మీ శానిటైజర్‌ నాణ్యమైనదేనా?

ABN , First Publish Date - 2020-07-20T05:30:00+05:30 IST

‘కొవిడ్‌ - 19’ వ్యాప్తిని అడ్డుకోవడానికి మాస్క్‌ పెట్టుకోవడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం లాంటి జాగ్రత్తలను ప్రజలందరూ పాటిస్తున్నారు. అయితే చేతులు శుభ్రం చేసుకోవడానికి వాడే హ్యాండ్‌ శానిటైజర్లు నకిలీవి, నాసిరకంవి అయితే ఎలా?...

మీ శానిటైజర్‌ నాణ్యమైనదేనా?

‘కొవిడ్‌ - 19’ వ్యాప్తిని అడ్డుకోవడానికి మాస్క్‌ పెట్టుకోవడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం లాంటి జాగ్రత్తలను  ప్రజలందరూ పాటిస్తున్నారు. అయితే చేతులు శుభ్రం చేసుకోవడానికి వాడే హ్యాండ్‌ శానిటైజర్లు నకిలీవి, నాసిరకంవి అయితే ఎలా? అందుకే మీ హ్యాండ్‌ శానిటైజర్‌ నాణ్యతను చిన్న పరీక్షల ద్వారా ఇంట్లోనే తెలుసుకోవచ్చు అంటున్నారు ‘టెస్టింగ్‌ ల్యాబ్స్‌ డాట్‌ కామ్‌’ స్థాపకుడు డాక్టర్‌ సౌరభ్‌. అది ఎలా అంటే?


కావలసినవి

టిష్యూపేపర్‌ లేదా టాయ్‌లెట్‌ పేపర్‌, బాల్‌పాయింట్‌ పెన్‌, నాణెం, లేదా శానిటైజర్‌ డబ్బా మూత, గోధుమ పిండి - అరకప్పు, ప్లేటు, గిన్నె, హెయిర్‌ డ్రయ్యర్‌.




టిష్యూపేపర్‌తో టెస్ట్‌

చిన్న టిష్యూపేపర్‌ ముక్కను తీసుకొని టేబుల్‌పైన ఉంచండి. దీనిపైన మూత లేదా నాణెంతో గుండ్రంగా మందపాటి గీతను గీయండి. ఈ వృత్తం మధ్యలో కొన్ని శానిటైజర్‌ చుక్కలు వేయండి. తేమ గీత దాటి రాకుండా ఉండేలా కొద్దిగా వేయండి. లిక్విడ్‌ శానిటైజర్‌ వెంటనే కరిగి తేమ వృత్తాన్ని దాటి విస్తరిస్తుంది. ఇంకు కూడా క్రమంగా కరిగిపోతుంది. అలా జరిగితే మీ శానిటైజర్‌ నాణ్యమైనదని గుర్తు. జెల్‌ శానిటైజర్‌కు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ శానిటైజర్‌లో ఆల్కహాల్‌ శాతం తగినంత లేకపోతే మాత్రం ఇంకు రంగులో కానీ,  స్థానంలో కానీ ఎలాంటి మార్పు ఉండదు. అప్పుడు దాన్ని నాసిరకం, నకిలీ శానిటైజర్‌గా గుర్తించాలి. గీత గీసేందుకు బాల్‌ పాయింట్‌ పెన్‌ మాత్రమే వాడాలి. జెల్‌, ఇంకు పెన్నులు వాడకూడదు. 




గోధుమపిండితో టెస్ట్‌ 

ప్లేట్‌లో ఒక టేబుల్‌ స్పూన్‌ గోధుమపిండి తీసుకోండి. ఏ పిండి అయినా తీసుకోవచ్చు కానీ నీటితో తడిపితే వెంటనే ముద్దగా అవ్వాలి. అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ శానిటైజర్‌ను వేయండి. మరీ ఎక్కువ వేయవద్దు. మెత్తగా పిండిని పిసికి ముద్దగా చేయండి. శానిటైజర్‌లో తగిన పరిమాణంలో ఆల్కహాల్‌ ఉంటే పిండి జిగటగా మారి అతుక్కోదు. క్రమంగా శానిటైజర్‌ ఆవిరైపోయి పొడి మాత్రమే మిగులుతుంది. అదే శానిటైజర్‌లో నీళ్లు ఎక్కువగా ఉంటే పిండి వెంటనే గట్టిపడి ముద్దగా అవుతుంది. శానిటైజర్‌లో ఆల్కహాల్‌ 60 శాతాని కన్నా తగ్గితే ఈ టెస్ట్‌లో సులభంగా తెలిసిపోతుంది.




హెయిర్‌ డ్రయ్యర్‌ టెస్ట్‌

చిన్న గిన్నెలో టేబుల్‌ స్పూన్‌ శానిటైజర్‌ తీసుకోండి. మరోగిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకోండి. ముందుగా హెయిర్‌  డ్రయ్యర్‌ను ఆన్‌ చేసి  కొంచెం హీట్‌ చేయాలి. అప్పుడు దాంతో శానిటైజర్‌ను 30 సెకండ్లపాటు డ్రై చేయండి. అదేవిధంగా నీటిని కూడా డ్రై చేయండి. శానిటైజర్‌లో తగిన పరిమాణంలో ఆల్కహాల్‌ ఉంటే నీటి కన్నా తక్కువ సమయంలో ఆవిరైపోతుంది. ఎందుకంటే నీరు 100 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఆవిరైపోతే, ఆల్కహాల్‌ 76 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఆవిరైపోతుంది. కాబట్టి అది నాణ్యమైన శానిటైజర్‌ అని గుర్తు.

Updated Date - 2020-07-20T05:30:00+05:30 IST