బాధకు బైబై... హ్యాపీకి హాయ్ హాయ్!
ABN , First Publish Date - 2020-12-27T18:32:05+05:30 IST
ఇలాంటి 2020 ఏడాదిని జీవితంలో చూసుండం. అందర్నీ ట్వంటీట్వంటీలా ఆడుకుంది కరోనా.

ఇలాంటి 2020 ఏడాదిని జీవితంలో చూసుండం. అందర్నీ ట్వంటీట్వంటీలా ఆడుకుంది కరోనా. అయితే చెడులో కూడా మంచిని వెతుక్కునే ఆశాజీవులం. మహమ్మారి మూలంగా జీవితం అల్లకల్లోలం అయ్యుండొచ్చు. కానీ అవసరానికి మించి పరిగెడుతున్న ప్రపంచం మాత్రం కాసేపు ఆగింది. ఆత్మావలోకనం చేసుకుంటోంది. తప్పులను సరిదిద్దుకుంటోంది. ఆస్తులు.. అంతస్థులు.. కులాలు.. మతాలు... మనుషుల్ని మనుషులకు దూరం చేశాయి. ఇప్పుడు మరణ భయం మళ్లీ అందర్నీ తాత్కాలికంగానైనా ఒక్కటి చేసింది. అవును... కరోనా తరువాత మనమంతా, మనకు తెలియకుండానే కొంతైనా మారిపోయాం. కుటుంబాన్ని మరింత ఇష్టంగా హత్తుకున్నాం. బంధువులు, స్నేహితులతో బలపడ్డాం. వికృతమైన తిండిని తగ్గించి ప్రకృతి ఆహారంవైపు మళ్లాం. మునుపెన్నడూ లేని ఆరోగ్య స్పృహ వచ్చింది. విచ్చలవిడి వినియోగ మనస్తత్వాన్ని తగ్గించి .. పొదుపు బాట పట్టాం. సవాలక్ష సమస్యలకు సాంకేతికతను మార్గంగా ఎంచుకున్నాం. మానవత్వాన్ని బతికించాం. ఈ అనుభవాలతోనే వచ్చే ఏడాది మరిన్ని మార్పులతో ముందుకెళదాం...
ఆరోగ్య యోగం..
థర్మామీటర్ తెలియడానికి దశాబ్ధాలు పట్టింది. కరోనా పుణ్యాన - ఆర్నెళ్లలో ఆక్సీమీటర్ ఇంటికి వచ్చేసింది. ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేసినా రాని ఆరోగ్యస్పృహను కరోనా కాలంలో వచ్చింది. నిరక్షరాస్యుల్లో సైతం ఆరోగ్యఅక్షరాస్యత విస్తరించింది. ఒక రకంగా ఇది పాజిటివ్. శానిటైజర్లు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్, సీటీస్కాన్, ఇమ్యూనిటీ, ఐసొలేషన్... ఈ పదాలన్నీ అందరి నోళ్లలో నానుతున్నాయి. పాత తరానికి కలరా, మశూచి, మలేరియాల నుంచీ గట్టెక్కిన అనుభవాలు రాటుదేలేలా చేశాయి. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. ఉత్పాతాలు వస్తుంటాయనే కొత్త అనుభవం వచ్చిందీ తరానికి. ఆ మాటకొస్తే గుండె ఆరోగ్యాన్ని పరీక్షించే ఈసీజీ ఎత్తుపల్లాలను సూచిస్తుంది. ప్రాణం లేని జీవికే ఆ గ్రాఫ్ ఫ్లాట్‌గా కనిపిస్తుంది. కష్టకాలంలో గుండెనిబ్బరంతో సాగేందుకు హృదయ స్పందనల రేఖలే పాఠాలు. కరోనా ఇలాగే శాశ్వతంగా ఉండిపోదు. పాజిటివ్ కేసులు పోయి పాజిటివ్ జీవితం మన చేతికి తప్పక వస్తుంది. అంతవరకు మనం చేయాల్సింది... ఇమ్యూనిటీని ఇలాగే కొనసాగించడం. పరిశుభ్రంగా ఉండటం. మానసిక ప్రశాంతతతో జీవించడం. అన్నిటికంటే ముఖ్యమైన వ్యాయామాన్ని మరిచిపోకూడదు. ఆరోగ్యరక్షణకు ఆరోగ్యబీమాను తప్పక చేయాలి. మానసిక భయాలను తగ్గించుకోవాలి. ఇవన్నీ చెప్పినంత సులభం కాదు. సాధనతోనే సాధ్యం అవుతాయి. ఇప్పుడా మార్పుకు సమయం వచ్చింది. ‘ఆదా ఖానా కావో.. డబుల్ పానీ పీవో.. తీన్ గుణ కసరత్ కరో.. చార్ గుణ హసో.. సౌ సాల్ జియో..!’. తరాలు మారినా తరగని ఆరోగ్యసంపద ఈ వాక్యాల్లో ఇమిడి ఉంది.

