ఆయన ఇక మారడా?

ABN , First Publish Date - 2020-03-12T06:16:16+05:30 IST

తొమ్మిదేళ్లుగా నరకం చూస్తూ కూడా మారతాడనే ఆశతో కాపురం చేస్తున్న మీకే బాగా తెలియాలి... అతను మారతాడో, లేదో! హాస్టల్‌ ఉండి చదువుకుంటే ఇలా ఉంటారని చెప్పలేం. అయితే అప్పట్లో....

ఆయన ఇక మారడా?

నాకు పెళ్లయి తొమ్మిది సంవత్సరాలయింది. మాకు ఇద్దరు మగ పిల్లలు. నా భర్త విదేశంలో మంచి ఉద్యోగంలో ఉన్నారు. నేను, నా పిల్లలు, అత్తగారు ఇక్కడే ఉంటాం. అయితే మా వారికి నా మీద విపరీతమైన అనుమానం. ప్రతి నిమిషానికి వీడియో కాల్‌ చేసి నన్ను ఇబ్బంది పెడతారు. ఫంక్షన్‌లో ఉన్నా వీడియో కాల్‌ చేస్తుంటారు. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోతే ‘‘ఎక్కడ ఉన్నావ్‌, ఎవరితో ఉన్నావ్‌’’ అని వేధిస్తారు. ఇదంతా నేను భరించలేక పోతున్నాను. బంధువులలో పరువు పోతోంది. ఎన్నో సార్లు పంచాయతీ పెట్టి పెద్దవాళ్లతో చెప్పించినా ఆయనలో మార్పు లేదు. ఆయన చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. ఆ కారణం వల్లనో, మరి ఏ కారణం వల్లనో ఇలా అయ్యారు. ఈ మధ్య ఆయన మరీ ఘోరంగా తయారయ్యారు. బస్సులో నా వంక ఎవరైనా చూసినా కూడా ‘‘అతనికీ, నీకూ సంబంధం ఏమిటి?’’ అని అడుగుతున్నారు. జీవితంలో సుఖం లేకుండా పోతోంది. ఆయన ఇక మారడా? నా సమస్యకు పరిష్కారం ఉందా?

- ఎస్‌.ఎస్‌.


తొమ్మిదేళ్లుగా నరకం చూస్తూ కూడా మారతాడనే ఆశతో కాపురం చేస్తున్న మీకే బాగా తెలియాలి... అతను మారతాడో, లేదో! హాస్టల్లో ఉండి చదువుకుంటే ఇలా ఉంటారని చెప్పలేం. అయితే అప్పట్లో అతనిపై ప్రభావం చూపిన సంఘటన ఏదన్నా జరిగిందేమో? దానివల్ల ఇటువంటి అభద్రతా భావం మొలకెత్తిందేమో? ఆ సంగతి వివరంగా అడిగి తెలుసుకోవాలి. అటువంటిది ఏమైనా ఉంటే సైకియాట్రిస్ట్‌ను కలిస్తే మంచిది. పంచాయతీలతో, సిఫార్సులతో కాపురాలు నిలబడవు. సమస్య ఎక్కడుందో తెలుసుకుని పరిష్కారం చూడాలి. అస్తమానం వీడియో కాల్‌ చేసి విసిగిస్తున్నాడంటే అభద్రతాభావం పెద్ద వృక్షమై కూర్చుందన్నమాట. ఇటువంటి స్వభావం ఉన్నవారు మాటలతో, సలహాలతో కన్నా చికిత్స, కౌన్సెలింగ్‌తోనే మారే అవకాశం ఉంది. ఆయనకు కుటుంబ జీవితం కావాలని అనుకుంటే నిపుణుల వద్దకు రావాల్సిందేనని స్పష్టం చేయండి.

  • - కె.శోభ, ఫ్యామిలీ కౌన్సెలర్‌, హార్ట్‌ టు హార్ట్‌ 
  • shobhas292@gmail.com

Updated Date - 2020-03-12T06:16:16+05:30 IST