ఆపద్బాంధవులు

ABN , First Publish Date - 2020-04-15T06:03:58+05:30 IST

జనజీవితం అస్తవ్యస్తమైపోయింది. ప్రపంచం స్తంభించిపోయింది. తినడానికి తిండి లేక కొందరు... నిలువ నీడ లేక మరికొందరు... కరోనా ప్రకంపనలతో అల్లాడుతున్నారు. ఈ విషమ పరిస్థితుల్లో అభాగ్యులను ఆపద్బాంధవుల్లా ...

ఆపద్బాంధవులు

  • జనజీవితం అస్తవ్యస్తమైపోయింది. ప్రపంచం స్తంభించిపోయింది. తినడానికి తిండి లేక కొందరు... నిలువ నీడ లేక మరికొందరు... కరోనా ప్రకంపనలతో అల్లాడుతున్నారు. ఈ విషమ పరిస్థితుల్లో అభాగ్యులను ఆపద్బాంధవుల్లా ఆదుకొంటున్నారు మనసున్న మారాజులు. అభాగ్యుల ఆకలి తీర్చి... కనీస అవసరాలు కల్పించి... స్ఫూర్తి రగిలిస్తున్నారు. 

ఓ మంచి టైలర్‌ 

కరోనా దెబ్బకు అంతా తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చుంటే... కొందరు మాత్రం ఈ ఆపత్కాలంలో సమాజ శ్రేయస్సు కోసం ఆలోచిస్తున్నారు. అలాంటి పెద్ద మనసున్న వ్యక్తే ఈ దర్జీ. పేరు దేవీలాల్‌ జంగిడ్‌. వయసు 55 సంవత్సరాలు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉండే ఈ టైలర్‌ ఇంట్లో ఊరికే కూర్చోలేదు. మాస్క్‌లు కుట్టి... తన ప్రాంతంలోని వారందరికీ ఉచితంగా ఇస్తున్నారు. 

కోవిడ్‌-19 వైరస్‌ తాకిడికి దేశంలో మాస్క్‌ల కొరత అంతా ఇంత కాదు. ఇవి దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నా... రెండు మూడు రూపాయల మాస్క్‌ను పాతిక అంతకు మించే అమ్మేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన దేవీలాల్‌... తన కుట్టు మిషన్‌కు పని చెప్పారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఆయన మాస్క్‌ల తయారీలో బిజీ అయిపోయారు. 

‘బయట మార్కెట్లు, ఆన్‌లైన్‌లో... ఎక్కడా మాస్క్‌లు దొరక్క ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఉన్నా... భారీగా రేట్లు పెంచేసి విక్రయిస్తున్నారు. అందుకే నేనీ నిర్ణయం తీసుకున్నా. మా ప్రాంతంలో అందరికీ అందే వరకూ మాస్క్‌లు కుడుతూనే ఉంటాను. నేను తయారు చేసే మాస్క్‌లకు రెండు పొరలు ఉంటాయి. శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఎంతో సురక్షితమైనవి’ అంటారు దేవీలాల్‌. 

ఆయన రోజుకు 100 నుంచి 150 మాస్క్‌లు కుట్టి, తన దుకాణం ద్వారా పంపిణీ చేస్తున్నారు. తనకు తగినంత మెటీరియల్‌ దొరికితే నాలుగు, ఐదు లేయర్ల మాస్క్‌లు కూడా తయారు చేయాలనుకొంటున్నారు దేవీలాల్‌. ‘ఇలాంటి ఆపత్కాలంలో మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఐకమత్యంగా ఈ మహమ్మారిపై పోరాడాలి. ఎవరికి ఎప్పుడే అవసరం వచ్చినా సాయం అందించడానికి మా కుటుంబం సిద్ధంగా ఉంటుంది’ అంటున్న ఈ దర్జీ అంకితభావాన్ని చూసి జనం జేజేలు పలుకుతున్నారు. 

