గుండె మీద కొవిడ్‌ బండ!

ABN , First Publish Date - 2020-10-13T05:30:00+05:30 IST

కరోనా ప్రభావం గుండె మీద కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా హృద్రోగుల గుండె మీద ఈ వైరస్‌ భిన్నమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు అంతమవుతుందో తెలియని ఈ కరోనా కాలంలో హృద్రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు ప్రముఖ హృద్రోగ వైద్యులు...

గుండె మీద కొవిడ్‌ బండ!

కరోనా ప్రభావం గుండె మీద కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా హృద్రోగుల గుండె మీద ఈ వైరస్‌ భిన్నమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు అంతమవుతుందో తెలియని ఈ కరోనా కాలంలో హృద్రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు ప్రముఖ హృద్రోగ వైద్యులు డాక్టర్‌ మన్నెం గోపీచంద్‌!


కరోనాతో కూడిన భయం, ఆందోళన సర్వత్రా ఉంది. వైరస్‌ వ్యాప్తి, పెరుగుతున్న కేసులు మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. సన్నిహితులు, బంధువుల మరణాలు, ఒడిదొడుకులకు గురైన ఆర్థిక పరిస్థితులు... ఇలా వేర్వేరు మార్గాల ద్వారా కొత్త ఒత్తిడిలు దైనందిన జీవితంలోకి వచ్చి కలిశాయి. ఇలాంటి భిన్న ఒత్తిడులన్నీ అప్పటికే ఉన్న గుండె సమస్యలను పెంచడంతో పాటు ఉన్న గుండె జబ్బులను మరింత తీవ్రం చేసేవే! వీటికి తోడు మధుమేహం, అధిక రక్తపోటు, కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు కలిగిన వాళ్లు... ఈ కోవకు చెందినవాళ్లలో గుండె జబ్బులు ప్రస్తుత కరోనా కాలంలో బయల్పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇలాంటి సమయంలో గుండెజబ్బులను తెలిపే లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. 


శ్వాస అందకపోవడం: దైనందిన జీవితంలో రోజూ చేస్తున్న పనులే కొత్తగా ఆయాసం కలిగిస్తూ ఉంటే అలక్ష్యం చేయకూడదు. కొద్ది దూరంలో ఉన్న దుకాణానికి రోజూ నడిచి వెళ్లేటప్పుడు కలగని ఆయాసం కొత్తగా మొదలైతే అనుమానించవలసిందే! 


అలసట: అంతకుముందు లేని అలసట కొత్తగా మొదలైనా అప్రమత్తం కాక తప్పదు. రోజూ చేసే ఒక చిన్న పనిని అలసట కారణంగా చేయలేకపోతున్నా, వాయిదా వేస్తున్నా ఆ మార్పును కూడా తేలికగా తీసుకోకూడదు.


ఛాతీలో అసౌకర్యం: ఛాతీలో ఎలాంటి అసౌకర్యం కలిగినా అశ్రద్ధ చేయకూడదు. ఛాతీలో తలెత్తే అసౌకర్యాన్ని గ్యాస్ర్టిక్‌ ట్రబుల్‌గా భావించి, రెండు త్రేన్పులు రాగానే రిలీఫ్‌ వస్తుంది అనుకునేవాళ్లు కూడా ఇటువంటి లక్షణాన్ని తీవ్రంగానే పరిగణించాలి. వైద్యులను కలిసి అది గుండెజబ్బు కాదని నిర్థారించుకోవాలి.  గుండె సమస్యలు కూడా ఇవే లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి 40 ఏళ్లు దాటినవాళ్లు, కుటుంబ చరిత్రలో గుండె సమస్యలు ఉన్నవాళ్లు, ధూమపానం అలవాటు ఉన్నవాళ్లు, మధుమేహం, అఽధిక రక్తపోటు కలిగినవాళ్లు ఛాతీలో అసౌకర్యాన్ని తీవ్రంగానే భావించాలి.


