ఆత్మవిశ్వాసంతో పోరాడతా!

ABN , First Publish Date - 2020-05-11T06:19:52+05:30 IST

గృహిణిగా, తల్లిగా భావోద్వేగాలూ... ఉన్నతోద్యోగినిగా ఊపిరి సలపని బాధ్యతలూ... రెంటినీ సమన్వయం చేసుకుంటూ కరోనాపై పోరాటంలో తనవంతు కర్తవ్యాన్ని దీక్షగా నిర్వర్తిస్తున్నారు పుణే అడిషనల్‌ మున్సిపల్‌ కమిషనర్...

ఆత్మవిశ్వాసంతో  పోరాడతా!

గృహిణిగా, తల్లిగా భావోద్వేగాలూ... ఉన్నతోద్యోగినిగా ఊపిరి సలపని బాధ్యతలూ... రెంటినీ సమన్వయం చేసుకుంటూ కరోనాపై పోరాటంలో తనవంతు కర్తవ్యాన్ని దీక్షగా నిర్వర్తిస్తున్నారు పుణే అడిషనల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రూబల్‌ అగర్వాల్‌. పన్నెండేళ్ళ వృత్తి జీవితంలో ఎన్నో సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొన్న ఈ ఐఎఎస్‌ అధికారిణి సమాజంలో ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 


‘‘ఏడేళ్ళ మా అబ్బాయి ‘‘అమ్మా! కరోనా వస్తుందని ఎవరినీ బయటకు వెళ్ళద్దంటూ... నువ్వెందుకు రోజూ ఆఫీసుకు వెళుతున్నావు?’’ అనే ప్రశ్న వేసినప్పుడు ఏదో తెలియని ఉద్వేగం నన్ను కుదిపేసింది. నా గురించి వాడు పడుతున్న ఆదుర్దా చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపటికి గుండె దిటవు చేసుకొని వాడికి అర్థమయ్యేలా పరిస్థితిని వివరించాను. వాడు మారు మాట్లాడలేదు. ‘నువ్వెందుకు ఆఫీసుకు వెళుతున్నావు?’ అని మళ్ళీ నన్ను అడగలేదు’’ అంటారు రూబల్‌ అగర్వాల్‌. తెలిసీ తెలియని వయసులో ఉన్న బిడ్డను ఇంట్లో వదలి, విధి నిర్వహణలో ఎంతోమంది తల్లులూ, పిల్లల ఆరోగ్యాలు కరోనా మహమ్మారి బారిన పడకుండా ఆమె నియంత్రిస్తున్నారు.


రూబల్‌ మహారాష్ట్ర కేడర్‌ (2008)కు చెందిన ఐఎఎస్‌ అధికారిణి. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆమె పని చేశారు. ఆ తర్వాత పుణే అడిషనల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. పుణే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆరోగ్య విభాగం పర్యవేక్షణతో పాటు ‘పుణే స్మార్ట్‌ సిటీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ (పిఎ్‌ససిడిసిఎల్‌) సీఈవోగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. రెండువేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్న పుణే నగరంలో పిఎ్‌ససిడిసిఎల్‌ కీలక పాత్ర పోషిస్తోంది.


కరోనా పాజిటివ్‌ కేసులు, రికవరీ కేసులు, మరణాల గణాంకాలను రూపొందించేదీ, పుణేలో వైద్య పరీక్షలకు సంబంధించి సర్వే గణాంకాలను వివిధ ఏజెన్సీలకు అందజేసేదీ ఈ సంస్థే! వాటిపై పూర్తి పర్యవేక్షణ రూబల్‌దే!! ‘‘ఉదయాన్నే పిపిఈ కిట్‌, మాస్క్‌, చేతి తొడుగులు ధరించి బయలుదేరుతాను. ‘కొవిడ్‌-19’ బాధితులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులను సందర్శిస్తాను. మా కార్పొరేషన్‌లో 42 విభాగాలు ఉన్నాయి. వాటి సిబ్బంది, ప్రధానంగా వైద్య బృందం, ఇంజనీర్ల బృందం, క్లరికల్‌ సిబ్బంది వైరస్‌ నియంత్రణపైనే ఇరవైనాలుగు గంటలూ తలమునకలై ఉన్నారు’’ అని చెబుతున్నారు రూబియా. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ విభాగానికి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆమె పరిశీలిస్తారు. వివిధ ప్రాంతాల్లో పరిస్థితి తెలుసుకుంటారు. ఎక్కడ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయో గుర్తిస్తారు.

