కొలీగ్స్‌తో ఇలా!

ABN , First Publish Date - 2020-07-08T05:30:00+05:30 IST

ఆఫీసులో కొన్నిసార్లు పని ఒత్తిడితో పాటు అసూయపడే సహోద్యోగులనూ భరించాల్సి వస్తుంది. దీనివల్ల సరిగ్గా పని చేయలేం...

కొలీగ్స్‌తో ఇలా!

ఆఫీసులో కొన్నిసార్లు పని ఒత్తిడితో పాటు అసూయపడే సహోద్యోగులనూ భరించాల్సి వస్తుంది. దీనివల్ల సరిగ్గా పని చేయలేం... వారిపై కోపమూ ప్రదర్శించలేం. మరి ఎలా? అలాంటి వారితో సుతిమెత్తగా వ్యవహరిస్తూనే ... ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. అదెలాగంటే...  


  1. మీ పని పక్కాగా చేయండి: మిమ్మల్ని చూసి అసూయ పడేవారు కంగుతినాలంటే... మీ పనిని పక్కాగా చేయండి. మీ పనితీరు, ఆఫీసులో మీ ప్రవర్తనతో తోటి ఉద్యోగుల అభిమానం చూరగొనండి. మీ బాస్‌ అభినందించేలా పనిచేయండి. సంస్థలో కీలకమైన ఉద్యోగిగా ఎదగండి. దాంతో మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవారు తోకముడుస్తారు.
  2. పట్టించుకోకండి: పనిగట్టుకొని మిమ్మల్ని ఎవరైనా విసిగిస్తుంటే వారితో ప్రవర్తన మీకెంత ఇబ్బంది కలిగిస్తుందో చెప్పండి. అయితే ఒక్కోసారి వారు మరింత రెచ్చిపోయి, మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. ఎందుకంటే మీరలా చెప్పడం వారికి మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. అలాకాకుండా వారు ఏమన్నా పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోండి. ఇలాచేస్తే వారు కొంత వెనక్కి తగ్గుతారు. 
  3. ఆధారాలతో చెక్‌ పెట్టండి: ఏ పని పూర్తి చేసినా దానికి తగ్గ ఆధారాలు రెడీగా ఉంచుకోండి. మీరు వారాంతాల్లో, డెడ్‌లైన్‌ లోపు, అదనంగా చేసిన పని వివరాలను ఫొటో తీసుకోండి. ఎందుకంటే మీ మీద అసూయతో ఉన్న వారు నిజాలను కప్పిపెడుతూ, ‘సెలవు రోజున పనిచేయడం మీకు బద్ధకమని’ చాలా తేలిగ్గా అందరి ముందు అనేస్తారు. బాస్‌ వద్ద మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు. కనుక వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండడానికే ఆధారాలు. 
  4. ఇతర కొలీగ్స్‌తో స్నేహం: మీరంటే ఆసూయ పడేవారి ఉద్దేశం ఏమంటే... ఆఫీసులో మిమ్మల్ని ఒంటిరివాళ్లను చేసి, అవసరంలో మీకు ఎవరి సహాయం, మద్దతు లభించకుండా చూడడం. అందుచేత ఇతర ఉద్యోగులతో స్నేహం పెంచుకోవడం ఎంతో అవసరం. అసూయపరుల జట్టుతో కాకుండా కొత్తవాళ్లతో, వీలైతే మీకన్నా పై అధికారులతో ఫ్రెండ్‌షిప్‌ చేయడం మంచిది. 
  5. క్షమించే గుణం: ప్రతి దానికీ అడ్డుతగిలే, నిరూత్సాహపరిచే కొలీగ్స్‌తో కలిసి పనిచేయడం ఒత్తిడిని పెంచుతుంది. దాంతో మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. అలా కాకుండా మరింత మెరుగ్గా పనిచేసి, వారు తమ తప్పు తెలుసుకునేలా చేయండి. అంతేకాదు మానసికంగా దృఢంగా ఉండండి. ఈర్ష్యపడే వారిని క్షమించి మీ మంచితనం చాటుకోండి. ఇలా వారిని సుతిమెత్తగా ఎదుర్కొంటూ మీ పనిలో దూసుకుపోండి.

Updated Date - 2020-07-08T05:30:00+05:30 IST