హఠాత్తుగా గుండెపోటు ఎందుకు?

ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేనివారికీ గుండెపోటు రావచ్చు. వైద్యులు కూడా కచ్చితంగా కనిపెట్టలేని కారణాలు గుండెపోటుకు దారితీయవచ్చు. ఎటువంటి శారీరక వ్యాయామం చేయకుండా ఎక్కువ క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకుంటే క్రమేపీ అది శరీరంలో కొవ్వులా పేరుకున్నట్టే, మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ కాలం పాటు కొనసాగితే, క్రమేపీ అది గుండె మీద ఒత్తిడిని పెంచి గుండెపోటుకు దారితీస్తుంది. ఇలా శరీరంలో పెరిగే ఒత్తిడి... ఎడ్రినలిన్‌, డోపమైన్‌ హార్మోన్ల మీద ప్రభావం చూపించి, ఫలితంగా గుండెలోని రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేసి, గుండెపోటుకు లోను చేస్తుంది. కొందరి కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు ఉంటాయి. ఆ కోవకు చెందిన వాళ్లు, షుగర్‌, బీపీ, గుండెజబ్బు లక్షణాలు లేవు కాబట్టి ఆరోగ్యం నిక్షేపంగా ఉంది అనుకుంటారు. కానీ వీరిలో 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ముంచుకొచ్చే గుండెజబ్బులను ముందుగానే గుర్తించడం కోసం పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కాబట్టి గుండెజబ్బుల మీద అవగాహన ఏర్పరుచుకుని అప్రమత్తంగా నడుచుకోగలిగితే హఠాత్తుగా గుండెపోటుకు లోనయ్యే అవకాశాలు తగ్గుతాయి.


గుండె మీద ప్రభావం!

కరోనా కారణంగా గుండెజబ్బులు తలెత్తడం కాకుండా, అప్పటికే ఎంతోకొంత గుండె సమస్యలు ఉండి, ఈ వైరస్‌ కారణంగా ఆ సమస్యలు తీవ్రమయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే అప్పటికే గుండె సమస్యలు ఉన్న వారికి కరోనా సోకితే, సమస్య మరింత తీవ్రం కూడా కావచ్చు. మరీ ముఖ్యంగా కొవిడ్‌ సోకిన వ్యక్తుల గుండె మీద వైరస్‌ ప్రభావం మూడు రకాలుగా ఉంటుంది. వీరిలో గుండెకు సంబంధించి ప్రధానంగా తలెత్తే సమస్యలు ఏమిటంటే...


రక్తం గడ్డలు: కొవిడ్‌ వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం పెరుగుతుంది. దాంతో రక్తసరఫరా సక్రమంగా జరగక ప్రధాన అంతర్గత అవయవాలు దెబ్బతినే అవకాశాలు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా రెండు మిల్లీమీటర్ల స్వల్ప వైశాల్యం ఉండే గుండెలోని సూక్ష్మ రక్తనాళాల్లో రక్తం గడ్డ ఏర్పడితే గుండెకు సంబంధించిన కొంత కండరం డ్యామేజీ అవుతుంది. దాంతో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొవిడ్‌ సోకిన వారికి తప్పనిసరిగా రక్తం పలుచన చేసే మందులు వాడవలసి ఉంటుంది. 


మయోకార్డైటిస్‌: వైరస్‌ సోకినప్పుడు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తడం సహజం. ఈ ఇన్‌ఫ్లమేషన్‌ గుండె కండరాల్లోనూ తలెత్తి, ఆ భాగం మేరకు పనిచేయడం మానేస్తుంది. ఈ స్థితే వైరల్‌ మయోకార్డైటిస్‌!

పూర్వపు  సమస్య: కొవిడ్‌ సోకక ముందు నుంచే వ్యక్తికి గుండె సమస్యలు ఉండి ఉంటే, గుండె మీద ఒత్తిడి రెట్టింపు అవుతుంది. దాంతో హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.


