ఇంద్రభవనాల్లో ఇలా...!
ABN , First Publish Date - 2020-05-17T08:56:00+05:30 IST
ఇంద్రలోకానికి అధిపతి ఇంద్రుడు. మరి, ప్రేక్షకలోకానికి అభిమాన తారలే! ఎవరి అభిమాన సామ్రాజ్యానికి వారే రారాజు, మహారాణి!!

లాక్‌డౌన్ స్టార్స్
ఇంద్రలోకానికి అధిపతి ఇంద్రుడు.
మరి, ప్రేక్షకలోకానికి అభిమాన తారలే!
ఎవరి అభిమాన సామ్రాజ్యానికి వారే రారాజు, మహారాణి!!
ఈ రారాజులు, మహారాణుల సౌధాలేమీ ఇంద్రభవనాలకు తీసిపోవు!
ఆ ఇంద్రభవనాల ఖరీదు ఎంత ఉంటుంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!!
ఇల్లే ఇంద్రభవనం అనుకుంటే... అందులో ఉన్నవాళ్ల దిల్లు
అంతకంటే అందమైనది!!
స్వీయ నిర్బంధంలో ఉంటూ సామాన్యులకు ఆదర్శంగా నిలుస్తూ చక్కటి సందేశం ఇస్తున్నారు!!!
సోనమ్... ఇల్లు ఆసమ్!
కపూర్ కుటుంబం నుండి కథానాయికగా హిందీలో అడుగుపెట్టిన సుందరి సోనమ్. ముంబయ్‌లో ఆమె తండ్రి, హీరో అనిల్‌కపూర్ ఇల్లు మినీ శ్వేత సౌధమే. అయితే, ఆమె అత్తారిల్లు అంతకంటే పెద్దది. సోనమ్ భర్త ఆనంద్ అహూజా ప్రముఖ వ్యాపారవేత్త. లాక్‌డౌన్‌లో ఇద్దరూ ఇంటి నుండి కాలు బయటపెట్టడం లేదు. ఇంటి పనులు చేస్తున్న సమయంలో కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఇంటీరియర్ వగైరా చూసి ఇల్లు ఆసమ్‌గా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంతా! సోనమ్ సోయగాలను చూసి వహ్వా అని ఎలా అంటున్నారో... ఆ ఇంటిని చూసీ అలాగే అంటున్నారు. అన్నట్టు... ఆ ఇంటి ఖదీరు ఎంతో తెలుసా? రూ. 173 కోట్లు!
హిందీ చిత్రసీమలో బిగ్ బీ అమితాబ్, అక్షయ్‌కుమార్, జాన్ అబ్రహాం తదితరులు, హాలీవుడ్‌లో విల్ స్మిత్, టామ్ క్రూజ్, నటి, మోడల్ కిమ్ కర్దాషియన్, ఆమెకు హాఫ్ సిస్టర్ కైలీ జెన్నర్ తదితరులు కోట్ల రూపాయలు ఖరీదు చేసే భవంతుల్లో స్వీయ నిర్బంధంలో ఉన్నారు.
మన్నత్... జన్నత్!
ముంబయ్‌లోని బాంద్రాలో
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇంటి పేరు ‘మన్నత్’. అందులోకి వెళ్లొచ్చినవారు ‘జన్నత్’లా ఉంటుందని చెబుతారు. జన్నత్ అంటే స్వర్గమని అర్థం! షారుక్ ఎంత ఫేమస్సో... ఆయన ఇల్లూ అంతే ఫేమస్! ‘మన్నత్’లో మినీ థియేటర్, ఆడిటోరియం, ఏ గదికి ఆ గది ప్రత్యేక అలంకరణతో స్వర్గాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇది సుమారు రెండొందల కోట్లు ఖరీదు చేస్తుందట! ప్రస్తుతం ‘మన్నత్’లో షారుక్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్‌రామ్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

‘మెగా’ మేన్షన్!
మొక్కలకు నీళ్లు పెడుతూ ఓ రోజు... నడిచే దారిని శుభ్రం చేస్తూ మరో రోజు... ప్రకృతిని చూసి పులకరిస్తూ ఇంకో రోజు... అమ్మకు స్వయంగా పెసరట్టు ఉప్మా వేసినప్పుడు... అప్పుడప్పుడూ
మెగాస్టార్ చిరంజీవి రీమోడలింగ్ చేసి, సరికొత్తగా తీర్చిదిద్దిన తమ కొత్తింటిని కొంచెం కొంచెంగా చూపించారు. మినిమమ్ మూడేళ్లు ఇంటిని తమ అభిరుచికి తగ్గట్టు మార్చుకోవడానికి మెగాస్టార్ దంపతులు సమయం వెచ్చించారు. దేశ విదేశాల నుండి గృహోపకరణలు, ఇతర సామాగ్రి తెప్పించారు. మొత్తం మీద ఇంటికి సుమారు రూ. 70 కోట్లకు పైగా ఖర్చయిందట. ఇప్పుడీ ‘మెగా’ మేన్షన్‌లో చిరంజీవి కుటుంబం స్వీయ నిర్బంధంలో ఉంది. ఆయన తల్లి సహా కొందరు బంధువులు ప్రస్తుతం అక్కడే ఉన్నారు.

వ్యవసాయ క్షేత్రం... ఏమా విలాసం!?
సాధారణంగా వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్) అంటే పొలాలు, తోటల మధ్యలో చక్కటి ఇల్లు ఉంటుంది.
బాలీవుడ్ భాయ్ సల్మాన్‌ఖాన్ పన్వేల్ ఫామ్ హౌస్ చిన్నసైజు రాజ్యాన్ని తలపిస్తుంది. పదుల సంఖ్యలో స్నేహితులు బస చేయడానికి సరిపడా గదులు, ఈత కొలనులు, గుర్రాలు, జీపులు, ఖరీదైన బైకులు... అక్కడ సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇటీవల యుట్యూబ్‌లో విడుదలైన ‘తేరా బినా’ పాటను పన్వేల్ ఫామ్ హౌస్‌లోనే సల్మాన్ ఖాన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్‌పై చిత్రీకరించారు. ప్రస్తుతం అక్కడే వీరిద్దరితో యూలియా వంటూర్, సింగర్ కమల్ ఖాన్, సల్మాన్ మేనల్లుడు ఒకరు సహా మరికొందరు స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

ప్రియానిక్... వాట్ ఎ కిక్!
ప్రియాంకా చోప్రా ఇప్పుడు అంతర్జాతీయ నటి. ఆమె భర్త నిక్ జోనాస్ ఫేమస్ అమెరికన్ సింగర్. ప్రియాంక నటన, నిక్ పాటలు ఎంత కిక్ ఇస్తాయో? వాళ్లింటి ఫొటోలూ అంతే కిక్ ఇస్తాయి. లాస్ ఏంజిల్స్‌లో సుమారు రూ. 150 కోట్లు ఖరీదు చేసే భవంతిని ప్రియానిక్ జంట కొన్నాళ్ల క్రితం కొనుగోలు చేసింది. ఆహ్లాదకరమైన వాతావరణం, కొండల మధ్యలో నెలకొని ఉన్న ఆ ఇంటిలో ప్రస్తుతం వీళ్లు స్వీయ నిర్బంధంలో ఉన్నారు.
