ఇంటి నుంచే సూపర్‌స్టార్లు నటించారు!

ABN , First Publish Date - 2020-04-08T05:44:39+05:30 IST

‘బిగ్‌ బీ’ ఇంట్లో తన కూలింగ్‌ గ్లాసెస్‌ ఎక్కడో పెట్టి మర్చిపోయారు. ఇంట్లోవాళ్లను అడిగితే నో రెస్పాన్స్‌.

ఇంటి నుంచే సూపర్‌స్టార్లు నటించారు!

‘బిగ్‌ బీ’ ఇంట్లో తన కూలింగ్‌ గ్లాసెస్‌ ఎక్కడో పెట్టి మర్చిపోయారు. ఇంట్లోవాళ్లను అడిగితే నో రెస్పాన్స్‌. ఆ బాధ్యతను దిల్జీత్‌ దోసాంజ్‌, రణ్‌బీర్‌కపూర్‌లు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సూపర్‌స్టార్లను అంటే రజనీకాంత్‌, చిరంజీవి, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, శివరాజ్‌కుమార్‌, ప్రొసెన్‌జిత్‌ చటర్జీలతో పాటు అలియాభట్‌ను కూడా అడిగారు. వారంతా తమ తమ భాషల్లో తెలియదన్నారు. అలియాభట్‌ మాత్రం తన దగ్గర ఉందని ఇస్తే, అది కాస్త దిల్జీత్‌, రణ్‌బీర్‌ల చేతులు మారి చివరికి ప్రియాంకచోప్రా దగ్గరకు చేరింది. అంతగా కష్టపడి, హడావిడి చేసి, చివరికి కూలింగ్‌ గ్లాసెస్‌ను ఆమె బిగ్‌బీ అమితాబ్‌కు ఇస్తే ఆయన ఏమన్నారో తెలుసా? ‘లాక్‌ డౌన్‌ వల్ల ఇంట్లో నుంచి బయటకు కదలడం లేదు కదా. ఆ తర్వాత కావాల్సివస్తే ఇబ్బంది పడతారని ఇప్పుడే అడిగా’ అని కూల్‌గా చెప్పడం కొసమెరుపు.


కేవలం నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న ఒక షార్ట్‌ఫిల్మ్‌లో ఇంతమంది సూపర్‌స్టార్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? వీక్షకులకు కన్నుల పండుగే కదా. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో అమితాబ్‌ నేతృత్వంలో ‘ఫ్యామిలీ’ అనే ఈ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించారు. ఇందులో విశేషమేమిటంటే ఆయా సూపర్‌స్టార్లు అందరూ కూడా వారి వారి ఇళ్లలో ఉండే నటించడం. వారంతా ఒకే ఇంట్లో ఉన్నట్టుగా చక్కగా ఎడిట్‌ చేసి కథను రక్తి కట్టించారు దర్శకుడు ప్రసూన్‌ పాండే. ఈ సందర్భంగా అమితాబ్‌ మాట్లాడుతూ ‘‘ఈ షార్ట్‌ఫిల్మ్‌ను మేమంతా ఇంటి నుంచి బయటకు రాకుండానే షూట్‌ చేశాం. సినిమా పరిశ్రమ అనేది ఒక ఫ్యామిలీ. మేము తెరముందు కనిపిస్తాం కానీ మా వెనుక ఎంతో మంది కార్మికులు పనిచేస్తుంటారు.


ఈ కష్టకాలంలో వారికి అండగా నిలవాలనే సత్‌ సంకల్పంతో ఈ చిన్న ప్రయత్నం చేశాం. దీని స్పాన్సరర్స్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని సినీ కార్మికుల కోసం వినియోగిస్తాం. కరోనాను ఎదుర్కోవాలంటే మీరు కూడా ఇంట్లోనే ఉండండి... సురక్షితంగా ఉండండి’’ అంటూ వీడియో చివర సందేశాన్ని ఇచ్చారు. ‘ఫ్యామిలీ’ షార్ట్‌ఫిల్మ్‌ ప్రీమియర్‌  సోమవారం (6న) రాత్రి 9 గంటలకు సోనీ నెట్‌వర్క్‌ ద్వారా విడుదలయ్యింది. ఒకవైపు ‘కొవిడ్‌ 19‘పై అవగాహనను పెంచుతూనే మరోవైపు సినీ కార్మికులకు అండగా నిలవాలనే సంకల్పంతో మన సూపర్‌స్టార్లంతా ఏకమై షార్ట్‌ఫిల్మ్‌ తీయడం ఎంతైనా అభినందనీయం. ఈ సరదా ‘ఫ్యామిలీ’ని మీరూ చూసేయండి.

Updated Date - 2020-04-08T05:44:39+05:30 IST