కరోనా వచ్చి తగ్గితే?

కరోనా సోకిన తర్వాత మయోకార్డైటిస్‌ సమస్య బయల్పడినట్లైతే, ఆ సమస్య కరోనాకు పూర్వం నుంచీ ఉండి ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఆరు నెలల వరకూ జాగ్రత్తగా ఉండక తప్పదు. వీరిలో గుండె బలహీనత దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే కరోనా సోకిన సమయంలో రక్తం గడ్డ కట్టే స్వభావంతో గుండె కండరం దెబ్బతినే సమస్య (మయోకార్డైటిస్‌) కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొనసాగే పరిస్థితి ఉండదు. అయితే కరోనాకు గురయిన తీవ్రత (మైల్డ్‌, మోడరేట్‌, సివియర్‌) ఆధారంగా ఈ ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.


స్వల్పంగా: స్వల్పంగా కరోనా ఇన్‌ఫెక్షన్‌కు లోనయిన వాళ్లు మిగతా అందరిలాగే మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండడం లాంటి జాగ్రత్తలను కొనసాగించాలి. అలాగే పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అవసరం.


మధ్యస్థంగా: కరోనా చికిత్సలో భాగంగా స్టిరాయిడ్‌ చికిత్స తీసుకున్నవాళ్లు కచ్చితంగా బలహీనతకు లోనవుతారు. కోలుకునే కాలం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి సరైన ఆహారం తీసుకోవడంతో పాటు తేలికపాటి వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని బలపరుచుకోవాలి. వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి. కొ మార్బిడ్‌ కోవకు (అధిక రక్తపోటు, మఽధుమేహం) చెందినవాళ్లు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత జనరల్‌ హార్ట్‌ చెకప్‌ చేసుకుంటూ వైద్యుల సలహాల మేరకు నడుచుకోవాలి.


తీవ్రంగా: ఈ కోవకు చెందిన వాళ్లు ఎక్కువ కాలం పాటు స్టిరాయిడ్లు వాడతారు కాబట్టి పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. కొందరికి ఆరు నెలలు కూడా పట్టవచ్చు. తీవ్రంగా జబ్బుపడిన ఈ వ్యక్తులు ఊపిరితిత్తులు గట్టిపడే లంగ్‌ ఫైబ్రోసి్‌సకు కూడా లోనవుతారు. కాబట్టి వీళ్లు కచ్చితంగా సరైన ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు కొనసాగించాలి. కాబట్టి కరోనా నుంచి బయటపడినా, శరీర సత్తువ, స్పందించే తీరు ఆధారంగా జీవనశైలిని ప్రణాళికాబద్ధంగా నడిపించాలి. అలాగే వైద్యులను క్రమంతప్పక సంప్రతిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలి.


స్టెంట్లు, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయినవాళ్లు!

గుండెకు స్టెంట్లు వేయించుకుని లేదా సర్జరీ చేయించుకుని ఇంటికి వెళ్లగానే, సన్నిహితులు మర్యాదపూర్వకంగా వచ్చి కలుస్తూ ఉండడం సహజం. అయితే కరోనా సమయంలో ఇలా వచ్చి కలిసే వాళ్ల ద్వారా స్టెంట్లు వేయించుకున్న వ్యక్తులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ కొత్త వాళ్లను కలవకపోవడమే మేలు. అలాగే సాధారణ వ్యక్తుల మాదిరిగానే కొవిడ్‌ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలి.

గుండెపోట్లు ఉదయాన్నే ఎందుకు?

