ఈ కంగారూ తెలుగు పాటల బంగారు

ABN , First Publish Date - 2020-06-18T05:59:54+05:30 IST

క్రీజ్‌లో కుదురుకుంటే కుమ్ముడు... కొడితే గ్యాలరీలో పడే బంతులు... ఒకప్పుడు ఇదీ ఆస్ర్టేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అంటే! కానీ ఇప్పుడు వార్నర్‌ అంటే వీరబాదుడు బ్యాటింగ్‌ ఒక్కటే కాదు...

ఈ కంగారూ తెలుగు పాటల బంగారు

క్రీజ్‌లో కుదురుకుంటే కుమ్ముడు... కొడితే గ్యాలరీలో పడే బంతులు... ఒకప్పుడు ఇదీ ఆస్ర్టేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అంటే! కానీ ఇప్పుడు వార్నర్‌ అంటే వీరబాదుడు బ్యాటింగ్‌ ఒక్కటే కాదు... ఓ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా! అల్లు అర్జున్‌లా డ్యాన్స్‌ చేయగలడు... కత్రినా కైఫ్‌లా అభినయించగలడు... భాంగ్రా భంగిమలూ పెట్టగలడు. ‘అల లాక్‌డౌన్‌ రోజుల్లో’ అంటూ కలకాలం గుర్తుండిపోయేలా ‘ఇల’ సామాజిక మాధ్యమాల్లో ఆద్యంతం వినోదం అందిస్తూ... తను ఆస్వాదిస్తూ... అభిమానులకు అలరిస్తున్నాడీ ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌’ జట్టు కెప్టెన్‌.


ఇదీ వార్నర్‌ ‘సోషల్‌’ స్టామినా..! 

  1. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.4 మిలియన్ల మంది ఫాలోయర్స్‌
  2. ట్విట్టర్‌లో 2 మిలియన్ల మంది ఫాలోయర్స్‌
  3. టిక్‌టాక్‌లో 4.2 ఫాలోవర్స్‌... 55.6 మిలియన్ల లైక్స్‌


కత్రినా కైఫ్‌ ‘షీలా కీ జవానీ’ పాటకు తన కూతురు ఇండీతో కలిసి సరదాగా స్టెప్పులు వేశాడు వార్నర్‌. ఇలా వదిలాడో లేడో... అలా లక్షల్లో వీక్షించేశారు అభిమానులు.


డేవిడ్‌ వార్నర్‌... క్రికెట్‌లో ఈ పేరు ఒక పవర్‌ హౌస్‌. బ్యాట్‌ కొనుక్కోలేని బాల్యం నుంచి ఆస్ర్టేలియా క్రికెట్‌ జట్టు పగ్గాలు చేపట్టే స్థాయి వరకు అతడి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. ఎదురుదెబ్బలు. అవమానాలు. అన్నింటినీ తట్టుకొని నిలబడ్డాడంటే అందుకు గుండెనిబ్బరం... దాని వెనక కుటుంబం ఇచ్చే నైతిక బలమే కారణం. బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో ఏడాది నిషేధానికి గురైనప్పుడు... కరోనా కష్ట కాలంలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు... అతడు గడిపింది కుటుంబంతోనే! భార్య క్యాండిస్‌, ముగ్గురు కూతుళ్లు... ఇవీ, ఇండీ, ఇస్లా... వీళ్లే వార్నర్‌కు రీఛార్జ్‌ పాయింట్‌. రిఫ్రె్‌షమెంట్‌. 


అయితే కరోనా, లాక్‌డౌన్‌ల విపత్కర పరిస్థితుల్లో వార్నర్‌ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. హిందీ, తెలుగు హిట్‌ పాటలకు స్టెప్పులు వేస్తూ ఒక్కొక్కటిగా ‘టిక్‌టాక్‌’ వీడియోలు వదులుతున్నాడు. సకుటుంబ సమేతంగా వార్నర్‌ చేస్తున్న ఈ హంగామాకు నెటిజనం ఫిదా అవుతున్నారు. అన్నీ మరిచిపోయి కాసేపు హాయిగా నవ్వుకొంటున్నారు. వార్నర్‌ వీడియోల్లో అత్యధికం భారతీయ ట్యూన్సే. అందులోనూ తెలుగువి ఎక్కువుండడంతో మనవారు అతడికి బాగా కనెక్ట్‌ అయిపోయారు. 


