ఈ వైరస్‌లూ ప్రమాదకరమే!

ABN , First Publish Date - 2020-07-28T05:30:00+05:30 IST

కరోనా వైరస్‌ విపరీత తత్వం, విస్తృతితో భయాందోళనకు లోనవుతున్నాం. దీని తడాఖాతో ఇతరత్రా హానికారక వైరస్‌లతో ముంచుకొచ్చే ప్రమాదాలను నిర్లక్ష్యం చేస్తున్నాం. నిజానికి....

ఈ వైరస్‌లూ ప్రమాదకరమే!

నేడు వరల్డ్‌ హెపటైటిస్‌ డే


కరోనా వైరస్‌ విపరీత తత్వం, విస్తృతితో భయాందోళనకు లోనవుతున్నాం. దీని తడాఖాతో ఇతరత్రా హానికారక వైరస్‌లతో ముంచుకొచ్చే ప్రమాదాలను నిర్లక్ష్యం చేస్తున్నాం. నిజానికి కాలేయానికి చేటు చేసే ‘హెపటైటిస్‌’, కరోనా కన్నా రెట్టింపు హానికరం! 


‘హెపటైటిస్‌-ఎ, బి, సి, డి, ఇ’ వైర్‌సలతో కాలేయం ఇన్‌ఫెక్షన్‌ బారిన పడడంతో పాటు కాలేయ కేన్సర్‌ వచ్చే ప్రమాదమూ ఉంది. కరోనా మరణాలు 1ు - 5ు మాత్రమే! కానీ కొన్ని దశాబ్దాలుగా ప్రతీ ఏడాదీ సుమారు 10 లక్షల మంది హెపటైటిస్‌ బితో మరణిస్తున్నారు. ‘హెపటైటిస్‌-బి’ సోకని వారితో పోలిస్తే, ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకినవాళ్లకు కాలేయ కేన్సర్‌ వచ్చే అవకాశాలు 100 రెట్లు ఎక్కువ. హెపటైటిస్‌-సితో ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 కోట్ల మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధి తిరిగి సరిదిద్దలేని సిర్రోసి్‌సకు లోను చేయడంతో పాటు కాలేయ కేన్సర్‌కూ కారకమవుతుంది. ప్రతి మూడు కాలేయ మరణాల్లో రెండు వైరల్‌ హెపటైటి్‌సవే ఉంటున్నాయి.


ఇలా సోకుతాయి!

హెపటైటిస్‌-ఎ, ఇ: హెపటైటిస్‌-ఎ, బి, సి, డి, ఇ వైర్‌సలు వేర్వేరు మాధ్యమాల ద్వారా సోకుతాయి. హెపటైటిస్‌-ఎ,ఇలు కలుషిత ఆహారం, నీటి ద్వారా సోకి, చికిత్సతో అదుపులోకి వస్తాయి. కొన్ని సందర్భాల్లో హెపటైటిస్‌-ఎ, ఇ వైర్‌సలు లివర్‌ ఫెయిల్యూర్‌కు దారి తీస్తాయి. మరీ ముఖ్యంగా గర్భిణుల్లో హెపటైటిస్‌-ఇ అత్యంత ప్రమాదకరం. కాబట్టి ఈ వైర్‌సలను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి.


హెపటైటిస్‌-బి: రక్తం, శరీర స్రావాలు (ఉమ్మి, వీర్యం), ప్రసవ సమయంలో తల్లి నుంచి బిడ్డకు, లైంగిక సంపర్కం ద్వారా ఈ వైరస్‌ సోకుతుంది. కాబట్టి ఈ వైరస్‌ సోకిన వ్యక్తి టూత్‌బ్ర్‌షలు, రేజర్లు ఇతరులు వాడకూడదు. హెపటైటిస్‌-బి, సి సోకిన వాళ్లు రక్తదానం చేయకూడదు. 


హెపటైటిస్‌-సి: రక్తమార్పిడి, ఇంజెక్షన్లు, స్టెరైల్‌ చేయని డయాలసిస్‌ ద్వారా ఇతరుల నుంచి ఈ వైరస్‌ సోకుతుంది. లైంగిక సంపర్కంతో కూడా ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. 


లక్షణాలు ఇవే!

కాలేయం 80% వ్యాధిగ్రస్తమైనా సమర్ధంగా పని చేస్తుంది కాబట్టి లక్షణాలు ఆలస్యంగా బయటపడతాయి. కామెర్లు, పొట్ట లావెక్కిపోవడం, కాళ్లలో వాపు, రక్తపు వాంతులు, నల్లని మలం, అయోమయం, మత్తుగా ఉండడం లాంటివి ప్రధాన లక్షణాలు. దగ్గు, జలుబు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం లాంటి కొవిడ్‌ లక్షలతో పాటు హెపటైటిస్‌ లక్షణాలనూ ఓ కంట కనిపెట్టాలి. 


పరీక్షలు!

రక్తపరీక్షతో హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించవచ్చు. ఈ 

పరీక్షలో ఇన్‌ఫెక్షన్‌ సోకినట్టు తేలితే వైరస్‌ దశతో పాటు, కాలేయం ఎంత మేరకు దెబ్బతిన్నదీ అంచనా వేసి వైద్యులు తగిన చికిత్స చేస్తారు. 


చికిత్సలు ఉన్నాయి!

ఇన్‌ఫెక్షన్‌ను ప్రారంభంలోనే గుర్తిస్తే కాలేయం సిర్రోసిస్‌ దశకు చేరకుండా నియంత్రించవచ్చు. హెపటైటిస్‌-సిని పూర్తిగా నయం చేసే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రోజు ఒక మాత్ర చొప్పున మూడు నెలల పాటు ఈ మందులను వాడితే సిర్రోసిస్‌, కాలేయ కేన్సర్‌కు దారి తీయకుండా 99ు ఈ వైర్‌సను అంతం చేయవచ్చు. అయితే హెపటైటిస్‌-బిని నిలువరించే మందులు ఉన్నప్పటికీ ఈ వైర్‌సను శరీరం నుంచి సమూలంగా నిర్మూలించే పరిస్థితి లేదు. ఇందుకు కారణం హెపటైటిస్‌-బి వైరస్‌ కాలేయ కణాల్లో తిష్ఠ వేయడమే! అయితే హెపటైటిస్‌-బి, ఎలు సోకకుండా అద్భుతమైన వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయి.


ప్రాణాంతకమైన ఈ వైర్‌సలను కనిపెట్టడం కోసం ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకుని, ఫలితం నెగటివ్‌గా వస్తే వ్యాక్సీన్లు చేయించుకోవాలి. పాజిటివ్‌గా వస్తే చికిత్స తీసుకోవాలి. చాప కింద నీరులా నిశ్శబ్దంగా కాలేయాన్ని గుల్ల చేసే హెపటైటిస్‌ వైర్‌సలను ప్రారంభంలోనే కనిపెట్టి తుదముట్టించాలి.
- డాక్టర్‌ నవీన్‌ పోలవరపు

కన్సల్టెంట్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ హెపటాలజిస్ట్‌,

అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2020-07-28T05:30:00+05:30 IST