ఆ భయాలేనన్ను వెంటాడేవి

ABN , First Publish Date - 2020-10-19T05:31:48+05:30 IST

కొవిడ్‌ కాలం వైద్యులకు,మరీ ముఖ్యంగా ప్రసవాలు, సిజేరియన్లు చేసే స్త్రీల వైద్యులకు సవాలుగా

ఆ భయాలేనన్ను వెంటాడేవి

కొవిడ్‌ కాలం వైద్యులకు,మరీ ముఖ్యంగా ప్రసవాలు, సిజేరియన్లు చేసే స్త్రీల వైద్యులకు సవాలుగా మారింది. కొవిడ్‌ సోకిన గర్భిణుల నుంచి పుట్టబోయే బిడ్డకు వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం, పసికందులను కంటికి రెప్పలా కాపాడుకోవడం... ఇలా బోలెడంత ఒత్తిడి మధ్య సమర్థంగా బాధ్యతలు నిర్వహించారు డాక్టర్‌ వసుంధర చీపురుపల్లి. ఏకంగా 52 సిజేరియన్లు చేసి కొవిడ్‌ గర్భిణులు, వారి పసిబిడ్డలకు కొత్త జీవితాన్ని అందించిన ఆవిడ నవ్యతో పంచుకున్న అనుభవాలు...


కరోనా వైరస్‌ స్వభావం గురించి ప్రారంభంలో అంతగా అవగాహన ఉండేది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు కూడా అంతంత మాత్రమే! దాంతో కొవిడ్‌ ప్రారంభంలో ఆస్పత్రికి వచ్చే కొవిడ్‌ గర్భిణుల చికిత్స విషయంలో కొంత ఆందోళన ఉండేది. అలా జూన్‌ 21న మొట్టమొదటి కొవిడ్‌ సిజేరియన్‌ సర్జరీ చేశాను. తర్వాత తల్లినీ, బిడ్డనూ ఒకే గదిలో ఆరు అడుగుల దూరం ఉండేలా, ఐసొలేట్‌ చేశాను. ఇద్దరికీ నెగటివ్‌ ఫలితం వచ్చి, పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించాను.


అయితే అప్పట్లో తల్లి పాల నుంచి బిడ్డకు కొవిడ్‌ సోకుతుందేమో అనే భయాలు ఉండేవి. దాంతో తల్లి పాలకు బదులుగా బిడ్డకు మేమే స్వయంగా ఫీడ్‌ ఇచ్చేవాళ్లం. ఆ తర్వాత తల్లి పాల ద్వారా బిడ్డకు వైరస్‌ సోకదని తేలిన తర్వాత తల్లికి మాస్క్‌ తొడిగించి, రొమ్ముపాలు పట్టించి, ఆ తర్వాత బిడ్డను దూరంగా పెట్టడం మొదలుపెట్టాం. ఏదేమైనప్పటికీ కొవిడ్‌ కాలం అటు గర్భిణులకూ, ఇటు మాలాంటి వైద్యులకూ ఓ సవాలుగా మారింది. మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడికి, ఆందోళనకూ లోను చేసింది.


ఉద్విగ్న క్షణాలు బోలెడు!

ప్రసవం తల్లికి పునర్జన్మ! ప్రసవం గురించి గర్భిణులకు ఎన్నో భయాలు ఉంటాయి. వీటికి కరోనా భయం తోడవడంతో గర్భిణులు బెంబేలు పడిపోయేవారు. ప్రసవ సమయం దగ్గర పడుతున్న సమయంలో కొవిడ్‌ సోకిందని తెలియడంతో విపరీతమైన ఒత్తిడికి లోనయ్యేవారు. తమ నుంచి బిడ్డకు సోకుతుందేమో అనే భయంతో పాలు ఇవ్వడానికీ భయపడేవారు. అదే సమయంలో బిడ్డను గుండెలకు హత్తుకోలేకపోతున్నందుకు విలవిల్లాడిపోయేవారు.