‘బాస్‌’ దగ్గర కోచింగ్‌... 

ఇంట్లోనే ఉంటున్న నటులు రకరకాల వంటలు చేస్తున్నారు. ఆటగాళ్లు ఇంటి పనులు చక్కబెతుతున్నారు. వార్నర్‌..! వీళ్లందరికీ భిన్నంగా స్టెప్పులతో దుమ్మురేపుతున్నాడు. బ్యాట్‌తో మైదానంలో చేసే విన్యాసాలు చూశాం. మెరుపు ఫీల్డింగ్‌ చూశాం. కానీ... అతడిలోని డ్యాన్సర్‌ని, నటుడిని ఇప్పుడే చూస్తున్నాం. క్రికెట్‌లో కోచ్‌లు ఎంతమంది ఉన్నా... ఇంట్లో డ్యాన్స్‌ కోచ్‌ మాత్రం అతడి భార్య క్యాండిస్‌ మాత్రమే! తాజాగా భార్యతో కలిసి ఓ డ్యాన్స్‌ వీడియో పోస్ట్‌ చేసిన వార్నర్‌... ‘బాస్‌ దగ్గర కోచింగ్‌ టిప్స్‌ తీసుకొంటున్నా’ అంటూ స్మైలీ ఎమోజీలతో ట్యాగ్‌లైన్‌ ఇచ్చాడు. ‘బాస్‌’ అంటే ఎవరో కాదు... అతని భార్యే! వార్నర్‌ భార్య క్యాండిస్‌ ఆసీస్‌ ‘ఐరన్‌ ఉమన్‌’. సర్ఫ్‌ లైఫ్‌ సేవర్‌, మోడల్‌. అతడి డ్యాన్సింగ్‌ ట్యాలెంట్‌ వెనక ఆమె ప్రభావం ఉందో వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది.  


ఇలా వదిలితే... అలా హిట్‌... 

కరోనా విజృంభించడం... ఎవరిళ్లల్లో వారే ఉండాల్సి రావడంతో వార్నర్‌ ఒక్కోటిగా తన అభిరుచులను బయటకు తీస్తున్నాడు. అందులో భాగమే షార్ట్‌ వీడియో షేరింగ్‌ యాప్‌ ‘టిక్‌టాక్‌’ ఎంట్రీ. ‘‘నా ఐదేళ్ల కూతురు కోరిక మేరకు ‘టిక్‌టాక్‌’లోకి వచ్చా. దీని గురించి నాకేం తెలియదు. మీరే సాయం చేయాలి’ అంటూ అభిమానులను పలకరించాడు వార్నర్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలి ‘టిక్‌టాక్‌’ వీడియో పోస్ట్‌ చేశాడు. కత్రినా కైఫ్‌ ‘షీలా కీ జవానీ’ పాటకు తన కూతురు ఇండీతో కలిసి సరదాగా స్టెప్పులు వేశాడు. ఇలా వదిలాడో లేడో... అలా లక్షల్లో వీక్షించేశారు అభిమానులు. ఇక అది మొదలు వార్నర్‌ రోజుకో వీడియో అప్‌లోడ్‌ చేస్తున్నాడు. వాటిల్లో కొన్ని టాలీవుడ్‌ హిట్స్‌! అల్లు అర్జున్‌ ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా’తో పాటు మహేశ్‌బాబు ‘బ్లాక్‌బస్టర్‌..’, జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘పక్కా లోకల్‌’ పాటలు కూడా ఉన్నాయి. ఒక వీడియోలో ప్రభాస్‌ ‘బాహుబలి’ క్యారెక్టర్‌ ‘అమరేంద్ర బాహుబలి’ గెట్‌పలో కనిపించి ఆశ్చర్చపరిచాడు వార్నర్‌. భార్య, పిల్లలు... ఇలా కుటుంబ సమేతంగా ఆడి, అలరిస్తున్నాడు. 


లిప్‌ సింకింగ్‌తో నవ్వులు... 

అంతేనా... బాలీవుడ్‌ తారల డైలాగులకు లిప్‌ సింకింగ్‌ ఇస్తూ అద్భుతంగా నటిస్తున్నాడు. శిల్పాశెట్టి ఫన్నీ ఫేస్‌తో చేసిన వీడియోకు వార్నర్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ నెట్టింట నవ్వులు పూయించాయి. వీటితోపాటు ‘టిక్‌టాక్‌’తో స్టార్లయిన సామాన్యుల ప్రతిభను కూడా నలుగురికీ పరిచయం చేస్తూ, ప్రోత్సహిస్తున్నాడు. 


