ఆ హాలీవుడ్‌ మలుపులో.... మా తెలుగు ‘సైనికుడు’!

ABN , First Publish Date - 2020-04-30T05:30:00+05:30 IST

నాటకాలు, టీవీ సీరియళ్ళతో మొదలుపెట్టి వెండితెరపై జాతీయ, అంతర్జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన వ్యక్తి ఇర్ఫాన్‌ ఖాన్‌. ఆయన నటించిన ఏకైక దక్షిణాది చిత్రం మహేశ్‌ హీరోగా, దర్శకుడు గుణశేఖర్‌ తీసిన...

ఆ హాలీవుడ్‌ మలుపులో.... మా తెలుగు ‘సైనికుడు’!

నాటకాలు, టీవీ సీరియళ్ళతో మొదలుపెట్టి వెండితెరపై జాతీయ, అంతర్జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన వ్యక్తి ఇర్ఫాన్‌ ఖాన్‌. ఆయన నటించిన ఏకైక దక్షిణాది చిత్రం  మహేశ్‌ హీరోగా, దర్శకుడు గుణశేఖర్‌ తీసిన ‘సైనికుడు’. ఆ అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు గుణశేఖర్‌.


‘‘ఇర్ఫాన్‌తో కలసి నేను చేసింది ఒకే సినిమా (సైనికుడు) కానీ, ఒక దర్శకుడిగా కన్నా ఒక ప్రేక్షకుడిగా అతని నటనతో నాకున్న అనుబంధం ఎక్కువ. అతను చేసిన ప్రతి సినిమా మిస్సవకుండా చూస్తుండేవాణ్ణి. 


తొలి ఆకర్షణ... ‘దృష్టి’... 

నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లోనే గోవింద్‌ నిహలానీ దర్శకత్వంలో శేఖర్‌ కపూర్‌, డింపుల్‌ కపాడియా హీరో హీరోయిన్లుగా ‘దృష్టి’ (1990) అనే హిందీ చిత్రం వచ్చింది. అందులో శాస్త్రీయ సంగీత గాయకుడైన ఓ కుర్రాడిగా కీలక పాత్రను ఇర్ఫాన్‌ పోషించారు. ఆ సినిమాలో అతని నటన బాగుంటుంది. జాతీయ స్థాయి గుర్తింపును అందుకున్న ఈ సినిమా నుంచి ఇర్ఫాన్‌ నన్నే కాదు అందరినీ ఆకర్షించారు. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా నుంచి వచ్చి, మంచి ఆఫ్‌ బీట్‌ చిత్రాల్లో అపూర్వంగా అభినయించే అతణ్ణి అప్పటి నుంచి గమనిస్తుండేవాణ్ణి. అంతకు ముందు మీరా నాయర్‌ తీసిన ‘సలామ్‌ బాంబే’లో కూడా అతను నటించారు. 1990ల్లో నేనూ ‘లాఠీ’తో దర్శకుడినయ్యా. ఆ తరువాత అందరూ బాలలే నటించగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ శ్రీరాముడిగా ‘రామాయణం’ (1996) చేశా. 


అలా కమర్షియల్‌ ‘సైనికుడు’లోకి...

ఎక్కువగా ఆఫ్‌బీట్‌ సినిమాలు చేస్తూ వచ్చిన ఇర్ఫాన్‌ 2000 ప్రాంతానికి హిందీలో కమర్షియల్‌ సినిమాల వైపు కూడా దృష్టి పెట్టారు. అప్పటికి నేను ‘ఒక్కడు’, ‘అర్జున్‌’ లాంటి కమర్షియల్‌ చిత్రాలు చేశా. ‘సైనికుడు’ చేస్తున్నా. నేను, హీరో మహేశ్‌ చర్చించు కుంటున్నప్పుడు, ఆ సినిమాలో విలన్‌ పప్పూ యాదవ్‌ పాత్ర కోసం కె.కె. (మీనన్‌), ఇర్ఫాన్‌ ఖాన్‌ పేర్లు చర్చకు వచ్చాయి. నేను ఇర్ఫాన్‌ వైపు మొగ్గా. విశాల్‌ భరద్వాజ్‌ ‘మక్బూల్‌’ (2003)లో అతని నటన చూసి, మహేశ్‌ కూడా ఇంప్రెస్‌ అయి, గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అలా ఆ ఫక్తు కమర్షియల్‌ విలన్‌ పాత్రకు నా అభిమాన నటుడైన ఇర్ఫాన్‌ను తీసుకోవాలని సంప్రతించా. మహేశ్‌తో నేను చేసిన ‘ఒక్కడు’, బాలల ‘రామాయణం’ గురించి తెలుసుకొని ఒప్పుకున్నారు.


