వాళ్లను కాపాడుకోవడానికే...

ABN , First Publish Date - 2020-04-28T05:30:00+05:30 IST

ఈ కరోనా కాలంలో పిపిఇ కిట్ల లోటును వైద్య సిబ్బంది బాగా ఎదుర్కొంటున్నారు. ఆ లోటు తీర్చేందుకు తన వంతుగా గుంటూరుకు చెందిన డాక్టర్‌ ఆళ్ల ప్రశాంతి పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌ (పిపిఇ)ను డిజైన్...

వాళ్లను కాపాడుకోవడానికే...

ఈ కరోనా కాలంలో  పిపిఇ కిట్ల లోటును వైద్య సిబ్బంది బాగా ఎదుర్కొంటున్నారు. ఆ లోటు తీర్చేందుకు తన వంతుగా గుంటూరుకు చెందిన డాక్టర్‌ ఆళ్ల ప్రశాంతి పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌ (పిపిఇ)ను డిజైన్‌ చేశారు. దాంతోపాటు వాటి తయారీ పనికి కూడా పూనుకున్నారు. ఆసుపత్రుల్లో కరోనా పేషంట్లకు సేవలు చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి వాటిని అందిస్తున్నారు. ఆ పిపిఇ కిట్ల విశేషాల గురించి డాక్టర్‌ ప్రశాంతి మాటల్లో...


‘‘మా ఊరు గుంటూరులోని  మెడికల్‌ కాలేజీలో ఎంబిబిఎస్‌ చేశా. చెన్నై రామచంద్ర మెడికల్‌ కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసెన్‌లో పిజీ చేశా. తర్వాత గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఎనస్థీషియాలజీలో పిజీ పూర్తిచేశాను. 


పెరుగుతున్నాయి...

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఇది   మరింత తీవ్రతరం కాకుండా కరోనా పేషంట్లకు వైద్య సేవలు అందిస్తున్న  వైద్య సిబ్బంది కోసం ఏదైనా చేయాలనిపించింది. ఎందరో వైద్యులు, నర్సులు కరోనా పేషంట్లకు చికిత్సనందిస్తూ తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు.  

  ఇలాంటి విపత్తు సమయంలో కరోనా ఎమర్జ్జెన్సీ కేసులు చూసే వైద్యులు, నర్సులు, ఆయమ్మలను మొదట కాపాడుకోవాలి. వైద్యులను కాపాడుకుంటేనే కదా పేషంట్ల ప్రాణాలు నిలబడతాయి.  కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే సర్జికల్‌ దుస్తులు, శానిటైజర్స్‌, పిపిఇ గౌన్లు, కళ్లద్దాలు, ఫేస్‌ షీల్డులు- ఇవేమీ వీరికి లోకల్‌గా అందుబాటులో లేవు. అందుకే వీటిని వైద్యులకు అందుబాటులోకి తీసుకొచ్చా.


వైద్యసిబ్బంది కోసం...

ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఎనస్థీషియాలజీ రెండు మాస్టర్స్‌ డిగ్రీలు చేశానని చెప్పా కదా! ఆరోగ్య విపత్తు (హెల్త్‌ డిజాస్టర్‌) తలెత్తినపుడు డిజాస్టర్‌ సంసిద్ధత, నిర్వహణలకు సంబంధించిన అవగాహనకు ఇవి బాగా పనికివస్తాయి .ఒకవైపు  కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు  వైద్యులకు కావలసిన మెటీరియల్‌  సంసిద్ధంగాలేని స్థితి. పిపిఇలతో పాటు కరోనా నియంత్రణకు లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలు   అవసరం. మెడికల్‌ బృందాలకు  మెటీరియల్‌ పరంగా ఏవి  అందించాలన్నదానిపై స్టడీ చేశా. మాస్కులు   గౌను, షూ కవర్స్‌ వంటి వాటిని తయారు చేసేందుకు కావలసిన మెటీరియల్‌ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకున్నా. 


పిపిఇ కిట్లను విదేశాల నుంచి దిగుమతి  చేసు కోకుం డా సొంతంగా పిపిఇ కిట్స్‌ రూపొందించాలనుకున్నా. కరోనా విజృంభణతో పిపిఇ కిట్స్‌ డిమాండ్‌  పెరుగుతోంది. ఈ కిట్స్‌లో  ఎక్కువ పొరలున్న మాస్కులు, నాన్‌-ఒవెన్‌ డిస్పోసబుల్‌ కిట్‌ బ్యాగు, కళ్లను సంరక్షించే హెడ్‌గెయర్‌, గ్లోవ్స్‌  ఉంటాయి. పిపిఇ కిట్‌లో ఉండే వీటిని సొంతంగా డిజైన్‌ చేసి ప్రొడక్షన్‌ ప్రారంభించా. మొదట క్లాత్‌  మీద నేను రూపొందించిన పిపిఇ కిట్‌ ఉత్పత్తుల డిజైన్స్‌ను కట్‌ చేసి వాటితో మహిళా వర్కర్లకు శిక్షణ నిచ్చా.  


కాపాడుకోవాలి...

బయోడిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ షీట్స్‌తో లెగ్గిన్స్‌ చేశాం. ఇంకొకటి ఒహెచ్‌పి షీట్‌తో చేసిన ఫేస్‌ షీల్డ్‌ సర్జికల్‌  మాస్క్‌ (ట్రాన్స్‌పరెంట్‌). హెడ్‌కవర్‌గా హుడ్‌, రెయిన్‌కోట్‌ మెటీరియల్‌తో  ప్రొటెక్టివ్‌ గౌన్స్‌ చేస్తాం. ఇది రీయూజబుల్‌. 80-90 జిఎ్‌సఎం (నాన్‌ వొవెన్‌ మెటీరియల్‌) పిపిఇ గౌను  చేస్తున్నాం. అమ్మేటప్పుడే పిపిఇ కిట్లను స్టెరిలైజ్‌ చేస్తాం.  కరోనా పేషెంట్లకు చికిత్సనందిస్తున్న వైద్యులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదంతా కూడా ‘యోగద ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ పక్షాన నిర్వాహకులు డా. బి. రాఘవరావు చేస్తున్నారు.’’

- నాగసుందరి

ఫొటోలు: వి.వి.ఆర్‌. ఉమామహేశ్వరరావు, గుంటూరు


Updated Date - 2020-04-28T05:30:00+05:30 IST