కరోనాను... పచ్చడి చేద్దాం!
ABN , First Publish Date - 2020-03-25T06:15:56+05:30 IST
ఉగాది పచ్చడి ఔషధగుణాల నిధి. కరోనాతో క్లిష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం తోడ్పడే గుణాలు ఉగాది...

ఉగాది పచ్చడి ఔషధగుణాల నిధి. కరోనాతో క్లిష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం తోడ్పడే గుణాలు ఉగాది పచ్చడిలో పుష్కలంగా ఉన్నాయి. పచ్చడి తయారీలో ఉపయోగించే దినుసులన్నీ రోగనిరోధకశక్తికి తోడ్పడేవే!
బెల్లం :
బెల్లంనీళ్లు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. బెల్లం సేవనంతో జఠరాగ్ని పెరుగుతుంది. బెల్లం రుచిని పుట్టిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. బాలింతలకు పాలు వృద్ధి అవుతాయి. బెల్లం... మూర్ఛవ్యాధిని తగ్గించడంతో పాటు పాండు రోగమూ పోతుంది. దీన్లోని ఇనుముతో రక్తవృద్ధి జరుగుతుంది. కాలేయంలో పేరుకున్న విషాలు బయటకు వెళ్లిపోతాయి. రక్తశుద్ధి జరుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కండరాలు బలపడతాయి. నెలసరి నొప్పులు అదుపులోకి వస్తాయి.
చింతపండు :
చింతపండుకు సహస్రవేధి అని పేరు. వేయి విధాలుగా శోధన చేసి, వ్యాధులను నివారిస్తుంది కాబట్టే చింతపండుకు ఆ పేరు. చింతపండు త్రిదోషహారి. చింతపండు తీసుకుంటే శ్రమ, బడలిక తొలగిపోతాయి. జ్వరం తగ్గుతుంది. క్యాల్షియం, ఐరన్, సోడియం, జింక్, ఫాస్ఫరస్, ‘సి’, ‘బి’, ‘ఎ’, ‘కె’ విటమిన్లు ఉంటాయి. దీన్లోని పీచు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీన్లోని పొటాషియం యాంటీఆక్సిడెంట్ ఫలితాన్ని ఇస్తుంది. కేన్సర్ నుంచి రక్షణ కల్పించే గుణాలూ చింతపండుకు ఉన్నాయి. జీర్ణశక్తిని పెంచడంతో పాటు, మలబద్ధకాన్నీ నివారిస్తుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.
రాతి ఉప్పు :
శరీరానికి అవసరమైన 93 ట్రేస్‌ఎలిమెంట్స్‌లో 84 రాతి ఉప్పులో ఉంటాయి. రాతి ఉప్పు చలువ చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి, మెటబాలిజంను వృద్ధి చేస్తుంది. సైనస్, ముక్కు సంబంధిత ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. పొట్టలో నొప్పి తగ్గుతుంది. నులిపురుగులు మరణిస్తాయి. అధిక బరువు తగ్గిస్తుంది. ఒత్తిడి తొలగి, కమ్మని నిద్రను అందిస్తుంది. చర్మపు ఆరోగ్యం మెరుగవుతుంది. స్నానంలో స్క్రబ్‌గా కూడా దీన్ని వాడవచ్చు. ఎడీమా, చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్యలూ తగ్గుతాయి.
వేప పువ్వు :
వేప పువ్వులో అత్యంత మెరుగైన యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. కాబట్టే చికెన్‌పాక్స్ సోకినప్పుడు వేపాకును విరివిగా వాడతారు. దీనికి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలూ ఉంటాయి. వేపతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చర్మ సమస్యలూ తగ్గుతాయి. రక్తం శుద్ధి అవుతుంది.
పచ్చి మామిడి :
పచ్చి మామిడితో తయారుచేసిన కషాయం ఎండవేడిమికి ముక్కు నుంచి రక్తం కారడాన్ని నివారిస్తుంది. వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. అతి వేడి నుంచి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. డిస్పెప్సియా, కడుపు ఉబ్బరం, అతిసారం, మలబద్ధకాలను నివారిస్తుంది. కాలేయం, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీన్లోని ‘జీక్సాంథిన్’ అనే యాంటీఆక్సిడెంట్ సూర్యరశ్మిలోని హానికారక కిరణాల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తుంది.
డాక్టర్ సూర్యపల్లి సారంగపాణి
రిటైర్డ్ ప్రిన్సిపాల్, జి.ఎ.సి, హైదరాబాద్.