయటం చాలా సులభం. వీటిలో పోషక విలువలు కూడా ఎక్కువే. ఇంకెందుకు ఆలస్యం.. ఆస్వాదిద్దాం పదండి..
కల్మీ కబాబ్
కావలసినవి
చికెన్ లెగ్స్ - 600గ్రా, పెరుగు - అరకప్పు, నిమ్మకాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, పసుపు - అర టీస్పూన్, జీడిపప్పు పేస్టు - మూడు టీస్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూన్, క్రీమ్ - అర టీస్పూన్, ఆవాల నూనె - 60ఎంఎల్, వాము - అర టీస్పూన్, నల్లమిరియాలు - అర టీస్పూన్.
తయారీ విధానం
- ఒక పాత్రలో పెరుగు తీసుకుని అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, క్రీమ్, పసుపు, జీడిపప్పు పేస్టు, వాము, యాలకుల పొడి, దంచిన మిరియాలు వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి. ఫ్రిజ్‌లో ఒకరోజంతా పెట్టాలి.
- తరువాత ముక్కలను పుల్లలకు గుచ్చి నిప్పులపై కాల్చుకుంటే టేస్టీ టేస్టీ కల్మీ కబాబ్స్ రెడీ.
షాహీ తుక్డా
కావలసినవి
వైట్ బ్రెడ్ - 800గ్రా, పంచదార - రెండు కేజీలు, నెయ్యి - ఒక కేజీ, యాలకుల పొడి - ఒక టీస్పూన్, బాదం పలుకులు - 100గ్రా, పిస్తా పలుకులు - 100గ్రా, రబ్రీ(పాలను మరిగించి చిక్కటి మలాయ్‌లా చేసుకోవాలి) - 500గ్రా, సిల్వర్ ఫాయిల్ షీట్స్ - 10, నిమ్మకాయలు - రెండు.
తయారీ విధానం
- బ్రెడ్ ముక్కలను త్రిభుజాకారంలో రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- స్టవ్‌పై పాన్ పెట్టి తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి పానకం తయారుచేసుకోవాలి. అందులో నిమ్మకాయ ముక్కలు వేయాలి.
- ఇప్పుడు మరొక పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక బ్రెడ్ ముక్కలు వేసి వేగించుకోవాలి.
- తరువాత ఆ బ్రెడ్ ముక్కలను పంచదార పానకంలో వేయాలి. కాసేపయ్యాక పానకంలో నుంచి తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి.
- వాటిపై రబ్రీని పోయాలి. బాదం పలుకులు, పిస్తా పలుకులు, సిల్వర్ ఫాయిల్స్‌తో గార్నిష్ చేసుకోవాలి.
- ఈ స్వీట్‌ని చల్లగా సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది.
ఈజిప్టు ప్రాంతంలో క్రీపూ. 8వేల ఏళ్ల క్రితం బ్రెడ్‌ను ఆహారంగా తీసుకున్నట్లు చరిత్రలో ఉంది. ఆ తరువాత కాలంలో బ్రెడ్ తయారీలో అనేక మార్పులు వచ్చాయి.

చికెన్ మెజిస్టిక్
కావలసినవి
బోన్‌లెస్ చికెన్ - 800గ్రా, జీలకర్ర - 50గ్రా, నూనె - 200ఎం.ఎల్, కొత్తిమీర తరిగినది - 20గ్రా, ఎండుమిర్చి - 8, కోడిగుడ్లు - రెండు, కార్న్‌ఫ్లోర్ - 40 గ్రా, పిండి - 50 గ్రా, ఉప్పు - రుచికి తగినంత, పచ్చి మిర్చి తరిగినది - 20 గ్రా, వెల్లుల్లి తరిగినది - 20గ్రా, తరిగిన ఉల్లిపాయ - 50గ్రా, క్రీమ్ - 50ఎం.ఎల్, కారం - 20గ్రా, ఛాట్‌మసాల - 5గ్రా, పసుపు - 2గ్రా.
తయారీ విధానం
- చికెన్‌ను శుభ్రంగా కడిగి సన్నగా, పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఒక పాత్రలో చికెన్ ముక్కలు తీసుకుని అందులో కోడిగుడ్లు పగులకొట్టి వేయాలి.
- తరువాత పిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి.
- ఈ చికెన్ ముక్కలను కొద్దిసేపు వేగించుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్‌పై మరొక పాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర వేయాలి.
- ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి మరికాసేపు వేగించాలి.
- ఇప్పుడు వేగించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేయాలి.
- పసుపు, తగినంత ఉప్పు, కారం, క్రీమ్ వేసి కలుపుకోవాలి.
- కాసేపు వేగిన తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.

అంగూరీ ముర్గ్
కావలసినవి
చికెన్ (బోన్‌లెస్) - 600గ్రా, పెరుగు - 60గ్రా, జీడిపప్పు పేస్టు - 30గ్రా, క్రీమ్ - 40గ్రా, జున్ను - 50గ్రా, గరంమసాలా - 30గ్రా, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - నాలుగైదు, అల్లం - 15గ్రా, వెల్లుల్లి - 10గ్రా, బీట్‌రూట్ జ్యూస్ - 10ఎంఎల్, బ్లాక్ గ్రేప్స్ - 10.
తయారీ విధానం
- ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పేస్టు తయారుచేసుకోవాలి.
- ఒక పాత్రలోకి ఆ పేస్టు తీసుకుని అందులో పెరుగు, జీడిపప్పు పేస్టు, క్రీమ్, జున్ను, గరంమసాలా, బీట్‌రూట్ జ్యూస్, గ్రేప్స్, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించి కొన్ని గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
- తరువాత ముక్కలను పుల్లలకు గుచ్చి నిప్పుపై కాల్చుకోవాలి.
- వేడి వేడిగా తింటే అంగూరీ ముర్గ్ రుచిగా ఉంటుంది.

కద్దు కా హల్వా
కావలసినవి
సొరకాయ తురుము - 600గ్రా, పంచదార - 400గ్రా, కోవా - 100గ్రా, పాలు - రెండు లీటర్లు, బాదం పలుకులు - 20గ్రా, జీడిపప్పు - 20గ్రా, నెయ్యి - 100ఎం.ఎల్.
తయారీ విధానం
- సొరకాయను శుభ్రంగా కడిగి పొట్టు తీసి, ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- స్టవ్‌పై పాన్ పెట్టి పాలు పోసి మరిగించాలి.
- పాలు మరుగుతున్న సమయంలో సొరకాయ ముక్కలు వేయాలి.
- తరువాత పంచదార, కోవా, నెయ్యి వేసి మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి.
- బాదం పలుకులు, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
కబాబ్‌లు ఈనాటికి కావు. కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి ఉన్నాయి. ఆకలితో ఉన్న కొంతమంది సైనికులు జంతువులను చంపి, వాటిని కత్తులకు గుచ్చి కాల్చుకుని తిన్నారు. 800 ఏళ్ల క్రితం నుంచి భారత్‌లో కబాబ్‌ల రుచిని ఆస్వాదిస్తూనే ఉన్నారు. ఆఫ్ఘన్‌కు చెందిన దోపిడీదారులు కబాబ్‌లను మొదటిసారి భారత్‌కు తీసుకొచ్చారు.

వెంకట్, ఎగ్జిక్యూటివ్ చెఫ్
జ్యువెల్ ఆఫ్ నిజాం
గోల్కొండ హోటల్, హైదరాబాద్