‘‘నిత్యం సిబ్బంది పనులను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటాను. పాజిటివ్‌ పేషెంట్ల వివరాలు సేకరిస్తాను. అలాగే క్వారంటైన్‌లో ఉన్న రోగుల బాగోగులు కూడా ఒక ప్రధానమైన అంశం. అనుక్షణం వారి సంరక్షణ పట్ల శ్రద్ధ చూపించాల్సిందే. ప్రాథమిక సదుపాయాలు వారికి అందుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సూచనలు, ఆదేశాలూ ఇస్తాను’’ అని అన్నారు రూబల్‌. ‘‘పాజిటివ్‌ కేసుల సంఖ్య బాగా పెరిగే ప్రమాదం ఎదురుకావచ్చు. దానికి ముందే సంసిద్ధంగా ఉండడం తప్పనిసరి. అందుకే అదనపు సిబ్బందిని ముందుగానే అందుబాటులో ఉంచుకుంటున్నాం’’ అని చెప్పారామె. ప్రైవేట్‌ ఆసుపత్రుల విషయంలో కూడా కాస్త సడలింపులు అవసరమనీ, అవి మూసేస్తే గుండె జబ్బులు, జీవనశైలి వ్యాధులు, రక్తపోటు, క్యాన్సర్‌ తదితర సమస్యలతో సతమతమయ్యే రోగులు వైద్య సేవలు అందక ఎంతో ఇబ్బంది పడతారనీ ఆమె అంటున్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రైవేట్‌ వైద్యుల సహకారం అవసరమనీ, వారు కూడా చేతులు కలిపితే విపత్తు నియంత్రణ సులువవుతుందని చెబుతున్నారు. ‘‘నా వృత్తి జీవితంలో ‘కొవిడ్‌-19’ నియంత్రణ ఒక పెద్ద సవాల్‌. అయితే ఈ విపత్తును నియంత్రించడానికి ఆత్మవిశ్వాసంతో పోరాడగలననే నమ్మకం నాకుంది’’ అని ధీమాగా చెబుతున్న రూబల్‌ దానికోసం తన అనుభవమే ఆయుధంగా ముందుకు వెళుతున్నారు.




ఎక్కడికెళ్ళినా బెస్ట్‌!

అత్యుత్తమ అధికారిణిగా రూబల్‌కు మహారాష్ట్రలో మంచి పేరు ఉంది. మహారాష్ట్ర వరదల సమయంలో ఆమె చూపిన పనితనం ప్రజల మన్ననలు అందుకుంది. షిరిడీ సాయిబాబా సంస్థాన్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి (సిఇఓ)గా కూడా ఆమె పని చేశారు. ఆ బాధ్యతలు చేపట్టిన తొలి ఐఎఎస్‌ అధికారి ఆమే కావడం విశేషం. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆమె ఇ-గవర్నెన్స్‌కు చొరవ తీసుకున్నారు. అందుకోసం కొత్త మొబైల్‌ యాప్‌ ప్రారంభించారు. అంతేకాదు, షిరిడీకి రైలు మార్గం ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. జల్గావ్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ‘బేటీ బచావ్‌... బేటీ పఢావ్‌’ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి 2016-17లో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘బెస్ట్‌ కలెక్టర్‌’ అవార్డును కూడా పొందారు. అలాగే మహాత్మాగాంధీ శాంతి అవార్డును అందుకున్నారు. అకోలా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన రూబల్‌ చేపట్టిన ప్రతి పనిలోనూ తానేమిటో నిరూపించుకున్నారు. ఇప్పుడు కరోనాపై అలుపెరుగని పోరు సాగిస్తున్నారు.


Updated Date - 2020-05-11T06:19:52+05:30 IST