సెట్‌లో... తెలుగులోనే డైలాగ్స్‌ 

‘సైనికుడు’లో ఆ పాత్ర కొంత వినోదాత్మకంగా ఉంటుంది. ఇక, అతనికి నమ్మినబంటు లాంటి పాత్రకు ప్రకాశ్‌ రాజ్‌ను అడిగా. అప్పటికే ప్రకాశ్‌ పేరున్న యాక్టర్‌. అయినా సరే... ఆఫ్‌ బీట్‌ సినిమాలు చూస్తూ, చేస్తూ, సినిమా కళను ఇర్ఫాన్‌లాగే అమితంగా ప్రేమించే ప్రకాశ్‌రాజ్‌ ఎంతో స్పోర్టివ్‌గా నమ్మినబంటు లాంటి ఆ పాత్ర చేశారు. సెట్‌లో ఇర్ఫాన్‌ క్రమశిక్షణతో ఉండేవారు. చాలా మంది పరభాషా నటుల్లా కెమేరా ముందు ఏబీ సీడీలు గొణుగుతూ నటించడం కాకుండా, తెలుగు డైలాగుల అర్థం తెలుసుకొని అవే డైలాగులు చెబుతూ నటించేవారు. అందుకోసం ముందు గానే మాతో చర్చించేవారు. షెడ్యూలుకు ముందే తెలుగు డైలాగులు నాతో ఆడియో రికార్డింగ్‌ చేయించుకొని, విని ప్రాక్టీస్‌ చేసి ప్రిపేరయ్యేవారు. సాధారణంగా ఆఫ్‌ బీట్‌ చిత్రాల కోసం ఎంత శ్రద్ధాసక్తులు పెడతారో... అంతే శ్రద్ధ, కృషి ఒక కమర్షియల్‌ పాత్ర, చిత్రం కోసం అతను పెట్టడం చూసి, నేను ఆశ్చర్యపోయా. అదీ అతని ప్రొఫెషనలిజమ్‌.


ఇర్ఫాన్‌ అంకితభావం గురించీ చెప్పుకోవాలి. ఒకరోజు కోట శ్రీనివాసరావుతో కాంబినేషన్‌ సీన్‌. కోట లాంటి సీని యర్‌ నటుడితో సీన్‌ అని ఇర్ఫాన్‌ ఆ ముందు రోజు నాతో ఆ డైలాగులు మళ్ళీ చెప్పించుకొని, ప్రిపేర్‌ అయ్యారు. సెట్‌లో ఇర్ఫాన్‌ తెలుగులో డైలాగ్‌ చెబుతూ, పోటీతత్వంతో నటించడం చూసి, కోట గారి లాంటి సీనియర్‌ నటుడు ఆశ్చర్యపోయారు. ఇర్ఫాన్‌ను మెచ్చుకొని, ఆశీర్వదించారు. అయితే, హాలీవుడ్‌ అవకాశాల వల్ల ఇర్ఫాన్‌ ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పలేకపోయారు.


‘ఒక్కడు’లో ఆ పాటపై చర్చ...

సెట్‌లో ఎప్పుడూ క్యారెక్టర్‌ మూడ్‌లోనే ఉండే ఇర్ఫాన్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ విషయాల గురించి ఆరా తీసేవారు. అప్పటికే మహేశ్‌ ‘ఒక్కడు’, ‘పోకిరి’ వచ్చాయి. అవి ఇర్ఫాన్‌ చూశారు. దాంతో, మహేశ్‌ అన్నా, అతని నటన అన్నా ఇష్టం ఉండేది. ‘ఒక్కడు’ లోని ‘సాహసం శ్వాసగా సాగిపో’... అంటూ జీపులో వచ్చే పాట గురించి ఎక్కువ చర్చించారు. ఆ పాటంతా ఒకేసారి కాక, అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీశామని తెలుసుకొని ఆశ్చర్చ పోయారు. వేర్వేరుగా చిత్రీకరించినా, సందర్భానికి తగ్గట్టు నటనలో తీక్షణతనూ, తీవ్రతనూ మహేశ్‌ ఎలా కొనసాగించగలిగారని మెచ్చుకున్నారు. 


