ఆయన్ని ఎలా భరించాలి?

ABN , First Publish Date - 2020-06-04T05:30:00+05:30 IST

నాకు 2005లో వివాహం అయింది. మాది అయిదేళ్ల ప్రేమ. కులాలు వేరు. నా భర్త ఏడో తరగతి వరకే చదివాడు. నేను డిగ్రీ పూర్తి చేశాను. పెళ్లి సమయానికే ఆయన పని సరిగ్గా చేయడనీ, అనుమానం ఎక్కువ అనీ తెలుసుకున్నాను...

ఆయన్ని ఎలా భరించాలి?

నాకు 2005లో వివాహం అయింది. మాది అయిదేళ్ల ప్రేమ. కులాలు వేరు. నా భర్త ఏడో తరగతి వరకే చదివాడు. నేను డిగ్రీ పూర్తి చేశాను. పెళ్లి సమయానికే ఆయన పని సరిగ్గా చేయడనీ, అనుమానం ఎక్కువ అనీ తెలుసుకున్నాను. నన్ను ఉద్యోగం చెయ్యవద్దనీ, ఉన్నత చదువులు చదవొద్దనీ చెప్పాడు. మారతాడనే నమ్మకంతో పెళ్లి చేసుకున్నాను. కానీ అతను పెళ్ళి తర్వాత కూడా ఏ పనీ సరిగ్గా చేయలేదు. అన్నిటికీ ఆంక్షలే! మంచి దుస్తులు వేసుకోకూడదు. మా బంధువులు నాతో చనువుగా మాట్లాడినా అనుమానిస్తాడు. ఇంట్లో అందరి ముందు నన్ను బాధపెడతాడు. బైక్‌ మీద వెళుతుంటే నేను తల దించుకొనే ఉండాలి. నేను మా పల్లెలోనే అంగన్‌వాడీ టీచర్‌గా చేస్తున్నాను. వృత్తి రీత్యా సమావేశాలకు వెళ్ళినా, నా సహోద్యోగులు నాకు ఫోన్‌ చేసినా చాలా తిట్టేవాడు. ఈ బాధలు పడలేక చనిపోవాలని అనిపించింది. ఆ సమయంలోనే సైకాలజిస్ట్‌ దగ్గరకు వెళ్లాం. ఆయన మా ఇద్దరికీ కౌన్సెలింగ్‌ చేశారు. నన్ను మాత్రలు వాడమన్నారు. ఆ తర్వాత నేను ‘గ్రూప్‌-2’ కోచింగ్‌కు వెళతానని గట్టిగా అడిగితే ఆరు నెలలు పంపించాడు. ఆ తరువాత ఆయన తీరు ఇంకా దారుణంగా మారింది. ‘‘యాభై వేలు ఖర్చుపెట్టావ్‌! అది తీసుకొచ్చి మాట్లాడు’’ అనేవాడు. అలా నేను బాధపడుతున్న సమయంలో నాకు మొబైల్‌ ద్వారా ఒక వ్యక్తితో పరిచయం అయింది. అతను నాకు ధైర్యం చెప్పేవాడు. అతను పంపిన మెసేజ్‌లు చూసి, మా ఆయన ఒకసారి బాగా కొట్టాడు. మరోసారి కూడా అతడి మెసేజ్‌లు చూశాడు. మళ్ళీ కొడతాడనే భయంతో ఉరి వేసుకున్నాను. ఆ సమయంలో మా పాప చూడడంతో బతికాను. అప్పటి నుంచి ఆ తరువాత నేనేం చెయ్యకపోయినా కొట్టడం మొదలుపెట్టాడు. ‘‘నువ్వు చేసినదానికి చంపినా తప్పులేదు’’ అంటున్నాడు. ‘నేను చేసిన తప్పుకే కదా ఇవన్నీ!’ అనుకొని నేను భరిస్తూ వచ్చాను. మా పుట్టింటి వాళ్ళు కూడా పరువు పోతుందని అతణ్ణి గట్టిగా అడగలేకపోతున్నారు. ఎప్పుడూ నా మొబైల్‌ చెక్‌ చేస్తూ ఉంటాడు. గత తొమ్మిది నెలలుగా ఎన్నో సార్లు కొట్టాడు. ఎప్పుడూ ఆస్పత్రికి తీసుకువెళ్ళలేదు. నాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయికి పధ్నాలుగేళ్ళు, మా అమ్మాయికి పదేళ్ళు. ఆయన పెట్టే బాధలన్నీ వాళ్ళ కోసమే భరిస్తున్నాను. పిల్లల ముందు నన్ను కొట్టడం, తిట్టడం చేయడంతో వాళ్ళు భయపడిపోతున్నారు. ఈ ఆందోళన, ఒత్తిడిని తట్టులేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపండి

- శివాని


మీ పరిస్థితి దయనీయం,  బాధాకరం కూడా! ‘ప్రేమ గుడ్డిది’ అనే మాట నిజం చేశారు. పెళ్ళికి ముందే అతని గురించి తెలిసినా తేలికగా తీసుకున్నారు. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? పోనీ పెళ్ళయిన కొద్దికాలానికైనా విడిపోయే ప్రయత్నం చేసి ఉండాల్సింది. బహుశా పిల్లల గురించి ఆలోచించి ఉంటారు. మీ వల్ల కూడా పొరపాటు జరిగి ఉండవచ్చు. కానీ దానికి ఇన్నేళ్ళుగా మూల్యం చెల్లించనక్కరలేదేమో! ఈ మొత్తం వ్యవహారంలో మీ అత్తవారింటి సభ్యుల ప్రస్తావన లేదు. మీ పుట్టింటివారికి మీ మీద సానుభూతి ఉన్నా చెప్పలేకపోతున్నారు. ఏది ఏమైనా అతను మిమ్మల్ని కొట్టడం తప్పు. ఇందుకు అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు కాబట్టి వారిని తీసుకొని, విడిగా ఉండండి. మీ భర్త ఆగడాల్ని భరించకండి. చదువు, ఉద్యోగం ఇచ్చే భరోసాతో ధైర్యంగా ముందడుగు వేయండి. దానికి మీ భర్త అడ్డుపడితే చట్టప్రకారం చర్యలు తీసుకోండి.

-కె.శోభ, ఫ్యామిలీ కౌన్సెలర్‌, ‘హార్ట్‌ టు హార్ట్‌’, shobhas292@gmail.com


Updated Date - 2020-06-04T05:30:00+05:30 IST