చుట్టూ ఉన్నవారి కోసం తన తండ్రి పడుతున్న శ్రమను ట్విట్టర్‌లో గొప్పగా చెప్పుకున్నాడు దేవీలాల్‌ తనయుడు పుఖ్రాజ్‌. ‘సాధ్యమైనన్ని మాస్క్‌లు అందించడానికి మా నాన్న రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారు. దుకాణం బంద్‌ ఉన్నా... ఆయన పరిశ్రమ ఆగడం లేదు’ అంటూ పుఖ్రాజ్‌ ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన నెటిజనులు దేవీలాల్‌ గొప్ప మనసుకు సెల్యూట్‌ కొడుతున్నారు. 






ఆపదలో అండగా!

‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’... ముంబయి డిప్యూటీ ఐటీ కమిషనర్‌ డాక్టర్‌ మేఘా భార్గవ నమ్మే సిద్ధాంతం ఇది. అందుకే కొవిడ్‌-19 దెబ్బకు పస్తులుంటున్న రోజు కూలీల కడుపు నింపుతున్నారీ ఐఆర్‌ఎస్‌ అధికారిణి.  


నెలకు సరిపడా తిండి... 

‘కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్నాయన్న వార్తలు వినగానే మొదట నా మదిలో మెదిలింది దినసరి కూలీలే. వీరి కుటుంబాల్లోని చాలామంది ఎలాంటి ఆదాయం లేకపోవడంతో ఎన్నో రోజులుగా ఆకలితో అల్లాడుతున్నారు. తిండి గింజలు కొనుక్కోవడానికి డబ్బు లేక పస్తులుంటు న్నారు. కూలీలతో మాట్లాడి... ఏమేం కావాలో తెలుసుకున్నాం. దానికి తగ్గట్టుగా నెలకు సరిపడా ఆహార కిట్లు తయారు చేశాం’ అని చెప్పారు మేఘా భార్గవ. బియ్యం, పప్పులు, నూనె, పంచదార, కూరగాయలు, మసాలా దినుసులు అందులో ఉంటాయి. వీటితోపాటు వైరస్‌ నుంచి రక్షించుకోవడానికి అవసరమైన మాస్క్‌లు, శానిటైజర్లు, సబ్బులతో మరో కిట్‌ కూడా అందిస్తున్నారు మేఘ. 


సోదరి.. సహచరుల సహకారం... 

మేఘా భార్గవకు సామాజిక సేవ కొత్తకాదు. రెండేళ్ల కిందటే ఆమె ఇందుకు శ్రీకారం చుట్టారు. దాని కోసం తన సోదరి డాక్టర్‌ రుమాతో కలిసి ‘సమర్పణ్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ఇప్పుడు ఆ సంస్థ ద్వారానే ఆమె ఆహార కిట్లు పంపిణీ చేస్తున్నారు. ముంబయ్‌లో వారు కొన్ని వందల కిట్లు అందించారు. మేఘా స్ఫూర్తితో ఆమె విభాగానికే చెందిన డిప్యూటీ కమిషనర్లు సురేశ్‌ కటారియా, ఆస్తా మాధుర్‌, ఇతర మెడికల్‌ ప్రాక్టిషనర్లు కూడా ముందుకు వచ్చారు. ఈ మహత్కార్యానికి ఆర్థిక సాయం అందిస్తూ, సరుకులు, హ్యాండ్‌ శానిటైజర్ల వంటివి సేకరించడంలో సహకరిస్తున్నారు. 


‘కార్పొరేషన్‌’తో కలిసి... 

అనుకున్న వారి ఇంటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కిట్లు చేరేలా మేఘా ప్రణాళికలు రూపొందించుకున్నారు. దాని కోసం ముంబయ్‌ పోలీస్‌, ‘మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబయ్‌’ (ఎంసీజీఎం)లతో కలిసి పనిచేస్తున్నారు. పోలీస్‌, మున్సిపల్‌ తదితర విభాగాల వారికి ఉచితంగా శానిటైజర్లు, మాస్క్‌లు అందిస్తున్నారు. ‘ఈ విపత్కర సమయంలో పోలీస్‌ విభాగం సేవలు నిరుపమానం. తమ కంటే ప్రజల రక్షణకే వారు ప్రాముఖ్యం ఇస్తున్నారు. అలాంటి వారికి నేను అందించే సహకారం చాలా చిన్నది’ అంటారు మేఘా భార్గవ. 