ఎక్కువ శాతం మందికి అర్థరాత్రి దాటిన తర్వాత రెండు లేదా మూడు గంటల సమయంలో గుండెపోట్లు వస్తూ ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం ఎక్కువ సమయం పాటు విశ్రాంతిలో ఉండడం మూలంగా రక్తం గడ్డకట్టే మెకానిజం స్తబ్దుగా ఉండడమే! దాంతో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండెపోట్లు వస్తూ ఉంటాయి. అలాగే ఈ సమయంలో శరీరం నిద్రావస్థలో ఉండడం మూలంగా ‘ఫ్లైట్‌ అండ్‌ ఫ్రైట్‌’ రెస్పాన్స్‌ కూడా కరవవుతుంది. సర్వైవల్‌ ఇన్‌స్టింక్ట్‌లో భాగమైన ఈ శరీర స్పందన కూడా రాత్రి వేళ తగ్గుతుంది. కాబట్టి అర్థరాత్రి గుండెపోటుకు గురయినప్పుడు శరీరం మిగతా సమయాలలో స్పందించిన విధంగా స్పందించదు. దాంతో బాడీ డిఫెన్స్‌ మెకానిజం స్తబ్దుగా ఉండిపోయి, గుండెపోటు తీవ్రతతో ప్రాణాలు కోల్పోయే స్థితి తలెత్తుతుంది.


కొవిడ్‌ సమయంలో గుండె చికిత్సలు!

కొవిడ్‌ కారణంగా గుండెజబ్బులు తలెత్తినా, గుండెజజ్బులు కలిగిన వాళ్లకు కొవిడ్‌ సోకినా సర్జరీకి బదులుగా స్టెంట్లు వేసే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. స్టెంట్లతో ఆరోగ్యాన్ని కుదుటపరిచి, కొవిడ్‌ వార్డులో సంబంధిత చికిత్స కొనసాగిస్తారు. పూర్తిగా కరోనా నెగటివ్‌ ఫలితం వచ్చిన తర్వాత సర్జరీకి సిద్ధం చేస్తారు. ఇలా కాకుండా పరిస్థితి తీవ్రంగా ఉండి, సర్జరీ అత్యవసరమైతే అలాంటి వాళ్లకు కొవిడ్‌ ఉన్నా గుండె సర్జరీలు చేయక తప్పదు.
ఒత్తిడి ఎంత?

ఒత్తిడి పట్ల స్పందించే స్వభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ప్రతి వ్యక్తికీ దైనందిన జీవితంలో ఎంతోకొంత ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఒత్తిడి నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాకపోతే దాన్ని ఎలా హ్యాండిల్‌ చేస్తున్నాం అనేది ఎంతో కీలకం.  కొందరు ఒత్తిడి ఉంటేనే సమర్థంగా పని చేయగలుగుతారు. ఇంకొందరు ఒత్తిడితో ఏ పనినీ సక్రమంగా చేయలేకపోతారు. కొందరు ఒత్తిడి ఉన్నా నింపాదిగా ఉండగలుగుతారు. మరికొందరు మానసిక ఒత్తిడికి లోనైతే విపరీతంగా చీకాకు పడిపోయి, ఎదుటివారి మీద అరిచేస్తూ ఉంటారు. కాబట్టి ఒత్తిడికి ఎలా స్పందిస్తున్నాం అనేది ఎవరికి వారు గమనించుకోవాలి. దానికి తగ్గట్టు ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలైన యోగా, ధ్యానం లాంటివి అనుసరించాలి. అలాగే ఒత్తిడికి లోనై కుంగిపోయినంత మాత్రాన ఒరిగే ప్రయోజనం ఏదీ లేకపోగా, ఆరోగ్యం దెబ్బతింటుంది అనే ‘సెల్ఫ్‌ అవేర్‌నెస్‌’ ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి. ఈ అవగాహన ఏర్పరుచుకోగలిగితే ఒత్తిడిని ఎలా హ్యాండిల్‌ చేయాలో అర్థమవుతుంది.-డాక్టర్‌ మన్నెం గోపీచంద్‌

మేనేజింగ్‌ డైరెక్టర్‌

స్టార్‌ హాస్పిటల్స్‌

హైదరాబాద్‌

Updated Date - 2020-10-13T05:30:00+05:30 IST