ప్రపంచ తెరపై ‘షీ’రోస్‌!!

ABN , First Publish Date - 2020-03-08T06:14:12+05:30 IST

సూపర్‌ మేన్‌, స్పైడర్‌ మేన్‌, ఐరన్‌ మేన్‌, బ్యాట్‌ మేన్‌... హాలీవుడ్‌ సూపర్‌ హీరోలందరూ మగాళ్లే! సూపర్‌ హీరోస్‌ చిత్రాల్లో ఏలుబడి వాళ్లదే!! మరి, ఆ మగాళ్లకు జన్మనిచ్చిన మహిళల సంగతేంటి? నిన్న మొన్నటి వరకూ వెండితెరపై తగు...

ప్రపంచ తెరపై ‘షీ’రోస్‌!!

హీరో అంటే? తెలుసు! మరి, ‘షీ’రో అంటే... ‘షి’+హీరో = ‘షీ’రో!!

ధైర్య సాహసాలతో ఘనత సాధించిన మహిళలను ‘షీ’రోస్‌ అంటారు!!!

ప్రపంచ వెండితెరపై క్రమక్రమంగా ‘షీ’రోస్‌ సంఖ్య పెరుగుతోంది!

‘షీ’రోస్‌ను... తెరపై ఆవిష్కరించడానికి దర్శక-నిర్మాతలు,

తనివితీరా చూసి ఆనందించడానికి ప్రేక్షకులు ‘జై’ కొడుతున్నారు!!


సూపర్‌ మేన్‌, స్పైడర్‌ మేన్‌, ఐరన్‌ మేన్‌, బ్యాట్‌ మేన్‌... హాలీవుడ్‌ సూపర్‌ హీరోలందరూ మగాళ్లే! సూపర్‌ హీరోస్‌ చిత్రాల్లో ఏలుబడి వాళ్లదే!! మరి, ఆ మగాళ్లకు జన్మనిచ్చిన మహిళల సంగతేంటి? నిన్న మొన్నటి వరకూ వెండితెరపై తగు ప్రాధాన్యం లభించలేదు. అడపాదడపా లభించినా... అంతగా విజయాలు సాధించలేదు. బట్‌, ఫర్‌ ఏ ఛేంజ్‌... ఈమధ్య మార్పు వచ్చింది. సూపర్‌ హీరోస్‌ సినిమాల్లో ఫిమేల్‌ హీరోస్‌కి సరైన రీతిలో ప్రాధాన్యం లభిస్తోంది. సారీ... సారీ... ‘షీ’రోస్‌ చిత్రాలు వస్తున్నాయి. విజయాలు సాధిస్తున్నాయి. స్త్రీ శక్తి సత్తా చాటుతున్నాయి. సూపర్‌ హీరోస్‌ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కామిక్‌ పుస్తకాల ఆధారంగా ఊహాజనిత పాత్రలతో అసాధారణ శక్తులున్న మహిళల గాథలు కొంతకాలంగా వెండితెరపైకి వస్తున్నాయి.


‘షీ’రోస్‌ ఇప్పటి ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది... ‘వండర్‌ ఉమన్‌’, ‘కెప్టెన్‌ మార్వెల్‌’! ఎందుకంటే... ఈ చిత్రాలు సాధించిన విజయాలు అటువంటివి. కానీ, ‘షీ’రోస్‌ ట్రెండ్‌ ఈ రెండు చిత్రాలతో ప్రారంభం కాలేదు. అంతకు ముందు ఎప్పుడో మొదలైంది. కానీ, పేరొచ్చింది మాత్రం ఇప్పుడే!! 1984లో ‘సూపర్‌ గాళ్‌’ అని ఒక సినిమా వచ్చింది. 1995లో ‘టాంక్‌ గాళ్‌’ అని మరో సినిమా వచ్చింది. మార్వెల్‌ కామిక్స్‌ నుండి 2005లో ‘ఎలెకా్ట్ర’ అని ఓ సినిమా వచ్చింది. అంతకు ముందు 2004లో హాలే బెర్రీ ‘క్యాట్‌ విమెన్‌’ సినిమా చేశారు. అయితే... అవేవీ భారీ విజయాలు సాధించలేదు. ‘వండర్‌ ఉమన్‌’, ‘కెప్టెన్‌ మార్వెల్‌’ చిత్రాలతో ‘షీ’రోస్‌ ట్రెండ్‌ ఊపందుకుంది.


