అతనిది పిరికితనమేనా...?

ABN , First Publish Date - 2020-02-12T05:36:56+05:30 IST

రెండేళ్లుగా నేనొక ప్రైవేట్‌ కాలేజ్‌లో కెమెస్ట్రీ లెక్చరర్‌గా పని చేస్తున్నా. నా కొలీగ్‌ ఒకరు ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా చేస్తున్నాడు. చాలాకాలం దాకా విష్‌ చేయడం తప్ప ఏ రోజూ పెద్దగా మాట్లాడింది లేదు.

అతనిది పిరికితనమేనా...?

రెండేళ్లుగా నేనొక ప్రైవేట్‌ కాలేజ్‌లో కెమెస్ట్రీ లెక్చరర్‌గా పని చేస్తున్నా. నా కొలీగ్‌ ఒకరు ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా చేస్తున్నాడు. చాలాకాలం దాకా  విష్‌ చేయడం తప్ప  ఏ రోజూ పెద్దగా మాట్లాడింది లేదు. అయితే లంచ్‌టైమ్‌లో అందరమూ  కలిసి భోంచేస్తూ ఉంటాం. ఆ సమయంలో అతడు సరదాగానే అయినా ఎంతో మంది ఆంగ్లకవుల లోతైన, సున్నితమైన భావనలు చెబుతూ ఉంటాడు. మొదట్లో నేను వినీ విననట్లు ఉండిపోయేదాన్ని. కానీ, పోనుపోను అవి నా మనసును తాకడం మొదలెట్టాయి. ఈ క్రమంలో నేను అతనికి కొంత చనువిచ్చాను. చనువు తీసుకున్నాను కూడా! అది క్రమక్రమంగా ప్రేమగా మారి పోయిందనేది వాస్తవం. ఆ ప్రేమ ఛాయలు  అతని కళ్లల్లో కనపడుతూనే ఉంటాయి కానీ, ఏనాడూ ‘నిన్ను ప్రేమిస్తున్నా’ అనే మాట అతని నోట రానే లేదు.  మాటలు వింటుంటే ఇతణ్ణి తెలివైన వాడు అనుకోవాలో, పిరికివాడు అనుకోవాలో నాకేమీ అర్థం కావడం లేదు.  ‘పిరికి వాడెప్పుడూ మంచివాడు కాలేడు’ అనే మాటను  నేను నమ్ముతాను. ఒకవేళ అతనిలో ఉన్నది పిరికితనమేనని నాకు స్పష్టంగా తెలిసిపోయిననాడు కచ్చితంగా నేను అతన్ని దూరంగా ఉంచుతాను. ఒకవేళ బాగా తెలివైన వాడని తేలితే మాత్రం,  ఏం చేయాలో నాకింకా స్పష్టత లేదు. ఈ విషయంలో నాకు మీరే సలహా ఇవ్వాలి. 

- పి. కీర్తిక, హైదరాబాద్‌

మీరన్నట్లు అంత లోతైన, సున్నిత భావాలున్న వ్యక్తి  తెలివి తక్కువవాడు ఎలా అవుతాడు? కచ్చితంగా అతడు తెలివైనవాడే! కాకపోతే, తెలివైన వాళ్లల్లో కొంత మంది భయస్థులుగా ఉంటారనేది వాస్తవం. మీ విషయానికి వస్తే, అతడలా గుంభనంగా ఉన్నాడు కాబట్టే  అతని  గురించి ఇప్పటికీ మీరు ఎంతో కొంత పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. నిజానికి మీరు అనుకుంటున్నట్లు, అతడు తెలివితక్కువవాడో, పిరికివాడో కాడు. ఎంతో జాగ్రత్తపరుడు అంతే! ముక్కుసూటిగా మాట్లాడిన ఫలితంగా, దూరమైన ఎంతోమందిని ఇప్పటిదాకా చూసి ఉంటాడు. అందుకే అతనిలో కొన్ని భయాలు ఉన్నాయి. మీరన్నట్లు ఒక  బెరుకుతనమో, పిరికితనమో ఉన్నా, అతడు జీవితంలోని అన్ని విషయాల్లోనూ అలాగే ఉంటాడని కాదు కదా! ఏమైనా, ‘పిరికివాడెప్పుడూ మంచివాడు కాలేడు‘ అనే మీ అవగాహన వాస్తవమైనది. ఎందుకంటే మంచి పనులు చెయ్యాలంటే ఎంతో ఽధైర్యం కావాలి. కాకపోతే, ప్రేమ విషయం కాస్త భిన్నమైనది. ఒకరిని ప్రేమించడం వేరు.


తన ప్రేమను అవతలి వ్యక్తి ఆమోదిస్తారో, తిర స్కరిస్తారో ఏమాత్రం తెలియకుండా ఆ ప్రేమను వ్యక్తం చేయడం వేరు. ఒకరకంగా ఇది కొందరికి సాహసం లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రతిపాదనను కొంద రు సున్నితంగా తిరస్కరించవచ్చు. కొందరు రాద్ధాంతం చేయవచ్చు. నలుగురిలో తలదించుకోవాల్సిన పరిస్థితి కలిగించవచ్చు. అందుకే ప్రేమను వ్యక్తం చేయడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇకపోతే, ఇవాళ్టి పిరికివాడు రేపు ఽధైర్యవంతుడు కాడన్న గ్యారెంటీ లేదు. అలాగే ఇవాళ్టి తెలివితక్కువవాడు రేపు తెలివిగలవాడు కాడన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. అందుకే స్వభావాల పైన, వ్యక్తిత్వాల పైన శాశ్వత ముద్రలు వేయకూడదు.

డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చింతపంటి

కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌

ట్రాంక్విల్‌ మైండ్స్‌ క్లినిక్‌, హైదరాబాద్‌

Updated Date - 2020-02-12T05:36:56+05:30 IST