పొదుపే మంత్రం
మంచి జీతం, అలవెన్సులు, బోనస్‌లు, ప్రోత్సాహకాలు... రాజులా బతికినోళ్లను పేదల్లా మార్చేసింది మహమ్మారి. వేతనాల్లో కోతలు, ఉద్యోగాల తొలగింపు, కాస్ట్‌కటింగ్... హఠాత్తుగా వచ్చిన ఉత్పాతాలు. అద్దెలు, ఈఎంఐలు, స్కూలు ఫీజులు, ఇన్య్సూరెన్స్‌లు కట్టుకోలేని పరిస్థితుల్లో.. పిడుగులా పడింది ఖరీదైన కరోనా వైద్యం. వ్యాధి సోకి ఆస్పత్రిలో చేరితే బిల్లు ఎంతవుతుందో ఎవ్వరికీ తెలీదు.ఆపత్కాలంలో చేతిలో డబ్బులు లేకపోతే ప్రాణం నిలుపుకోవడం కష్టం. ఈ స్థితిని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు మేల్కొందాం. రేపటి కష్టాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తమవుదాం. ముందుచూపుతో పొదుపు చేద్దాం. ఎంత సంపాదన అయినా సరే... అందులో ఇరవై శాతం రేపటి అవసరాలకు దాచుకోవాల్సిందే!. డబ్బులున్నప్పుడు ఆడంబరం... కష్టం వచ్చినప్పుడు ఆర్థికప్రణాళిక... మన భారతీయుల రక్తంలోనే ఉంది. కరోనా నష్ట కాలంలో గత ఏడాదికంటే ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో పొదుపు చేయడమే అందుకు నిదర్శనం. ఇలాగే ముందుకెళితే ఆర్థిక భద్రతకు ఢోకా ఉండదు. అయితే నేడున్న వినియోగ లోకంలో - ఏది కొనాలన్నా అవసరమా? అత్యవసరమా? అనే ప్రశ్న వేసుకోవాలి. ఈఎంఐలలో కొనడం మంచిదే కానీ, వాటి ట్రాప్‌లో పడకూడదు. క్రెడిట్‌కార్డులను సమయోచితంగా వాడుతూ సమయానికి చెల్లింపులు జరిపినప్పుడే ఉపయోగం. పొదుపు పద్ధతుల్లో కూడా సృజనాత్మక పాటించేందుకు పాత ఆంగ్ల సామెతను మళ్లీ గుర్తు చేసుకుందాం.. ‘డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్’. దాచుకున్న సొమ్మును ఒకే చోట కాకుండా.. వైవిధ్య మార్గాల్లో పొదుపు చేయాలి.

ఇల్లే థియేటర్..
