దేవి గురువందనం
ABN , First Publish Date - 2020-09-20T05:30:00+05:30 IST
విద్య నేర్పించిన గురువు రుణం తీర్చుకొనే అవకాశం శిష్యుడికి లభించటం అదృష్టమనే చెప్పాలి. అలాంటి అరుదైన అవకాశం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు లభించింది. మాండలీన్ శ్రీనివాస్ స్వరపరచిన బాణీకి ఆర్కెస్ట్రైజైషన్...

విద్య నేర్పించిన గురువు రుణం తీర్చుకొనే అవకాశం శిష్యుడికి లభించటం అదృష్టమనే చెప్పాలి. అలాంటి అరుదైన అవకాశం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు లభించింది. మాండలీన్ శ్రీనివాస్ స్వరపరచిన బాణీకి ఆర్కెస్ట్రైజైషన్ చేసి విడుదల చేసిన సందర్భంగా దేవిని నవ్య పలకరించింది.
నేను సాధారణంగా ఎప్పుడూ బయటకు రాను. అందువల్ల లాక్డౌన్ ప్రభావం నాపై లేదు. కానీ ఒక్క విషయం చెప్పాలి. మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదు. కోటి రూపాయల కారున్న వారు.. వందల కోట్ల ఆస్తి ఉన్నవారు కూడా కరోనాకు భయపడాల్సిందే. ఆరోగ్యంగా ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.
‘‘నేను మూడో తరగతి చదువుతున్నప్పుడు మాండలిన్ శ్రీనివాస్గారిని కలిసా. అమ్మ నన్ను వెంటపెట్టుకొని ఆయన దగ్గరకు వెళ్లింది. అప్పటికి ఆయన వయస్సు కూడా తక్కువే. కానీ చిన్నతనంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గడించారు. ‘‘మా వాడికి సంగీతం నేర్పండి’ అని అమ్మ ఆయనను అడిగింది. ఆయన నా కళ్లలోకి చూశారు. ఆ చూపు ఇంకా నాకు గుర్తే. ఆ చూపులో ఏదో తెలియని శక్తి ఉంది.
‘ఏమ్మా.. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి నీకు నిజంగా ఉందా?’ అన్నారు. ‘ ‘నేర్చుకోవాలని ఉంది’ అన్నా. . ‘వెరీగుడ్.. రేపు ఉదయం నుంచి వచ్చేయ్’ అన్నారు. ఆ తర్వాత పదేళ్ల పాటు ఆయన శిష్యరికం చేశా. మా ఇంట్లో కన్నా వారింట్లోనే ఎక్కువుండేవాడిని. కచ్చేరికి వెళుతున్నప్పుడు సంగీత వాయిద్యాల్ని ప్యాక్ చేయడం, వాటిని జాగ్రత్తగా ప్రోగ్రామ్ ప్లేస్‌కు చేర్చడం.. ఇలాంటి పనులన్నీ నావే! ఆయనను ‘అన్నయ్యా...’ అని పిలిచేవాడిని. ఆయన కూడా అంతే అప్యాయంగా చూసేవారు.
కోపం తగ్గించా..
శ్రీనివాస్‌గారు చాలా నిడారంబరంగా ఉండేవారు. కించిత్తు అతిశయం కూడా ఉండేది కాదు. ఎప్పుడూ కోపం వచ్చేది కాదు. ఎవరైనా విమర్శించినా పట్టించుకొనేవారు కాదు. ‘మీ గురించి అలా అన్నాడు సార్’ అని ఎవరైనా పితూరిలు చెబితే- ‘‘
‘వదిలేండయ్యా.. అతనికి మనసులో ఏదో బాధ కలిగి ఉంటుంది. అందుకే అనుంటాడు. అతని మీద కక్ష పెంచుకుని ఏం సాధిస్తాం? సంగీతం మన ప్రపంచం. దాని మీద దృష్టి పెట్టండి’ అనేవారు. ఆయనకు ఎప్పుడూ కోపం రాకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించేది. నాకు చిన్నప్పుడు కోపం ఉండేది. ఆయనను చూసిన తర్వాత తగ్గించుకున్నా. ఎంత సాధించినా ఒదిగి ఉండాలనీ.. ప్రతి ఒక్కరినీ గౌరవించాలనే విషయాలను కూడా ఆయన నుంచి నేర్చుకున్నాను. ఎదుటి వ్యక్తిలో ప్రతిభను ఆయన ఎప్పుడూ గుర్తించేవారు. పొగిడేవారు.
ధైర్యం చేయలేకపోయా!
నేను కంపోజ్ చేసిన ట్యూన్‌ను గురువుగారితో ప్లే చేయించాలి.. లేదా ఆయన కంపోజ్ చేసిన ట్యూన్‌ని నేను పాడాలనేది నా కోరిక. ఎంత చనువు ఉన్నా.. ఆయనను అడిగే ధైర్యం చేయలేకపోయా. ఆయన మరణం నాకు పెద్ద దెబ్బ. ఆయనకు నివాళి అర్పించటానికి ఏం చేయాలా అని చాలా ఆలోచించా. ఆయన కంపోజ్ చేసిన మాండలిన్ ట్రాక్ ఒకటి ఉందని గురువుగారి తమ్ముడు రాజేశ్ చెప్పారు. దానిని తీసుకొని నేను ఆర్కెస్ట్రరైజేషన్ చేశా. అదే- ‘గురువు కంపోజిషన్.. శిష్యా ఆర్కెస్టరైజేషన్’.
గురువుగారి వర్ధంతి సందర్భంగా దానిని శనివారం విడుదల చేశాను. సాధారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన- ఆయన ఇంట్లో ఒక కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ సారి కరోనా వల్ల నిర్వహించలేకపోయాం. ఫేస్బుక్లో మాత్రం లైవ్ ప్రోగ్రాం చేశాం.
బాలు వస్తారు..
బాలుగారితో నాకు వ్యక్తిగతమైన అనుబంధం ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి రోజూ పడుకొనేముందు.. ఉదయం లేవగానే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ‘‘ఆయన ఆరోగ్యం మెరుగుపడింది, సపోర్ట్‌తో కూర్చుంటున్నారు..’’ అని వినగానే చెప్పలేనంత ఆనందం కలిగింది.
