సెల్‌ఫోన్‌నూ శుభ్రపరచాల్సిందే

ABN , First Publish Date - 2020-03-25T06:26:26+05:30 IST

ఎవరి చేతిలో చూసినా సెల్‌ఫోన్‌. పెద్ద, చిన్నా తేడాలేదు. లాక్‌డౌన్‌తో ఇది మరింత పెరిగింది. మనం నిత్యం వాడే ఫోన్‌ వెలుపలి భాగం అనేక క్రిముల మయం. వాస్తవానికి మన చేతుల కంటే ఫోనే ముఖానికి ఎక్కువగా తాకుతుంటుంది.

సెల్‌ఫోన్‌నూ శుభ్రపరచాల్సిందే

ఎవరి చేతిలో చూసినా సెల్‌ఫోన్‌. పెద్ద, చిన్నా తేడాలేదు. లాక్‌డౌన్‌తో ఇది మరింత పెరిగింది.  మనం నిత్యం వాడే ఫోన్‌ వెలుపలి భాగం అనేక క్రిముల మయం. వాస్తవానికి మన చేతుల కంటే ఫోనే ముఖానికి ఎక్కువగా తాకుతుంటుంది. దీనివల్ల క్రిములు తేలిగ్గా మన నుంచి ఫోన్‌కు చేరతాయి.  అందువల్ల మీ ఫోన్‌ శుభ్రంగా లేకపోతే ఎన్నిసార్లు శుభ్రంగా చేతులు కడుక్కొన్నా, శానిటైజర్లు వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం జబ్బులకు ఆస్కారం ఇవ్వకుండా ఉండాలి. అందుకే తరచుగా చేతులతోపాటు ఫోన్‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిందే. ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్‌తో ఫోన్‌ను శుభ్రపరచుకుంటే చాలావరకు క్రిములు చనిపోయే అవకాశం ఉంది.


యాపిల్‌ ఐఫోన్‌ 7, దాని తర్వాత వచ్చిన అడ్వాన్స్‌డ్‌ వెర్షన్లు వాటర్‌ ప్రూఫ్‌ టెక్నాలజీతో ఉంటాయి. అంతేగాక దాదాపు అందరూ ఫోన్‌కు ఏదో ఒక కవర్‌ వాడుతుంటారు. అందువల్ల వీటిని శుభ్రపరచుకోవడం తేలిక. దీనికోసం సబ్బునీటిని, మనం కళ్లజోడు అద్దాలు శుభ్రపరచుకోవడానికి వాడే మెత్తటి వస్త్రాన్ని వాడొచ్చని యాపిల్‌ కంపెనీ సూచిస్తోంది. ఇతర కంపెనీల ఫోన్‌లు పూర్తిగా వాటర్‌ ప్రూఫ్‌ కావు. అందువల్ల ఫోన్‌ డిస్‌ప్లే, వెనుక భాగాలను తడి వస్త్రంతో జాగ్రత్తగా శుభ్రపరచుకోవచ్చు.


ఫోన్‌ శుభ్రం చేయడానికి ఎలాంటి రసాయన ద్రవాలు వాడొద్దని యాపిల్‌, శాంసంగ్‌ కంపెనీలు సూచిస్తున్నాయి. రసాయనాల వల్ల స్ర్కీన్‌ కోటింగ్‌ దెబ్బతిని టచ్‌ ఫీచర్‌ డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఫింగర్‌ ప్రింటింగ్‌ సెన్సార్‌ ఫోన్లు శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్‌ వస్త్రాన్ని వాడొచ్చు. ఎక్కువగా కాల్స్‌ చేసేవాళ్లు హెడ్‌ఫోన్స్‌, బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్‌ వాడటం మంచిది. దీనివల్ల ఫోన్‌ మీద ఉండే క్రిములు మొహానికి చేరే అవకాశం తక్కువ. అయితే హెడ్‌ఫోన్స్‌, బ్లూటూత్‌ కూడా శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి.

Updated Date - 2020-03-25T06:26:26+05:30 IST