కుటుంబంతో జాలీగా... 

ఆట మొదలైతే క్షణం తీరిక ఉండదు. అయితే ఇది లాక్‌డౌన్‌ టైమ్‌ కదా! ఇంత సమయం ఇంకెప్పుడూ దొరక్కపోవచ్చు. అందుకే వచ్చిన అవకాశాన్ని వార్నర్‌ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొంటున్నాడు. ‘‘జీవితం అద్భుతంగా సాగుతోంది. అన్నింటి కంటే ముఖ్యమైనది... ఓ మంచి భర్తగా, తండ్రిగా నా కుటుంబంతో గడపగలిగాను. ఒకవేళ ఆటకు విరామం దొరికి ఉండకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ లాక్‌డౌన్‌ సమయం నన్ను నేను నిరూపించుకొంటూ మనిషిగా మరింత ఎదిగేందుకు ఉపయోగపడింది’’ అంటూ వార్నర్‌ ట్వీట్‌ చేశాడు. 


రేసింగ్‌ మజా... 

డేవిడ్‌ వార్నర్‌కు క్రికెట్‌ అంటే పిచ్చి. దాని తరువాతే ఏదైనా! ఇది ఇప్పుడు. అంతకుముందు హార్స్‌ రేసింగ్‌లపైనా తెగ మోజుండేది వార్నర్‌కు. కొంతకాలం అది వ్యసనంగా మారింది. అయితే కెరీర్‌ కోసం దాని నుంచి బయటపడ్డాడు. ‘‘హార్స్‌ రేసింగ్‌ నాకు చాలా ఇష్టం. కానీ క్రికెట్‌ నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. నేనేంటో నిరూపించుకోవడానికి ఇంధనమైంది. ఇప్పుడు అదే నా జీవితం. అప్పుడప్పుడూ గోల్ఫ్‌ కూడా ఆడుతుంటాను. ట్రావెలింగ్‌ చేస్తుంటాను.  ఇక ‘టిక్‌టాక్‌’... ఈ ఖాళీ సమయంలో అభిమానులతో కలిసి బాగా ఆస్వాదిస్తున్నాను’’ అంటూ వార్నర్‌ చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని కూడా ‘టిక్‌టాక్‌’లోకి రమ్మని అడుగుతున్నాడు. దీనిపై జట్టు సభ్యుడు రవిచంద్రన్‌ అశ్విన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో కోహ్లీ మాట్లాడాడు. ‘‘నన్ను కూడా వీడియో చేయమని వార్నర్‌ వెంట పడుతున్నాడు. వదలడంలేదు. నేను ఇంకా ఏ విషయం చెప్పలేదు’’ అంటూ కోహ్లీ సరదాగా అన్నాడు.


భావోద్వేగాల బంధం...

భారతీయుడు కాకపోయినా ఇక్కడి సంస్కృతికి బాగా అలవాటుపడ్డాడు వార్నర్‌. అందులోనూ తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. ‘ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌’ (ఐపీఎల్‌)లో ఈ స్టార్‌ ఓపెనర్‌ ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌’ జట్టుకు సారథిగా వ్యవహరించడం అందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలోనే వార్నర్‌, అతని భార్య క్యాండిస్‌ కూడా తరచూ హైదరాబాద్‌ వచ్చివెళుతుంటారు. అలా తెలుగు సినిమాలు, స్టార్లు వారికి బాగా పరిచయమయ్యారు. ‘హైదరాబాద్‌ వారియర్స్‌’ పేరుతో ఇక్కడ అతడికి ఫ్యాన్స్‌ క్లబ్‌ ఉంది. దానికితోడు బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో ఏడాది నిషేధానికి గురైన వార్నర్‌... మళ్లీ ఆటలోకి దిగి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది ఐపీఎల్‌లోనే! ఆ సమయంలో అతడు ధన్యవాదాలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. భారత్‌తో అతడికున్నది వచ్చిపోయే అనుబంధమే కాదు... భావోద్వేగాల బంధం కూడా!


  


Updated Date - 2020-06-18T05:59:54+05:30 IST