ఎక్మోతో ప్రాణ రక్ష!

ABN , First Publish Date - 2020-09-01T05:30:00+05:30 IST

కరోనా బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కొనసాగుతున్న చికిత్సలో ఓ ఆరోగ్య పరికరం కీలకంగా మారింది. అదే.... ఎక్మో! తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత చికిత్సా సమయంలో ఎక్కువగా వినిపించిన ఆరోగ్య పరికరం పేరు కూడా ఇదే! ఈ ప్రాణరక్షణ పరికరం ఎక్మో ఎందుకు?...

ఎక్మోతో ప్రాణ రక్ష!

కరోనా బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కొనసాగుతున్న చికిత్సలో ఓ ఆరోగ్య పరికరం కీలకంగా మారింది. అదే.... ఎక్మో! తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత చికిత్సా సమయంలో ఎక్కువగా వినిపించిన ఆరోగ్య పరికరం పేరు కూడా ఇదే! ఈ ప్రాణరక్షణ పరికరం ఎక్మో ఎందుకు? ఏ సందర్భంలో అక్కరకొస్తుందో తెలుసుకుందాం!


ఎక్మో ఎప్పుడు?

శస్త్రచికిత్స చేసే సమయంలో లేదా ఇతర వ్యాధులతో బాధపడుతూ గుండె, ఊపిరితిత్తులు పనిచేయని వారికి ‘ఎక్మో’ అక్కరకొస్తుంది. ఈ రెండు ప్రధాన అవయవాల బాధ్యతను ఎక్మో పరికరం తలకెత్తుకుని ప్రాణాలను నిలబెడుతుంది. న్యుమోనియా, ఊపిరితిత్తుల కేన్సర్‌, సీపీఓడీ మొదలైన రుగ్మతలతో రోగి తనంతట తాను స్వయంగా శ్వాస తీసుకోలేని సందర్భంలో ఎక్మో పరికరం ఉపయోగపడుతుంది. అలాగే గుండె కవాటాలు దెబ్బతిని, గుండె పనిచేయని స్థితిలో కూడా ఇదే పరికరం తోడ్పడుతుంది. ఈ సమయాల్లో పరికరాన్ని అమర్చి, చికిత్స కొనసాగిస్తారు.


ఎక్మోతో దుష్ప్రభావాలు?

ఈ పరికరానికి సంబంధించిన కేథటర్లు అమర్చడం వల్ల కొంతమేరకు రక్తస్రావం జరిగే వీలుంది. దీనికి ఇన్‌ఫెక్షన్లూ తోడవ్వచ్చు. పెద్ద కేథటర్లతో రక్తం గడ్డకట్టే వీలు ఉంటుంది కాబట్టి రక్తం పలుచనచేసే మందులు వాడవలసి ఉంటుంది. ఇలా పలుచనైన రక్తం మరింత తేలికగా కారిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఎక్మో కారణంగా శరీరంలోని కొన్ని అవయవాలకు రక్తప్రసారం జరగకపోవచ్చు. ఫలితంగా ఎలాంటి నష్టం జరగకుండా, శరీరంలోని వేర్వేరు ప్రాంతాల్లోని ఆక్సిజన్‌ శాతాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ చికిత్స కొనసాగుతుంది.


వెంటిలేటర్‌ - ఎక్మో!

ఈ రెండు పరికరాలూ శ్వాసకోశాలు పనిచేయని సమయంలో అక్కరకొచ్చేవే! ఊపిరితిత్తుల్లోకి గాలిని బలంగా పంపించడానికి వెంటిలేటర్‌ ఉపయోగపడితే, కేథటర్‌ ద్వారా నేరుగా శరీరానికే ఆక్సిజన్‌ను 

అందించడానికి ఎక్మో తోడ్పడుతుంది. వెంటిలేటర్‌కు కూడా ఊపిరితిత్తులు సహకరించని సమయంలో ఎక్మో ఉపయోగపడుతుంది. 




ఈ వ్యాధుల్లో....

  1. ఉబ్బసం అదుపుతప్పి, తీవ్రమైనప్పుడు
  2. గుండె మార్పిడి సమయంలో
  3. విషవాయువుల బారిన పడ్డప్పుడు
  4. కార్డియోమయోపతీలో
  5. మయోకార్డైటి్‌సలో
  6. గుండెలో లోపాలతో పుట్టిన పసికందులకు
  7. న్యుమోనియా తీవ్రమైనప్పుడు



- డాక్టర్‌ సత్య శ్రీధర్‌ కాలే

సీనియర్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్‌,

యశోద హాస్పిటల్స్‌, 

సోమాజిగూడ, హైదరాబాద్‌.


Updated Date - 2020-09-01T05:30:00+05:30 IST