హింసతో హింసను ఆపలేం!

ABN , First Publish Date - 2020-02-12T06:26:05+05:30 IST

మానవహక్కులకు విఘాతం తలెత్తే ప్రతి చోటా ఆమె కనిపిస్తారు. అన్యాయాలపై సత్యాగ్రహ స్వరం వినిపిస్తారు.

హింసతో హింసను ఆపలేం!

మానవహక్కులకు విఘాతం తలెత్తే ప్రతి చోటా ఆమె కనిపిస్తారు.

అన్యాయాలపై సత్యాగ్రహ స్వరం వినిపిస్తారు. ఇప్పుడు ఎన్‌ఆర్సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ లాంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరు సాగిస్తున్నారు. నర్మదా బచావో ఉద్యమకర్త, ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధా పట్కర్‌ ఇటీవల హైదరాబాద్‌ వచ్చినప్పుడు ప్రస్తుత సామాజిక, రాజకీయ అంశాలపై ‘నవ్య’తో ప్రత్యేకంగా సంభాషించారు.


‘‘కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశంలో హిందువులు, ముస్లింల మధ్య విభేదాలను సృష్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) వంటి విధానాలను ముందుకు తెచ్చింది. సీఏఏ మన రాజ్యాంగానికి విరుద్ధం. మిగతా రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం సేకరించకుండా, ఏకపక్షంగా మోదీ, అమిత్‌ షా వ్యవహరిస్తున్నారు. డెభ్భై ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో గత ప్రభుత్వాలేవీ మరీ ఇంత నియంతృత్వ ధోరణులతో ప్రవర్తించలేదు. ఇక కశ్మీరు అసెంబ్లీని సంప్రతించకుండా స్వయంప్రతిపత్తి హోదా కల్పించే ఆర్టికల్‌ 370, సెక్షన్‌ 35ఏలను నిర్వీర్యం చేయడం ద్వారా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. అయోధ్య విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోను. అయితే సుప్రీం కోర్టు సైతం అయోధ్యలో రామమందిరం ఉన్నట్టు పేర్కొనలేదు. చారిత్రక కట్టడమైన బాబ్రీ మసీదు కూల్చివేత చట్టవ్య తిరేక చర్య. అందుకు కారణమైన వాళ్లను శిక్షించేలా తగిన మార్గదర్శకాలు ఉండాలి! అయోధ్య కేవలం ఒక భూవివాదం కాదు, ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశం. అయితే, మెజారిటీ రాజకీయాల ప్రభావం వల్ల ఒక వర్గం విశ్వాసాలను ధ్వంసం చేసిన దోషులు చట్టం నుంచి తప్పించుకుంటున్నారు.  


స్ఫూర్తి పథంలో యువతరం

పెద్దనోట్ల రద్దు వల్ల దేశ ఆర్థికవ్యవస్థ కుదేలయిందని ఆర్థికవేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిరుద్యోగం పెరిగింది. బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే తదితర ప్రభుత్వ రంగసంస్థలనూ ప్రైవేటీకరించడానికి అడుగులు వేస్తున్నారు. ఆర్థిక అసమానతలు, పేదరికం నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మతం పేరుతో, పౌరసత్వం పేరుతో చీలికలు తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సీఏఏ, ఎన్‌ఆర్సీ కేవలం ముస్లింలకు మాత్రమే వ్యతిరేకం కాదు. అవి భారతీయుల మనుగడకే ప్రశ్నార్థకం. కనుక ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలను సుమోటోగా న్యాయ వ్యవస్థ స్వీకరించాలి. అన్ని వర్గాల ప్రజలూ ఏకమై విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను భగ్నం చేయాలి. ప్రస్తుత పరిస్థితులలో యువతరం అద్వితీయమైన పాత్ర పోషిస్తోంది. అందుకు జామియా మిలియా, అలీగఢ్‌, జేఎన్‌యూల్లో విద్యార్థుల ప్రతిఘటనే నిదర్శనం. కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, బెంగాల్‌... ఇలా దేశవ్యాప్తంగా సత్యాగ్రహ పంథాలోనే ప్రజాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఉరి సరికాదు.. 

