ప్లాస్టిక్ తెస్తే మాస్క్ ఇస్తారు!
ABN , First Publish Date - 2020-08-20T05:30:00+05:30 IST
ప్లాస్టిక్ వ్యర్థాలు, మొక్కలు... వీటిలో దేన్నైనా అక్కడికి తీసుకువెళ్ళి, ‘డిపాజిట్’ చెయ్యొచ్చు. బదులుగా మాస్కులూ, శానిటైజర్ తెచ్చుకోవచ్చు.

ప్లాస్టిక్ వ్యర్థాలు, మొక్కలు... వీటిలో దేన్నైనా అక్కడికి తీసుకువెళ్ళి, ‘డిపాజిట్’ చెయ్యొచ్చు. బదులుగా మాస్కులూ, శానిటైజర్ తెచ్చుకోవచ్చు.
ఈ కరోనా కాలంలో పేదల కుటుంబాల ఆరోగ్య సంరక్షణతో పాటు పర్యావరణ స్పృహను ప్రజల్లో పెంచడానికి పశ్చిమబెంగాల్‌లోని ఒక క్లబ్ చేస్తున్న ప్రయత్నం ఇది.
‘‘ప్రపంచాన్ని పర్యావరణహితంగా మార్చాలన్నది మా క్లబ్ లక్ష్యం. అదే సమయంలో కరోనా రహితంగా కూడా మార్చాల్సిన పరిస్థితి ఇప్పుడు తలెత్తింది. ఈ రెండిటినీ నెరవేర్చడం కోసమే ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’’ అంటున్నారు పశ్చిమబెంగాల్‌లోని బర్ద్వాన్ పట్టణానికి చెందిన పల్లిమంగళ్ సమితి ప్రతినిధులు.
కొవిడ్-19 వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో ప్రతి ఒక్కరూ మాస్కులూ, శానిటైజర్ ఉపయోగించక తప్పడం లేదు. అయితే రెండు పొరల సాధారణ మాస్కు దర దాదాపు యాభై రూపాయలుంటోంది.
అలాగే ఒక లీటర్ శానిటైజర్ ధర కనీసం రెండు వందల రూపాయల నుంచీ మొదలవుతోంది. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఈ ఖర్చును భరించడం కష్టమే. అలాంటి కుటుంబాలకు మాస్కులు, శానిటైజర్లు అందించడంతో పాటు పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్‌ను రోడ్ల మీదా, కాలువల్లోకీ జనం విసిరేయకుండా నిరోధించడానికీ, మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికీ ఈ క్లబ్ ముందుకు వచ్చింది.
అయిదు కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు లేదా అయిదు మొక్కలు తీసుకు వచ్చి క్లబ్ ఏర్పాటు చేసిన ‘బ్యాంక్’లో అందజేస్తే రెండు మాస్కులు, ఒక లీటర్ శానిటైజర్ ఇస్తామని ప్రకటించింది.
‘‘ప్రతి రోజూ వందమందికి వీటిని అందించేలా ప్రణాళిక వేసుకున్నాం. ప్రస్తుతం ఒక కుటుంబానికి నెలకు ఒకసారి మాస్కులు, శానిటైజర్ ఇస్తున్నాం. శానిటైజర్ తయారీ కూడా మేమే చేస్తున్నాం’’ అన్నారు సమితి ప్రధాన కార్యదర్శి సందీపన్ సర్కార్. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చేదాకా ఈ పథకాన్ని నసాగిస్తామంటున్నారాయన. మొక్కలు, ప్లాస్టిక్ తీసుకురాని వ్యక్తులు ఆ మాస్కులు, శానిటైజర్ కిట్‌ను రూ. 49కి కొనుక్కోవచ్చు. ఎలాంటి లాభాపేక్షా లేకుండా చేస్తున్న ఈ కార్యక్రమానికి ఊహించని స్పందన వస్తోంది.
ప్రజలు డిపాజిట్ చేసే ప్లాస్టిక్‌ను ఎకో బ్రిక్స్ తయారీ కోసం ఉపయోగిస్తున్నామనీ, మొక్కలను రోడ్ల పక్కనా, నదీ తీరాల్లోనూ నాటుతున్నామనీ సర్కార్ చెబుతున్నారు. 1936లో ఏర్పాటైన ఈ క్లబ్‌కు 2,500 మంది సభ్యులున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం పల్లిమంగళ్ సమితికి కొత్త కాదు. కొన్నేళ్ళ కిందట ఉల్లిపాయల ధర ఆకాశానికి అంటుతున్నప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు తెచ్చిన వారికి ఉల్లిపాయల్ని క్లబ్ పంపిణీ చేసింది. ఇటు ప్రజారోగ్యాన్నీ, అటు పర్యావరణహితాన్నీ ప్రోత్సహిస్తున్న ఈ క్లబ్ ప్రయత్నం సర్వత్రా ప్రశంసలందుకుంటోంది.