సగటు జీవులకు సినిమాకంటే చౌక వినోదం ఇంకేముంటుంది? ఇంట్లో వాళ్లంతా కలిసి సినిమాకు వెళితే ఆ ఆనందమే వేరు. వరుస సీట్లలో కూర్చుని పాప్‌కార్న్ పంచుకుంటూ ... సమోసాలు తింటూ తిలకించడం ఒక అనుభూతి. ఇప్పుడింకా పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకోలేదు. కరోనా కనుమరుగైపోతే తప్ప స్వేచ్ఛగా వెళ్లి సినిమాలను చూడలేని పరిస్థితి. అంతవరకు ఇల్లే థియేటర్. కుటుంబ సభ్యులే తోటి ప్రేక్షకులు. అయితే - తండ్రి బాల్కనీలో కూర్చుని సెల్‌ఫోన్‌లో జబర్దస్త్ చూస్తుంటే, కొడుకు స్టడీరూమ్‌లో ల్యాప్‌టాప్ ముందేసుకుని వెబ్‌సీరిస్ చూస్తుంటాడు. ఇక, తల్లి టీవీలో కార్తీకదీపం, కూతురు మరో గదిలో క్యాండీక్రష్ గేమ్ ఆడుతుంటుంది. అందరూ కలిసి కనీసం వారానికి ఒకసారైనా టీవీలో మంచి సినిమా చూస్తే... ఇల్లే థియేటర్ అవుతుంది కానీ... ఇలా ఎవరికివారు విడిగా చూస్తే అడిక్షన్‌కు దారి తీస్తుంది. కుటుంబ బంధాలను బలోపేతం చేసే వినోదం పాత్ర సన్నగిల్లుతుంది. ఇంట్లో వాళ్లందరూ కూడబలుక్కుని ఒక ఆదివారమైనా గాడ్జెట్స్ ముట్టకుండా ... టీవీలో ఒక సినిమా చూస్తే... కలిసి చూశామన్న అనుభూతి దక్కుతుంది. అది థియేటర్‌కు వెళ్లిన ఆనందాన్నే కలిగిస్తుంది. ఇంట్లోనే వేడివేడి పకోడీలు, పాప్‌కార్న్ చేసుకుని... స్నాక్స్‌తో పాటు సంతోషాన్ని కలిసి పంచుకుంటే.. ఒక కొత్త అనుభూతి సొంతం అవుతుంది. మనకు ఇష్టమైన ఆత్మీయులతో సంతోషాన్ని పంచుకోవడం వల్ల ఆనందహార్మోన్లు మూడురెట్లు ఉత్పత్తి అవుతాయట. ఇలాంటి కరోనా కష్టకాలంలో వినోదానికి ఇంతకంటే ప్రత్యామ్నాయం మరొకటి ఉండదు కదా!.

బంధమే బలం
చిరంజీవి చేపల కూర వండారు.. రష్మిక పాన్ కేక్ చేసింది.. ఇలా సినిమాల్లో అనేకసార్లు వంటలు చేసుండొచ్చు. కానీ, సోషల్‌మీడియాలో వాళ్లు చేసిన సందడి చూశాక అభిమానుల కడుపునిండిపోయింది. సినిమాల్లో వండితే అది నటన... వంటింట్లో వండితే అది జీవితం. మనందరికీ సామాజిక, కుటుంబ జీవితమంటే ఎంతో ప్రేమ. అందుకే అలాంటి జీవన దృశ్యాలు అపురూపంగా అనిపిస్తాయి.హమ్ ఆప్‌కే హై కౌన్, మైనే ప్యార్ కియా, నిన్నేపెళ్లాడతా, శతమానంభవతి... ఇవన్నీ ఇప్పటికీ ఎందుకు నచ్చుతాయంటే... కుటుంబ భావోద్వేగాలకు పట్టం కట్టాయి కనుక!. ఇంత విలువైన ఫ్యామిలీ రిలేషన్స్‌ను మరింత బలోపేతం చేసుకునే అవకాశం వచ్చింది కరోనా కాలంలో. లేకపోతే దుమ్ముపట్టిన పాత క్యారంబోర్డును, అటకెక్కిన చెస్ బోర్డును కిందికి దింపేవాళ్లం కాదు కదా!. ఇంటిల్లిపాదీ కలిసి ఆడే ఇండోర్‌గేమ్స్‌కు మళ్లీ మంచికాలం వచ్చింది. కలిసి ఆడినప్పుడు... పిల్లల మేథోసామర్థ్యం, పెద్దల ఓర్పునేర్పు ఇద్దరికీ అర్థం అవుతుంది. ఆటలు అనుబంధాలను పెంచుతాయి. ఇప్పటికే చాలామంది రక్తసంబంధీకుల పిల్లలందర్నీ పోగుచేసి గ్రూప్‌లుగా ఏర్పరిచి, జూమ్‌కాల్స్‌తో ఆన్‌లైన్ ఆటలు ఆడిస్తున్నారు. కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు. పెద్దలకు కూడా ఇదొక పెద్ద కాలక్షేపం. ఇదివరకు అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్ల పిల్లల పేర్లు ఒకరికొకరివి తెలిసేవి కావు. ఇప్పుడు కనీసం పరిచయం ఏర్పడింది. రేపు స్నేహం.. ఆ తరువాత బంధం చిగురిస్తుంది.

మానవత్వమే మన మతం..