ఒక పక్క ఉద్యోగం... మరో పక్క సేవా దృక్పథం... డాక్టర్‌ మేఘా భార్గవను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ చేతనైన సాయం అందిస్తే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి దేశం బయటపడుతుంది.



సేవకు వేళాయె..! 

లాక్‌డౌన్‌ వేళ చాలామంది సమయాన్ని ఎలా గడపాలో ప్లాన్‌ చేసుకొంటున్నారు. కానీ కొందరు... ఈ అనూహ్య పరిణామంతో తిండి దొరక్క అలమటిస్తున్నవారి ఆకలి బాధలు చూస్తున్నారు. ఆ కొందరిలో ఒక్కరు సామాజిక కార్యకర్త యోగితా భయనా. నిత్యావసరాలు అందక జనం అవస్థలు పడుతున్న తరుణంలో... ఆమె ఉన్నదాంట్లోనే అభాగ్యుల కడుపు నింపుతున్నారు. ‘ఇక్కడ బ్రెడ్డు, టీ ఉన్నాయి. కావల్సినవారు నిస్సంకోచంగా అడగవచ్చు’ అని తన ఇంటి ముందు బోర్డు పెట్టి మరీ ఆదుకొంటున్నారు. 


యోగిత నివసించేది ఢిల్లీలో. ఆమె ఇంటి వద్ద రోడ్లపై ఎంతో మంది గూడులేనివారు జీవిస్తున్నారు. కరోనా కలకలంతో ఇల్లు దాటని పరిస్థితి. రాకపోకలు... దుకాణాలు బంద్‌. ఇలాంటి దుస్థితిలో ఏ దిక్కూ లేనివారికి అన్నం పానం ఎక్కడ దొరుకుతుంది! దీన్ని గమనించిన యోగిత ఆలోచనలో పడ్డారు. తనకు చేతనైన సాయం చేయాలనుకున్నారు. వెంటనే ఇలా బోర్డు పెట్టి... వచ్చిన వారికి బ్రెడ్‌, బిస్కెట్లు, టీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. దానివల్ల మరింత మంది స్ఫూర్తి పొంది... అభాగ్యులను ఆదుకొంటారనే ఆలోచన ఆమెది. 


‘రిక్షావాళ్లు, రోజు కూలీలు ఉదయం నుంచి మా ఇంటి ముందుకు వస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే వాళ్లందరికీ ఫుడ్‌ అందిస్తున్నాం. కనీసం రోజుకు ఒకరికి సరిపడా భోజనమన్నా అభాగ్యులకు అందించమని అందరినీ అభ్యర్థిస్తున్నా’ అంటూ యోగిత కోరుతున్నారు. 


ఇదే స్ఫూర్తితో మరికొంతమంది కూడా తమకు తోచిన సాయం చేస్తున్నారు. నోయిడాలో ఉండే రితికా కపూర్‌ బ్రెడ్‌, బిస్కెట్ల వంటివి వీధుల్లో ఉండేవారికి పంచుతున్నారు. వాళ్ల అపార్ట్‌మెంట్‌ ముందు నీళ్ల సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫుడ్‌ పాయింట్ల గురించి సమాచారం అందిస్తూ, అవరమైన వారందరినీ అక్కడకు పంపిస్తున్నారు రంజిత్‌ పూనియా. 

ఇక ‘ఆకలి మనుషులకేనా? మరి వీధుల్లో తిరిగే మూగజీవాలకు ఉండదా’ అంటూ వాటి కడుపు నింపుతున్నారు రెక్సోనా వాడియా. వాళ్ల ఇంటి ముందు వీధి కుక్కల కోసం పాలు, నీళ్లు పెడుతున్నారు. ఇది చూసి రెక్సోనా చుట్టుపక్కలవారు కూడా మూగజీవాలకు అన్నం పెడుతున్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందుతూ తమలోని పెద్ద మనసును చాటుతున్నారు. 


Updated Date - 2020-04-15T06:03:58+05:30 IST