ప్రేక్షకులకు బంధుప్రీతి ఉండదు!
ABN , First Publish Date - 2020-12-13T06:31:29+05:30 IST
టాలీవుడ్‌ను ఉత్తరాది అమ్మాయిలే ఏలుతున్నారనేది చాలా కాలంగా ఒక కంప్లైంట్! ఇప్పుడు మన తెలుగమ్మాయి అమ్రిన్ బాలీవుడ్లో ఒకే సారి రెండు సినిమాల్లో నటిస్తోంది...

టాలీవుడ్‌ను ఉత్తరాది అమ్మాయిలే ఏలుతున్నారనేది చాలా కాలంగా ఒక కంప్లైంట్! ఇప్పుడు మన తెలుగమ్మాయి అమ్రిన్ బాలీవుడ్లో ఒకే సారి రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన అమ్రిన్‌ను నవ్య పలకరించినప్పుడు అనేక విశేషాలు చెప్పింది..
‘‘మా నాన్న సాజిద్ ఖురేషి ఒక నిర్మాత. తెలుగులోను, హిందీలోను సినిమాలు నిర్మించారు. మాది సినిమా కుటుంబమే కానీ ఇంట్లో అలాంటి వాతావరణమే ఉండేది కాదు. మేము ఎప్పుడు సెట్స్‌కు కూడా వెళ్లలేదు. చిన్నప్పటి నుంచి నాకు బిజినెస్ ఉమెన్ కావాలని ఉండేది. అందుకే బీబీఏలో చేరా. చదువు సాగుతున్న సమయంలో ఒక రోజు నాన్నతో కలిపి ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తుంటే- నాన్న నావైపు చూసి- ‘‘నువ్వెందుకు హీరోయిన్ కాకూడదు?’’ అన్నారు. ఆ మాటలు నాలో ప్రేరణ కలిగించాయి. ఈ సంఘటన జరిగిన సమయంలోనే నాన్న తెలుగులో హిట్ అయిన ‘సినిమా చూపిస్త మావ’ సినిమాను హిందీలో ‘బ్యాడ్బోయ్’ అనే పేరు మీద రీమేక్ చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. హీరోయిన్గా కొత్తమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారని.. ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసింది. ఎందుకైనా మంచిదని తెలుగులో ఆ సినిమా చూసి ఆడిషన్స్‌కు వెళ్లా. కానీ అక్కడ దాకా వెళ్లిన తర్వాత- ఆ సినిమాలో సన్నివేశాలు కాకుండా వేరే సినిమాలో పార్ట్‌ను నటించమన్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషికి నా నటన నచ్చింది. నన్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఆ తర్వాతే నాన్నకు చెప్పా. ఆయన చాలా ఆశ్చర్యపోయారు.. తర్వాత ఆనందపడ్డారు కూడా.
ఎవరైనా ఒకటే!
నేను బయట ఒక నిర్మాత కుమార్తె కావచ్చు. కానీ ప్రేక్షకులకు ఆ వివరాలేమి అక్కరలేదు. తెరపై నేను ఎలా నటించాననే విషయాన్నే చూస్తారు. బాగా నటించకపోతే తిప్పి కొడతారు. వారికి బంధుప్రీతి ఉండదు. బ్యాడ్బోయ్ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసి- అమ్మానాన్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘ఓ తండ్రిగా కాకుండా ప్రేక్షకుడిగా.. నిర్మాతగా సినిమా చూశా. ఈ సినిమా హిట్ అవుతుంది’ అన్నారు నాన్న. ఈ సినిమాలో నాది ఒక సగటు అమ్మాయి పాత్ర. ప్రతి అమ్మాయి జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలన్నీ దీనిలో ఉంటాయి. అంటే ప్రతి అమ్మాయి- ఈ పాత్రలో తనను తాను చూసుకుంటుంది. ఈ సినిమా డబ్బింగ్, సీన్స్ పూర్తయ్యాయి. కొన్ని సాంగ్స్ మిగిలాయి. వీటి చిత్రీకరణ కోసమే హైదరాబాద్‌కు వచ్చా. ఇక్కడకు వస్తే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఎంతయినా సొంత ఇంట్లో ఉండే అనుభూతి వేరే కదా! ఇక్కడ అనేక మంది బంధువులు ఉన్నారు. వీరందరికీ నేను మామూలు అమ్రీన్నే!