స్కూలు ఫీజులు కట్టకపోవడం వల్ల పిల్లలను ఆన్‌లైన్ క్లాసుల నుంచి తొలగిస్తే ... ఆ తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది? మూడు నెలలు కిరాయికట్టేందుకు డబ్బుల్లేక అడగనివారినల్లా అప్పులు అడుగుతూపోవడం ఎంత నరకం? ఆ పరిస్థితులు ఇతరులకే కాదు. రేప్పొద్దున మనకూ రావొచ్చు. మొన్న లాక్‌డౌన్‌లో ఇలాంటి విషాద వార్తలెన్నో మన చుట్టూ కనిపించాయి. మనతో నిత్యం కష్టసుఖాలను పంచుకునే మిత్రులకు కష్టం వస్తే తప్పక స్పందించాలి. సోనూసూద్‌లా లక్షలు సహాయం చేయలేకపోవచ్చు. వాట్సాప్ గ్రూప్‌లలోని ఆత్మీయులంతా కలిసి తలా ఒక చెయ్యివేస్తే... కష్టంలోని మిత్రుల దుఃఖభారాన్ని తగ్గించవచ్చు. ఆ చిన్న సహాయమే కొండంత ఊరటనిస్తుంది. రేపటిపై ఆశను కలిగిస్తుంది. మానవత్వం మనుషుల్ని బతికిస్తుంది... మనసుల్ని వెలిగిస్తుంది. మనల్ని చూసి మన పిల్లలు వెయ్యి పుస్తకాలను చదివినా నేర్చుకోలేని గుణాన్ని నేర్చుకుంటారు. గివింగ్ నేచర్ అలవడుతుంది. భవిష్యత్తులో ఆ మానవీయ విలువ వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది. వ్యక్తిగత జీవితంలో కూడా తోటి మనిషిని అర్థం చేసుకునే తత్వం అబ్బుతుంది. ఇతరులకు సహాయం చేయడమంటే మనలోని మంచితనాన్ని మరిచిపోకుండా కాపాడుకోవడం. ప్రపంచ కుబేరులు సైతం ఎన్నడూ చేయనంత సహాయం చేశారిప్పుడు. వేల కోట్ల ధనాన్ని ప్రజలకు అందించారు. కరోనాతో పెరిగిన హ్యుమానిటీ ఇండెక్స్ వచ్చే ఏడాదీ మరింత పైకి వెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ మానవీయ కోణాన్ని ఇలాగే కొనసాగిద్దాం.

గురూజీ.. టెక్నాలజీ
జూమ్, వెబినార్, గూగుల్ మీట్, స్కైప్.. స్కూళ్లు లేని రోజుల్లో ఇవే స్కూళ్లు. తాకితే వచ్చే జబ్బును తప్పించుకునేందుకు నగదురహిత చెల్లింపులకు.. పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే.. ఇవే గల్లీ బ్యాంకులు అయ్యాయి. సామాజిక దూరం తప్పనిసరైన సమయంలో.. టెక్నాలజీ లేకపోతే పనులు చక్కబెట్టుకోవడం కష్టంగా మారేది. కరోనా కాలంలో సాంకేతికతను వినియోగించిన వాళ్ల జీవన వ్యవహారం సులువైంది. టెక్నాలజీతో అప్‌డేట్ కాకపోతే బతుకు భారం అవుతుంది. 5జీ కాలంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఇంకా ఫ్లాపీలు, డిస్కులు, పెన్‌డ్రైవ్‌ల దగ్గరే ఆగిపోతే వెనకబడిపోతాం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోలేని వాళ్లలో బిడియం, ఆత్మన్యూనత ఆవహిస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్, టికెట్ బుకింగ్, ఫుడ్ డెలివరీ, బ్యాంక్ లావాదేవీలు, బిల్లుల చెల్లింపు.. ఇవన్నీ ఫోన్‌లో సులువుగా చేసే పరిజ్ఙానం అత్యవసరం. ఇక కొత్త తరంతో కనెక్ట్ అయ్యేందుకు వారధిగా నిలిపేదీ టెక్నాలజీనే!. ఇంట్లోని పిల్లలు - రేపు రానున్న ఆపిల్ మడతపెట్టే ఫోన్ గురించో, పాపులర్ లూడోగేమ్ గురించో, క్రెడిట్‌కార్డు చెల్లింపుల యాప్ క్రెడ్ గురించో ముచ్చటిస్తున్నప్పుడు.. వాళ్లతో జత కలవాలంటే ఈ తరహా పరిజ్ఞానం తెలిసుండాలి. ఈ వయసులో అలాంటివి మాకెందుకులే అనుకుంటే... తరంతో అంతరం పెరుగుతుంది. మహమ్మారులతో సామాజిక జీవనం స్థంభించిపోయినప్పుడు... టెక్నాలజీ అవసరం తెలిసివస్తుంది. కాబట్టి అప్‌డేట్... ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆపత్కాలంలో ఆదుకుంటుంది.