అలాంటి సమయంలో వారికి బాసటగా నిలిచి, ఆత్మస్థైర్యం కలిగించడం నా వంతైంది. కొవిడ్‌ పట్ల వారికి ఉన్న భయాలు వదిలించి, బిడ్డకు పాలు ఇచ్చేలా చేయడం, భరోసా కల్పించడం, ఓ పక్క ప్రసవానికి సంబంధించిన చికిత్స, మందులూ అందిస్తూనే, మరో పక్క కొవిడ్‌ చికిత్సనూ ఇప్పించడం... ఇలా రెండు విధాలా తల్లీ బిడ్డా కోలుకునేలా ఎంతో శ్రమపడ్డాను. నిజం చెప్పాలంటే... వారికి ఉన్న భయాలే నన్నూ వెంటాడేవి.

నేనూ 13 నెలల బిడ్డకు తల్లిని. బిడ్డకు ఇంకా పాలిస్తూనే ఉన్నాను. ఇంతమంది కొవిడ్‌ మహిళలతో సన్నిహితంగా గడుపుతూ తిరిగి ఇంటికి వెళ్లాక బిడ్డను ఎత్తుకోవాలంటే భయం వేసేది. ఆ సమయంలో నేను తీసుకున్న జాగ్రత్తల గురించి ఎంతో చెప్పవచ్చు.


అనుక్షణం అప్రమత్తతతో...

ఆస్పత్రిలో కొవిడ్‌ సోకిన గర్భిణుల కేసుల బాధ్యత ఆస్పత్రి యాజమాన్యం నాకు అప్పగించింది. అయితే నా టీమ్‌లో మిగతా వాళ్లందరూ 60 ఏళ్లు పైబడినవాళ్లే. దాంతో నాతో పోల్చుకుంటే కొవిడ్‌ సోకే అవకాశాలు వారికే ఎక్కువ కాబట్టి గర్భిణుల పూర్తి బాధ్యత నేనే తీసుకోవలసి వచ్చింది. అయితే నేను బిడ్డకు పాలిచ్చే దశలోనే ఉన్నాను కాబట్టి మొదట్లో ఎంతో భయపడ్డాను.


అయితే అప్పటికే రొమ్ముపాలు ఇవ్వడం మానేయాలనే ఆలోచనలో ఉండడంతో నా ద్వారా బిడ్డకు కరోనా సోకే వీలు లేకుండా, పాలు మానడానికి అదే సరైన సమయమని భావించి, బిడ్డకు పాలివ్వడం ఆపేశాను. ఆస్పత్రిలో ఉన్నంతసేపూ పిపిఇ సూట్‌లో గడిపేదాన్ని. సర్జరీ సమయంలోనూ ఈ సూట్లు ధరించక తప్పదు. సర్జరీ చేసే సమయంలో ఎంతో అసౌకర్యాన్ని ఎదుర్కొనేదాన్ని. ముఖానికి తగిలించుకున్న షీల్డ్‌ అడ్డుపడుతూ ఉండేది. చేతులు తేలికగా కదిలించే వీలు ఉండేది కాదు.


అయినా సక్సె్‌సఫుల్‌గా సర్జరీలు చేశాను. సర్జరీ ముగిసిన వెంటనే ఆపరేషన్‌ థియేటర్‌కు ఆనుకుని ఉన్న స్నానాలగదిలో స్నానం చేయడం, ప్రతి రెండు గంటలకూ ఆవిరి పట్టడం, ఉప్పు నీటితో నోరు పుక్కిలించడం, ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే ముందు మరోసారి స్నానం చేయడం అలవాటు చేసుకున్నాను. ఇంటికి వెళ్లాక కూడా స్నానం చేసి, చేతులు శానిటైజ్‌ చేసుకున్న తర్వాతే బిడ్డను ఎత్తుకునేదాన్ని. 


మర్చిపోలేని అనుభవం!

కొవిడ్‌ ప్రారంభం నుంచీ ఇప్పటివరకూ మొత్తం 52 కొవిడ్‌ సిజేరియన్‌ సర్జరీలు చేశాను. వేర్వేరు కారణాలతో ప్రతి గర్భిణికీ సిజేరియన్‌నే ఎంచుకోక తప్పలేదు. కొన్ని సాధారణ ప్రసవం చేయదగినవే అయినా కరోనా వైర్‌సతో ఊపిరితిత్తుల మీద ఒత్తిడి ఉంటుంది కాబట్టి, ప్రసవ సమయంలో రెట్టింపయ్యే ఒత్తిడిని తట్టుకోగలరో లేదో అనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్‌నే ఎంచుకునేదాన్ని.