హాలీవుడ్‌ కోసం మారిన ‘సైనికుడు’

ఇర్ఫాన్‌ ఆర్భాటాలు లేని సాదాసీదా మనిషి. విశేషం ఏమిటంటే, మా ‘సైనికుడు’ షూటింగ్‌ సమయం లోనే ఇర్ఫాన్‌కు హాలీవుడ్‌లో తొలి పెద్ద అవకాశం వచ్చింది. ఏంజెలీనా జోలీ నటించిన ‘ఎ మైటీ హార్ట్‌’. తీరా వాళ్ళు ఇర్ఫాన్‌ దగ్గర అడిగిన డేట్లు... సరిగ్గా మా సినిమాకు అతను పని చేయాల్సిన దాదాపు 30 రోజుల షెడ్యూల్‌ డేట్లే! ఏం చేయాలో తెలియక ఇర్ఫాన్‌ నన్ను సంప్రతిం చారు. నిర్మాత అశ్వినీదత్‌, హీరో మహేశ్‌లతో విషయం చెప్పా. దాంతో, తరువాత నెలలో చేయాల్సిన నెల రోజుల షెడ్యూల్‌ను ముందుకు జరిపి, 18 రోజుల్లో ఇర్ఫాన్‌ వర్క్‌ పూర్తి చేసి, పంపించ గలిగాం. చివరి రోజున తెల్లవారుజాము దాకా పనిచేసి, మా అందరి బెస్ట్‌ విషెస్‌తో హలీవుడ్‌ చిత్రం కోసం అతను బయలుదేరిన క్షణాలు మాకు ఇప్పటికీ గుర్తే. అలా అతని హాలీవుడ్‌ కెరీర్‌ మలుపులో మా ‘సైనికుడు’ టీమ్‌ది కూడా చిన్న పాత్ర ఉన్నందుకు ఆనందిస్తుంటాం. ఆ తరువాత అందనంత ఎత్తుకు ఇర్ఫాన్‌ ఎదిగిపోయారు. 




‘సైనికుడు’ తరువాత తమిళం సహా దక్షిణాది భాషల్లో బాలా లాంటి పలువురు దిగ్దర్శకుల నుంచి ఇర్ఫాన్‌కు అవకాశాలు వచ్చాయి. దర్శకులు, వాళ్ళ సినిమాల గురించి ఆయన నా దగ్గర సమాచారం అడిగి తీసుకొనేవారు. కానీ, ఎందుకనో మరే దక్షిణాది చిత్రమూ ఆయన చేయలేకపోయారు.


మహేశ్‌బాబు ఆనందంగా, ‘‘ఇర్ఫాన్‌ హాలీవుడ్‌లో చేయాల్సిన నటుడు. మనం సపోర్ట్‌ చేద్దాం. అవసరమైతే డే అండ్‌ నైట్‌ చేస్తా’’ అని తన స్టార్‌ హోదాను పక్కనబెట్టి, ముందుకొచ్చారు. నిర్మాత అశ్వినీదత్‌ ఎంతో సహకరించారు.



మా ‘రుద్రమదేవి’ టైమ్‌లో ఇర్ఫాన్‌ వేరేపని మీద ఒకసారి హైదరాబాద్‌ వచ్చి, మెసేజ్‌ చేశారు. షూటింగు ఒత్తిడిలో వెళ్ళి, కలవడం నాకు కుదరలేదు. ఈ లాక్‌డౌన్‌ కాలంలో నా దగ్గరున్న పాత క్లాసిక్‌ చిత్రాల డి.వి.డిలు చూస్తూ, యాదృచ్ఛికంగా రెండు రోజుల క్రితమే ఇర్ఫాన్‌ నన్ను తొలిసారి ఆకర్షించిన ‘దృష్టి’ మళ్ళీ చూశా. ఆ జ్ఞాపకాలలోకి వెళ్ళి, అబ్బురపడ్డా. ఇంత లోనే ఇవాళ ఈ వార్త. ఇర్ఫాన్‌ లాంటి గొప్ప నటుణ్ణి చిన్న వయసులోనే ఇలా కోల్పోవడం బాధగా ఉంది. డియర్‌ ఫ్రెండ్‌ ఇర్ఫాన్‌... అల్విదా!’’

- సంభాషణ: రెంటాల జయదేవ 




Updated Date - 2020-04-30T05:30:00+05:30 IST