ఇది వరకు ఆరోగ్య బీమాను పన్ను మినహాయింపు పాలసీగానే చూసేవాళ్లు. ఆ అభిప్రాయాన్ని మార్చిపడేసింది కరోనా. కొత్తగా పాలసీలను తీసుకుంటున్న వాళ్ల సంఖ్య ఇరవై నుంచీ ముప్పయి రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. ప్రతి ఒక్కరికీ హెల్త్ పాలసీ ఉండాలి.
ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ చేయడానికే తంటాలుపడే సాధారణ గృహిణి సైతం... ఇప్పుడు జూమ్ కాల్‌లో జరిగే పేరెంట్స్ మీట్‌కు హాజరై... పిల్లల చదువును ఆరా తీస్తోంది. సామాన్యులలో డిజిటల్ అక్షరాస్యత ఈ స్థాయికి చేరుకోవడానికి పదేళ్లు పట్టేది.
సరిగ్గా ఓనమాలే రాని పిల్లలు ల్యాప్‌టాప్ ఆన్‌చేసి... స్కూల్ నుంచి వచ్చిన లింక్‌ను క్లిక్‌చేసి.. ఆన్‌లైన్ క్లాస్‌కు హాజరై.. హాయ్ టీచర్ అంటున్నారు. జూమ్ యాప్‌లో తల్లిదండ్రులకే తెలియని ఫీచర్లను పిల్లలు చెబుతున్నారు. మారుమూల పల్లెల్లో ఆన్‌లైన్ క్లాసుల వల్ల ఇంటర్‌నెట్ వాడకం పదింతలు పెరిగింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ‘చేతుల పరిశుభ్రత’పై చైతన్యం తీసుకురాలేక చేతులు ఎత్తేసింది. కరోనా కళ్లెర్రచేయగానే ప్రపంచమంతా 2020 ని హ్యాండ్‌వాష్ సంవత్సరంగా అనుసరిస్తోంది. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకుంటే... కరోనానే కాదు... కనీసం మరో యాభై ఇతర రోగాలు రావట. మన దేశంలో ఈ మరణాలతో పోలిస్తే కరోనా చావులు తక్కువే!.
అభిమానతారలు సీసాలు పట్టుకుని శీతల పానీయాలు తాగమన్నా సరే... కరోనాతో అటువైపు కన్నెత్తి చూడటం లేదు కుర్రకారు. కూల్‌డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివి కాదని, ఎందరు చెప్పినా వినని మనం... ఒక అంటువ్యాధి భయపెడితే కానీ అర్థం కాలేదు. వాటి అమ్మకాలు ఎన్నడూ లేనంత పడిపోయాయి.
పొగతాగడం, గుట్కా, ఖైనీ, తంబాకు.. ఆరోగ్యానికి హానికరం అంటూ థియేటర్లలో వచ్చే ప్రకటనలు ఆలోచింపజేయడం కంటే.. అవహేళనకే గురయ్యేవి. కరోనా ఊపిరితిత్తులపైనే దాడి చేస్తుంది కాబట్టి.. ఇరవై శాతం మంది పొగ తాగడం మానేశారు.
మాస్కుతో మాయదారి కరోనా ఒక్కటే కాదు... మనకు కనిపించని కాలుష్యకారక జబ్బులన్నీ తగ్గుముఖం పడుతున్నాయి. ఊపిరితిత్తులు, ఉబ్బసం, ఆస్మా, బ్రాంకైటిస్... వీటికి మందులకంటే మాస్కులు ఎక్కువ ఉపశమనం కలిగిస్తున్నాయి.
సూర్యరశ్మి తగలని జీవనశైలి వల్ల విటమిన్ డి లోపం తలెత్తుతోంది. వీరిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో... ఆరుబయట ఎండలో నడిచే అలవాటు పెరిగింది. దీనివల్ల విటమిన్ డి లోపం వచ్చే మరో పది రకాల జబ్బుల నుంచీ బయటపడొచ్చు.