అలాగే కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం వెంటిలేటర్‌ మీదకు వెళ్లిన వాళ్లకు సిజేరియన్‌ చేయడం ఒక్కటే మార్గం. ఇలాంటి వారిలో ఒక కేసును ఎప్పటికీ మర్చిపోలేను. కరోనాతో 32 వారాల గర్భిణి మా ఆస్పత్రిలో చేరింది. కరోనా చికిత్సతో పరిస్థితి అదుపులోకి తెచ్చి, ఆ తర్వాత ప్రసవం చేద్దామనుకుంటే అలా వీలు పడకపోగా, ఆమె పరిస్థితి మరింత విషమించి వెంటిలేటర్‌ అమర్చవలసి వచ్చింది. అలా వెంటిలేటర్‌ మీద ఉంచే సిజేరియన్‌ చేశాను.

సర్జరీ తర్వాత మరో ఐదు ఆరు రోజుల పాటు వెంటిలేటర్‌ మీద ఉన్న ఆ మహిళ మూడు వారాల్లో పూర్తిగా కోలుకుని బిడ్డతో ఇంటికి వెళ్లిపోయింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. ఇలా కరోనా నుంచి, సర్జరీ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికెళ్లినవాళ్లు, తిరిగి రివ్యూల కోసం వచ్చి నన్ను కలుస్తున్నప్పుడు వాళ్లను చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటాను.


కేర్‌ టేకర్ల కొరత!

ప్రసవం జరిగినా, సిజేరియన్‌ జరిగినా బిడ్డనూ, తల్లినీ దగ్గరుండి చూసుకునే కేర్‌ టేకర్ల కొరత కొవిడ్‌ సమయంలో అందరికీ ఇబ్బందిని కలిగించింది. గర్భిణి తల్లి, లేదా అత్తగారు.... సాధారణంగా వీళ్లే కేర్‌ టేకర్లుగా ఉంటూ ఉంటారు. అయితే వీళ్లు 60 ఏళ్లు పైబడిన వాళ్లు కావడంతో కొవిడ్‌ భయంతో వెంట ఆస్పత్రికి వచ్చి, తల్లీబిడ్డల బాగోగులు చూసుకోలేని పరిస్థితి. భర్త ఉన్నా, పసికందులతో ఎలా మెలగాలో వాళ్లకు అవగాహన ఉండదు.

దాంతో తల్లీబిడ్డల బాగోగుల విషయంలో వైద్యురాలిగా నాకు కొంత ఆందోళన ఉండేది. నర్సులు వారి బాగోగులు చూసుకుంటూ ఉన్నా, ప్రత్యక్షంగా చూడనిదే నా మనసు శాంతించేది కాదు. దాంతో రోజులో రెండు నుంచి మూడు సార్లు రౌండ్స్‌కు వెళ్లి తల్లీబిడ్డలను గమనించేదాన్ని!


అతి పిన్నవయసు రోబోటిక్‌ సర్జన్‌ నేనే!

నేను ఆంధ్రా మెడికల్‌ కాలేజి స్టూడెంట్‌ను. పుట్టింది, పెరిగిందీ వైజాగ్‌లోనే! తర్వాత కర్నూలు మెడికల్‌ కాలేజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌, కొచ్చిలో రోబోటిక్స్‌ పరీక్ష రాశాను. హైదరాబాద్‌లో అతి పిన్న వయసు రోబోటిక్‌ సర్జన్‌ నేనే! మా వారు డాక్టర్‌ బాలమురళీకృష్ణ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌. మాకు ఇద్దరు పిల్లలు. పెద్ద బాబుకు తొమ్మిదేళ్లు. చిన్నవాడికి 17 నెలలు.

 గోగుమళ్ల కవిత

Updated Date - 2020-10-19T05:31:48+05:30 IST