వేలం డబ్బులు విరాళంగా..!
ABN , First Publish Date - 2020-05-18T06:50:56+05:30 IST
ఆ యువకుడు పాత నాణేలు ఎన్నింటినో సేకరించాడు. వాటి విలువ ఇప్పుడు కోట్లు పలుకుతుంది. అయితేనేం... ఆ నాణేలను కరోనాపై పోరు కోసం వేలంలో పెట్టాడు. ఒడిశాకు చెందిన దేవీప్రసాద్ మంగరాజ్ తన దగ్గర ఉన్న విలువైన పాత నాణేలను...

ఆ యువకుడు పాత నాణేలు ఎన్నింటినో సేకరించాడు. వాటి విలువ ఇప్పుడు కోట్లు పలుకుతుంది. అయితేనేం... ఆ నాణేలను కరోనాపై పోరు కోసం వేలంలో పెట్టాడు. ఒడిశాకు చెందిన దేవీప్రసాద్ మంగరాజ్ తన దగ్గర ఉన్న విలువైన పాత నాణేలను వేలం వేసి ఆ డబ్బులను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా అందించనున్నాడు.
పాత నాణేలు అంటే కాలం చెల్లినవని అనుకుంటాం... కానీ ఆ నాణేలకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఒకపైసా, రెండు పైసలు, ఐదు పైసల నాణేలు ఇప్పుడు అరుదైన సంపద. ఒడిశాకు చెందిన 28 ఏళ్ల దేవీప్రసాద్ మంగరాజ్‌కు అలాంటి అరుదైన నాణేలను సేకరించే అలవాటు ఉంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తున్న దేవీప్రసాద్‌కు ఐదేళ్ల వయసు నుంచే నాణేల సేకరణ హాబీగా మారింది. తాత ధరానిధార్ మంగరాజ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 15 అరుదైన నాణేలను అతనికి ఇచ్చారు. అలా ప్రారంభమైన నాణేల సేకరణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దే వీ ప్రసాద్ అనేక ప్రాంతాలు తిరిగి, శతాబ్దాల క్రితం నాటి నాణేలను సేకరించాడు. ఆయన దగ్గర మొత్తం 8 లక్షల నాణేలు ఉంటే అందులో 2 లక్షల దాకా అరుదైన నాణేల నిధి ఉంది. వాటిలో కొన్ని నాణేలను డబ్బులు చెల్లించి కొనుగోలు చేశాడు. మరికొన్ని మార్పిడి ద్వారా తీసుకున్నాడు. వీటిలో రాగి, వెండి, బంగారం లాంటి లోహాలతో చేసిన నాణేలూ ఉన్నాయి. ఈస్ట్‌ఇండియా కంపెనీ, మౌర్యులు, కుషానులు, మొఘలుల కాలం నాటి నాణేలు ఉన్నాయి. రెండో శతాబ్దం, ఆరో శతాబ్దం మధ్యకాలం నాటి పంచ్‌మార్క్‌డ్ నాణేలు కూడా ఉన్నాయి. జర్మన్ నియంత హిట్లర్ జారీ చేసిన నాణెం సైతం దేవీప్రసాద్ దగ్గర ఉంది. 2300 ఏళ్ల క్రితం నాటి నాణెం దేవీప్రసాద్ దగ్గరున్న నాణేల్లో అతి పురాతనమైనది.
సహాయనిధికి అందివ్వాలని...
కరోనా వైర్‌సతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి మనసు చలించిన ప్రసాద్ ఆ అరుదైన నాణేలను వేలానికి పెట్టారు. వేలంలో వచ్చిన డబ్బును ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహాయనిధికి ఇచ్చి కరోనా పోరాటంలో దేశానికి సాయపడాలనేది ఆయన ఆలోచన. ఇవి అరుదైన నాణేలు కావడం వల్ల కోట్ల రూపాయల డబ్బు వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు.
‘‘గతంలో ఇండియాలో, విదేశాలకు చెందిన కొంతమంది నాణేలు సేకరించే వాళ్లు నన్ను కొన్ని నాణేలను అమ్మమని అడిగారు. ఈస్ట్ ఇండియా కంపెనీ నాణేనికి కోటిన్నర ఇస్తానన్నారు. కానీ అప్పుడు వాటిని అమ్మడానికి నేను ఇష్టపడలేదు. ఇప్పుడు కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అది నన్ను బాధిస్తోంది. సమాజానికి నా వంతుగా సాయం చేయాలనుకున్నాను. అందుకే ఇప్పుడు నాణేలను వేలం వేస్తున్నాను’’ అని దేవీప్రసాద్ అంటున్నారు. అతని ఆలోచనను అందరూ అభినందిస్తున్నారు.
