బైక్ ట్యాక్సీ బతుకునిచ్చింది!
ABN , First Publish Date - 2020-03-23T05:30:00+05:30 IST
ఆపదలో ఉన్నప్పుడు బంధువులు ఆదుకోకపోవచ్చు, మిత్రులు స్నేహహస్తం అందిచకపోవచ్చు, కానీ కష్టపడేతత్వం ఉంటే క్లిష్టపరిస్థితుల్లో మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడవచ్చు అని ...

ఆపదలో ఉన్నప్పుడు బంధువులు ఆదుకోకపోవచ్చు, మిత్రులు స్నేహహస్తం అందిచకపోవచ్చు, కానీ కష్టపడేతత్వం ఉంటే క్లిష్టపరిస్థితుల్లో మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడవచ్చు అని నిరూపిస్తున్నారు కాంతా చౌహాన్. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన కాంత చిన్నపిల్లగా ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. కుటుంబం గడవకపోవడంతో ఇంటర్‌తో చదువు ఆపి తల్లిని, ముగ్గురు తోబుట్టువులను చూసుకోవాల్సిన బాధ్యత ఆమె మీద పడింది. ఆ కష్టాలు పెళ్లయ్యాక కూడా కొనసాగాయి. భర్తకు యాక్సిడెంట్ అవ్వడంతో కుటుంబ పోషణ కష్టమైంది. అతనికి వైద్యం చేయించడం, కూతురును సాకడం కోసం ఆమె ‘ర్యాపిడో’ బైక్ డ్రైవర్‌గా కొత్త అవతారం ఎత్తారు.
తొలుత ఆమెను చూడగానే రైడర్లు ముందు షాక్ అవుతున్నారు. తరువాత ‘ఈ బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నారు’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాంత వారి ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెబుతారు. ‘కుటుంబం కోసం బాగా కష్టపడుతున్నావు’ అని కొంతమంది రైడర్లు కాంతను అభినందిస్తుంటే, కొంతమంది మాత్రం ఆడవాళ్లు నడిపే బైక్ ఎక్కడాన్ని నామోషీగా భావించి రైడ్ రద్దు చేసుకుంటున్నారు.
పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో ‘ర్యాపిడో’ బైక్ ట్యాక్సీ నడిపే మొదటి మహిళా కెప్టెన్‌గా కాంత గుర్తింపు దక్కించుకున్నారు. ‘‘మహిళలు మనసు పెట్టాలే గానీ ఏ ఉద్యోగమైనా సరే చక్కగా చేయగలరు’’ అంటారు కాంత.
‘‘ర్యాపిడోలో బైక్ డ్రైవర్‌గా పనిచేయడం వల్ల ఆదాయం రావడమే కాదు, మనకు కుదిరిన సమయంలో పనిచేయవచ్చు. ‘ర్యాపిడో’తో నా కూతురును చదివించుకోగలను, కుటుంబాన్ని పోషించుకోగలను అనే నమ్మకం కలిగింది. ఇలాగే కష్టపడి తొందర్లోనే మాకోసం ఓ ఇల్లు కూడా కట్టుకుంటాను’’ అని ఆమె ఆత్మవిశ్వాసంతో చెప్పారు.