ఇది సెలబ్రిటీ జిమ్‌!

ABN , First Publish Date - 2020-05-30T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌తో జిమ్‌లు మూతపడడంతో ఇళ్లనే వ్యాయామశాలల్లా మార్చేసుకున్నారు కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు.

ఇది సెలబ్రిటీ జిమ్‌!

లాక్‌డౌన్‌తో జిమ్‌లు మూతపడడంతో ఇళ్లనే వ్యాయామశాలల్లా మార్చేసుకున్నారు కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు. బద్ధకాన్ని దరిచేరనివ్వకుండా ప్రతిరోజూ వ్యాయామాలతో చెమటలు కక్కుతున్న ఆ నటులు చెబుతున్న ఇంటి జిమ్‌ విశేషాలు...


ఫైటర్‌ అమితాబ్‌ బచ్చన్‌

డెబ్బయేడేళ్ల సీనియర్‌ బచ్చన్‌కు వయసు అనేది ఓ సంఖ్య మాత్రమే! లాక్‌డౌన్‌లో సైతం ఈ షెహెన్‌షా వ్యాయామాలతో శరీరాన్ని చురుగ్గా ఉంచుతున్నారు. ఈమధ్య ఆయన తన హోమ్‌ జిమ్‌ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోలో ఆయన వెనక ట్రెడ్‌మిల్స్‌తో పాటు డంబెల్స్‌, వెయిట్స్‌ ఇతరత్రా జిమ్‌ సామగ్రి కనిపిస్తోంది. అమితాబ్‌ తన పోస్ట్‌లో... ‘‘వ్యాయామాలను కొనసాగించండి... రోగనిరోధకశక్తిని పెంచుకోండి... ఫైట్‌... ఫైట్‌... ఫైట్‌!’’ అంటూ సందేశం ఇవ్వడం విశేషం!
నాన్నతో... ప్రేమతో... హృతిక్‌ రోషన్‌!

హృతిక్‌ రోషన్‌ తన గ్రీకు శిల్ప సౌందర్యం కోసం ఫిట్‌నెస్‌ చెడకుండా చూసుకుంటారు. అందుకే హోమ్‌ జిమ్‌లో చెమటలు కక్కుతూ ఉంటారాయన. వర్కవుట్‌ తర్వాత అదే జిమ్‌లో పెంపుడు కుక్క జేన్‌తో ఆటలాడుతూ ఉన్న ఓ ఫోటోను షేర్‌ చేశారు. దాంతో పాటు గత ఏడాది కేన్సర్‌తో పోరాడి జయించిన తన తండ్రి 71 ఏళ్ల రాకేష్‌ రోషన్‌ సమాచారం అందించారు. ఆయన ప్రతి రోజూ రెండు గంటల పాటు వర్కవుట్స్‌ చేస్తారని చెబుతూ తండ్రి వర్కవుట్‌ వీడియోనూ పోస్ట్‌ చేశారు హృతిక్‌.


మిస్టర్‌ హోమ్‌ అనిల్‌ కపూర్‌

ట్రైనర్‌ రాలేదనే సాకుతో వర్కవుట్‌కు టాటా చెప్పే సెలబ్రిటీలు ఉంటారు. అనిల్‌ కపూర్‌ కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే ఈ ‘మిస్టర్‌ ఇండియా’ ఫేమ్‌ హోమ్‌ జిమ్‌లో సైకిల్‌ తొక్కుతున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాని అడుగున... ‘‘కదులుతూ ఉందాం! ఇంట్లోనే ట్రైనర్‌ ఉంటే, వ్యాయామం మిస్‌ అయ్యే అవకాశమే ఉండదు నాకు’’ అంటూ క్యాప్షన్‌ రాశారు.
జోష్‌తో విక్కీ కౌశల్‌

లాక్‌డౌన్‌ సమయాన్ని ఇంట్లో బోర్‌గా కాకుండా, జోష్‌తో హుషారుగా గడిపేస్తున్నారు విక్కీ! ఆమ్లెట్లు తిరగేయడం, సీలింగ్‌ ఫ్యాన్ల దుమ్ము దులపడం లాంటి పనులతో పాటు ‘కొవిడ్‌ - 19’ నుంచి కాపాడుకొనే పద్ధతులనూ పాటిస్తున్నారు. ఇందుకోసం క్రమం తప్పకుండా ఇంట్లోనే వ్యాయామాలు సాధన చేస్తున్నారు.Updated Date - 2020-05-30T05:30:00+05:30 IST