కెమేరా వెనుక... ‘షీ’రోస్‌!

తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ తేడాల్లేవ్‌! ఏదైనా పురుషాధిక్య పరిశ్రమే!! దర్శకుల్లోనూ మహిళల కన్నా పురుషులే ఎక్కువ. సూపర్‌ హీరోస్‌ చిత్రాలకు దర్శకత్వం వహించేదీ పురుషులే! అయితే... ‘షీ’రోస్‌ చిత్రాలకు మహిళలు దర్శకత్వం వహిస్తుండడం విశేషమే కదూ!! మీకు తెలుసా? ఈ ఏడాది ఫిబ్రవరి 7న విడుదలైన ‘షీ’రోస్‌ చిత్రం ‘బర్డ్స్‌ ఆఫ్‌ ప్రే’కి దర్శకత్వం వహించినది జన్మతః చైనీయురాలైన అమెరికన్‌ దర్శకురాలు క్యాతీ యన్‌. ఈ నెల 27న విడుదల కానున్న మరో ‘షీ’రోస్‌ చిత్రం ‘ములాన్‌’ వెనుకున్నది న్యూజీలాండ్‌లో పుట్టి పెరిగిన దర్శకురాలు నికీ కారో. ఈ ఏడాది మే 1న విడుదల కానున్న ‘బ్లాక్‌ విడో’కి ఆస్ట్రేలియన్‌ కేట్‌ షార్ట్‌లాండ్‌ దర్శకురాలు. జూన్‌ 5న రానున్న ‘వండర్‌ ఉమెన్‌ 1984’కి ప్యాటీ జంకిన్స్‌, నవంబర్‌ 6న వస్తున్న ‘ది ఎటర్నల్స్‌’కి జన్మతః చైనీయురాలు క్లోయీ జావ్‌ దర్శకత్వం వహించారు. వివిధ దేశాలకు చెందిన దర్శకురాళ్లు వస్తుండడం శుభ సూచకం! అయితే... దర్శకుల్లో స్త్రీ-పురుష వ్యత్యాసం ఎక్కువ. మరింతమంది దర్శకురాళ్లు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


డీసీ వర్సెస్‌ మార్వెల్‌!

సూపర్‌ హీరోస్‌ చిత్రాల్లో నిర్మాణ సంస్థలు డీసీ యూనివర్స్‌(డీసీయు), మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఎంసీయు) మధ్యే పోటీ. ‘సూపర్‌ మేన్‌’, ‘బ్యాట్‌ మేన్‌’ వంటివి డీసీయు నుండి వస్తే... ‘అవెంజర్స్‌’ సిరీస్‌, ‘ఐరన్‌ మేన్‌’ వంటివి ఎంసీయు నుండి వచ్చింది. ఇప్పుడీ సంస్థలు ‘షీ’రోస్‌ చిత్రాలు తీయడంలోనూ పోటీ పడుతున్నాయి. ‘వండర్‌ ఉమెన్‌’, ‘సూసైడ్‌ స్క్వాడ్‌’, ‘బర్డ్స్‌ ఆఫ్‌ ప్రే’ డీసీయు చిత్రాలైతే... ‘కెప్టెన్‌ మార్వెల్‌’, ‘బ్లాక్‌ విడో’ ఎంసీయు చిత్రాలు! ‘ములాన్‌’ డిస్నీ చిత్రం.


వదంతులు నిజమవుతాయా?

‘కిక్‌-యాస్‌’ (2010)లో హిట్‌ గాళ్‌ క్యారెక్టర్‌ హిట్టు. ఆ పాత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారట! ‘బ్యాట్‌ మేన్‌’, ‘ఐరన్‌ మేన్‌’ తరహాలో ‘బ్యాట్‌ గాళ్‌’, ‘ఐరన్‌ గాళ్‌’, ‘అవెంజర్స్‌’లో ఎలిజబెత్‌ పోషించిన వండా మ్యాగ్జిమ్‌ఆఫ్‌  పాత్ర ఆధారంగా చిత్రాలు రూపొందించడానికి నిర్మాణ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయని సమాచారం. అవి ఎప్పుడు నిజమవుతాయో? చూడాలి.

Updated Date - 2020-03-08T06:14:12+05:30 IST