మరణ దండన, ఎన్‌కౌంటర్లు వంటి పాశవిక శిక్షలకు మొదటి నుంచి నేను పూర్తి వ్యతిరేకం. హైదరాబాద్‌లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ అత్యంత హేయమైన చర్య. ఆ నిందితులంతా అణగారిన వర్గాలకు చెందినవారు. కనుకనే ప్రభుత్వం మద్దతుతో పోలీసులు ఆ పని చేయగలిగారు. అదే సమయంలో ఉన్నావో అత్యాచార  కేసులో దోషి పట్ల పోలీసులు చూపిన ఉదాసీనత మన వ్యవస్థకే సిగ్గుచేటు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించడాన్ని కూడా నేను స్వాగతించలేను! అలాగని వాళ్లు చేసిన నేరాన్ని సమర్థిస్తున్నట్టు కాదు! ఉరిశిక్షతో మహిళలపై అకృత్యాలు ఆగుతాయా? దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజే కోదాడలో పదిహేనేళ్ల అమ్మాయిపై లైంగిక దాడి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. నిర్భయ ఉదంతం నేపథ్యంలో జస్టిస్‌ వర్మ కమిటీ సిఫార్సులను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. హింసతో హింసను అదుపు చేయలేం. ప్రపంచవ్యాప్తంగా 146 పైచిలుకు దేశాలు మరణదండనను రద్దుచేశాయి. మరణశిక్షకు బదులుగా యావజ్జీవ కారాగార శిక్ష వంటివి కఠినంగా అమలుచేయండి. 


మేధావులంటే భయమెందుకు?

మేధావులు, ప్రశ్నించేవారంటే మన నాయకులకు చాలా భయం. బీజేపీ ప్రభుత్వం తెస్తున్న విధానాలను వ్యతిరేకించే వాళ్లను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ల ఆగడాలను నిలదీసేవారిపై అక్రమకేసులు పెడుతున్నారు. ఉదాహరణకు సుధా భరద్వాజ్‌, వరవరరావు వంటి మేధావుల్ని నిర్బంధించడం సరికాదు! నాకు తెలిసి విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు సాయుధ పంథా పోరాటంలో పాల్గొనలేదు. కనుక వారందరికీ సంబంధించిన కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి. మీరట్‌, ముజఫర్‌నగర్‌, లఖనవూ తదితర ప్రాంతాల్లో పర్యటించాను. అక్కడ మంచం మీద నుంచి కాలు కింద పెట్టలేని వయసు మీరిన వారి మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. అయితే ప్రజలు చూస్తూ కూర్చోకుండా, వీధుల్లోకి వచ్చి ఉద్యమిస్తున్నారు. 


అదే మాకున్న సవాలు

ప్రజా వ్యతిరేక విధానాలను అమలుపరచడంలో రాజకీయ పార్టీలన్నీ ఒక్కటే తీరుగా వ్యవహరిస్తాయి. నేతల దృష్టిలో ప్రజలంటే ఒక చులకన భావం. ఎన్నికల వేళ వాళ్లు జనాకర్షణ పథకాలు, అలవిమాలిన వాగ్దానాలతో జనాల్ని మభ్యపెడుతున్నారు. మధ్యతరగతి ప్రజలు ఎప్పుడూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తారు. పేదలు తక్షణ ఉపశమన మార్గాల కోసం అన్వేషిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో జనాన్ని చైతన్యపరచ డం మా బాధ్యత. ప్రస్తుత పరిస్థితులలో సామాజిక సమస్యలపై యువతకు అవగాహన కల్పిస్తూ, శిక్షణ అందించడం, వారిని ఉద్యమాలకు ఉద్యుక్తుల్ని చేయడం మా ముందున్న సవాలు. తాజాగా హైదరాబాద్‌లో ఎన్‌ఆర్సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ లకు వ్యతిరేకంగా జరిగిన ‘మిలియన్‌ మార్చ్‌’లో ప్రజా సంఘాలతోపాటూ చాలామంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఆ శాంతియుత ర్యాలీలో పాల్గొన్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టడం విచారకరం. ఏమైనా, మానవాళి అభివృద్ధికి తిరోగమనంగా పరిణమించిన పెట్టుబడిదారీ వ్యవస్థ, మతోన్మాదం, అవినీతి లాంటి సమస్యలను ప్రజలంతా ఏకమై ప్రతిఘటించాలి.’’

కె. వెంకటేశ్‌, 

ఫొటోలు: రాజేశ్‌ జంపాల

Updated Date - 2020-02-12T06:26:05+05:30 IST