-
-
Home » Navya » Family Counseling » fertility counsellin for men
-
ఆయనలో ఈ మార్పు ఎందుకు?
ABN , First Publish Date - 2020-06-23T05:30:00+05:30 IST
డాక్టర్! మాకు పెళ్లై మూడేళ్లు. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. దానిలో భాగంగా గత ఫిబ్రవరిలో మా వారికి వీర్య పరీక్ష చేయిస్తే, వీర్యకణాలు సరిపడా 15 మిలియన్ల వరకూ ఉన్నాయని తేలింది...

డాక్టర్! మాకు పెళ్లై మూడేళ్లు. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. దానిలో భాగంగా గత ఫిబ్రవరిలో మా వారికి వీర్య పరీక్ష చేయిస్తే, వీర్యకణాలు సరిపడా 15 మిలియన్ల వరకూ ఉన్నాయని తేలింది. కానీ కొన్ని రోజుల క్రితం రెండోసారి వీర్యపరీక్ష చేయించినప్పుడు, రెండు మిలియన్లకు వీర్యకణాల సంఖ్య పడిపోయినట్టు తేలింది. ఇంతలా వీర్యకణాల సంఖ్య ఎందుకు తగ్గింది? అయితే మార్చిలో మా వారికి జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలు కనిపించి, వాటంతట అవే తగ్గిపోయాయి. వీర్యకణాల తగ్గుదలకూ, కరోనా ఇన్‌ఫెక్షన్‌కూ సంబంధం ఉందా?
- ఓ సోదరి, ఖమ్మం.
మీ అనుమానంలో నిజం లేకపోలేదు. అయితే ఈమధ్య కాలంలో వీర్యకణాల సంఖ్య తగ్గుదల సమస్య పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కరోనా వ్యాధి ప్రబలిన ప్రారంభంలో వీర్యకణాల మీద కరోనా వైరస్ ప్రభావం గురించి చైనాలో పలు అధ్యయనాలు చేశారు. అయితే కరోనా లక్షణాలు బయల్పడని వారిలో, ఈ వైరస్ వృషణాల మీద ప్రభావం చూపించదని తేల్చారు. అయితే ఆ తర్వాత బయల్పడిన కొన్ని కేసులను పరిశీలించిన తర్వాత, కరోనా వైరస్ ఇతరత్రా లక్షణాల ద్వారా బయల్పడకపోయినా, దాని ప్రభావం ఎంతో కొంత వృషణాల మీద ఉండే వీలు ఉందని పరిశోధకులు నిర్థారణకు వచ్చారు. వెరసి, కరోనా వైరస్ ప్రభావంతో వీర్యకణాల సంఖ్య తగ్గే విషయం నూటికి నూరు శాతం ధృవీకరించలేకపోయినా, ఈ అంశాన్ని పూర్తిగా మాత్రం కొట్టిపారేయలేం. అలాగే లాక్‌డౌన్ కారణంగా, ఇంటికే పరిమితం కావడం వల్ల పురుషుల్లో హార్మోన్ లోపాలు, ‘డి’ విటమిన్ లోపం కూడా తలెత్తుతాయి. తగినంత శారీరక వ్యాయామం లోపించినా వీర్యకణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కాబట్టి విటమిన్ సప్లిమెంట్లు వాడుతూ, వీర్యకణాల వృద్ధికి మందులు కూడా వాడవలసి ఉంటుంది. చికిత్సతో మీ వారి సమస్య పూర్తిగా మెరుగవుతుంది. కాబట్టి కంగారు పడకుండా చికిత్స ఇప్పించండి.
-డాక్టర్ రాహుల్ రెడ్డి,
ఆండ్రాలజిస్ట్, జూబ్లీహిల్స్, హైదరాబాద్.
8332850090 (కన్సల్టేషన్ కోసం)