డెలివరీ ఫుడ్‌లతో నో వైరస్
ABN , First Publish Date - 2020-03-25T06:22:11+05:30 IST
ప్రస్తుతం సోషల్ మీడియాలో కరోనా కంటే వేగంగా తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. హోం డెలివరీ ఫుడ్‌తో కరోనా! చికెన్‌తింటే అంతే?, పాల ప్యాకెట్, న్యూస్ పేపర్‌తో వైరస్! ఇలా రకరకాల వార్తలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కరోనా కంటే వేగంగా తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. హోం డెలివరీ ఫుడ్‌తో కరోనా! చికెన్‌తింటే అంతే?, పాల ప్యాకెట్, న్యూస్ పేపర్‌తో వైరస్! ఇలా రకరకాల వార్తలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ తప్పుడు వార్తలు అని వీటికి ఎలాంటి ఆధారం లేదని డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
నిజానికి ఆహారం వలన ఎలాంటి వైరస్ వ్యాపించదు. అది డెలివరీ చేసే వ్యక్తులకు వైరస్‌లు ఉండి, వారికి దగ్గరగా ఉన్నప్పుడే ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. వారి నుంచి నేరుగా డెలివరీ తీసుకోకుంటే ఇలాంటి వాటికి ఆస్కారం లేదు. ఎక్కడో కిచెన్‌లో తయారైన ఆహారం పలు దశలు దాటుకుని వినియోగదారునికి చేరుతుంది. ఈ క్రమంలో ఎక్కడైనా వైరస్ సోకిన వ్యక్తులు ఉంటే మాత్రమే ఇబ్బంది రావచ్చని చెబుతున్నారు హైదరాబాద్‌లోని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి.
మాంసాహారం బెస్ట్
అలాగే కరోనా భయంతో చాలా మంది చికెన్, మటన్, చేపలు, గుడ్లు వంటి మాంసాహారాన్ని తినడం మానేస్తున్నారు. ఇవి తింటే త్వరగా వైరస్ బారిన పడుతున్నారనేది వారి అపోహ. నిజానికి మాంసా హారంలో అధిక సంఖ్యలో ప్రొటీన్లుంటాయి. రోగనిరోధక శక్తి పెరగ డానికి ఇవి దోహదం చేస్తాయి. మాంసాహారమైనా, మరేదైనా నాణ్యత లోపించిందని భావించినప్పుడు మాత్రమే దానిని తిరస్కరించాలి. ఏదైనా వైరస్ మానవ శరీరంలో ప్రవేశించినప్పుడు రోగ నిరోధక శక్తి అనేక రకాలుగా పని చేస్తుంది. వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొం టుంది. ఇంతకు ముందు వచ్చిన వైరస్ తిరిగి అటాక్ అయినప్పుడు అందుకు అనుగుణంగా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి మారు తుంది. కరోనా అనేది కొత్త వైరస్. కాబట్టి దీనిని ఎదుర్కోవడానికి ఇప్పుడు ఉన్నదాని కంటే ఎక్కువగా రోగనిరోధక శక్తి కావాలి. ఇలాంటి సమయంలో హై ప్రొటీన్లు ఉండే మాంసాహారంతో పాటు పప్పు దినుసులను కూడా వీలైనంత ఎక్కువగా తీసుకోవడం మంచిది అంటున్నారు జానకి.
ఇదే విషయాన్ని మరో న్యూట్రిషనిస్ట్ దీక్ష కూడా చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఎంతగా తీసుకుంటే అంత మేలు. శాఖాహారులు విటమిన్ సి ఉండే పండ్లు అంటే నారింజ, బత్తాయిలు, పప్పుదినుసులు తీసుకుంటే ఇందుకు ఉపయోగపడతాయి అంటున్నారు. అలాగే ఇంట్లో వండుకునే పదార్థాల్లో వెల్లుల్లి, అల్లం, పసుపును కూడా తప్పనిసరిగా వినియోగించాలి అని దీక్ష చెబుతున్నారు.
అపోహలు అనేకం
ఇవిగాక కరోనావైరస్ వ్యాప్తి గురించి ఇంకా అనేక రకాల అపోహలు ప్రచారంలో ఉన్నాయి..
లోకల్ ట్రైన్‌లో వెళ్లే ప్రయాణికుడు లాలాజలంతో జబ్బును వ్యాపింప చేస్తున్నాడు, రోడ్డుపై వెళుతూ పిట్టల్లా ప్రజలు రాలిపోతున్నారంటూ ఇటీవల కొన్ని వీడియోలు వచ్చాయి. నిజానికి జబ్బుబారిన పడిన వ్యక్తులు అలా పడిపోయి మరణించడం జరగదు. పదే పదే ఇలాంటి తప్పుడు వార్తలు వైరల్ కావడం వల్ల బలహీనంగా ఉన్నవారిలో కొన్ని రోజులకు సైకలాజికల్ డిజార్డర్ కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిమ్స్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు. కొన్ని రోజులు వీటి నుంచి దూరంగా ఉండడమే మేలని ఆయన సలహా ఇస్తున్నారు.