టాలీవుడ్‌లో సినిమాల ట్రైలర్స్ కట్ చేసేది ఈయనే..!
ABN , First Publish Date - 2020-12-06T05:43:22+05:30 IST
రామాయణాన్ని- కట్టె.. కొట్టే.. తెచ్చే.. అని మూడు ముక్కల్లో చెప్పచ్చు. కానీ రెండున్నర గంటల సినిమాని రెండు నిమిషాల్లో చెప్పాలంటే.. అంత ఈజీ కాదు. ఆ కళలో నిష్ణాతుడు భాస్కర్. అందుకే అందరూ ఆయనను ‘ప్రోమో భాస్కర్’ అంటారు...

రామాయణాన్ని- కట్టె.. కొట్టే.. తెచ్చే.. అని మూడు ముక్కల్లో చెప్పచ్చు. కానీ రెండున్నర గంటల సినిమాని రెండు నిమిషాల్లో చెప్పాలంటే.. అంత ఈజీ కాదు. ఆ కళలో నిష్ణాతుడు భాస్కర్. అందుకే అందరూ ఆయనను ‘ప్రోమో భాస్కర్’ అంటారు. సుమారు 600లకు పైగా సినిమాలకు ట్రైలర్స్‌ను రూపొందించిన భాస్కర్ గురించి ప్రేక్షకులకే కాదు.. సినీ పరిశ్రమలో వారికి కూడా ఎక్కువ తెలియదు. ప్రతి రోజూ మనం చూసే ట్రైలర్ల వెనకున్న కథ గురించి భాస్కర్ నవ్యకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదే ఆయన తొలి ఇంటర్వ్యూ కావడం విశేషం..
ఈ రెండు దశాబ్దాల్లో మీరు పాఠకులు లేదా ప్రేక్షకుల ముందుకు ఎందుకు రాలేదు?
మనిషి కన్నా అతను చేసే పనికి ఎక్కువ పేరు రావాలని నేను నమ్ముతా! నా పనిని సినిమా పరిశ్రమ గుర్తించింది. ఏడాదికి 35 సినిమాలకు ట్రైలర్స్ చేస్తా. ఒక్క రోజూ కూడా ఖాళీ ఉండదు. నేను చేసే ట్రైలర్స్‌ను చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు. థియేటర్లకు వస్తున్నారు. అంతకన్నా ఏం కావాలి? ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్లను. అందుకే నా గురించి ఎవరికీ తెలియదు.
అసలు ట్రైలర్ కథ ఎలా మొదలయింది?
ఒకప్పుడు.. అంటే టీవీలు లేనప్పుడు ట్రైలర్స్‌ను థియేటర్‌లోనే ప్రదర్శించేవారు. ఆ సమయంలో మూడు నిమిషాల ట్రైలర్స్ ఉండేవి. వాటిని కూడా ఎడిటర్సే చేసేవారు. ఒక సినిమాలోని కథ.. భావోద్వేగాలు.. పాటలు.. ఫైట్స్.. అన్నీ ఆ ట్రైలర్‌లో వచ్చేయాలి. దానిని చూసిన తర్వాత ప్రేక్షకుడు- ఆ సినిమా ఎప్పుడు చూస్తామా.. అని ఎదురుచూడాలి. ఇలా చాలా కాలం సాగింది. ఎప్పుడైతే టీవీ ఛానళ్ల యుగం ప్రారంభమయిందో.. ప్రేక్షకులను సినిమా థియేటర్ల వైపు తీసుకువెళ్లటానికి.. టీవీ ట్రైలర్స్ చేయటం మొదలుపెట్టారు. నేను దాదాపుగా ఆ సమయంలో ఇండస్ట్రీలోకి వచ్చా. మొదట్లో టీవీల్లో వచ్చే ట్రైలర్స్ 30 సెకన్లే ఉండేవి. వాటిని బయోస్కోప్, టాలీవుడ్ టైమ్ లాంటి ప్రోగ్రాముల్లో ప్రదర్శించేవారు. ఈ ట్రైలర్స్‌ను చూసి ప్రేక్షకులు సినిమాలకు వస్తారని నిర్మాతలు, డైరక్టర్లు భావించారో.. అప్పటి నుంచి ట్రైలర్ల జోరు ప్రారంభమయింది.
ట్రైలర్‌ను కట్ చేయటం వెనకున్న శ్రమ ఏమిటి?
ట్రైలర్ కట్ చేయటమంటే ఒక చిన్న సినిమాను తీయటమే! అంతే కాకుండా ప్రేక్షక్షుడికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ట్రైలర్స్‌ను చూసే సినిమాకు వెళ్తారు. ట్రైలర్‌ను చూసి ఎక్కువ అంచనాలతో సినిమాకు వెళ్లి.. ఆ అంచనాకు తగ్గట్టుగా లేకపోతే సినిమా ఫెయిల్ అవుతుంది. సినిమాలో ఉన్న విషయాలను దాచేసి ప్రేక్షకుడిని సర్‌ప్రైజ్ చేద్దామనుకుంటే కొన్నిసార్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా కొంత మంది ప్రముఖ హీరోల సినిమాలు దెబ్బతిన్నాయి కూడా! 80 కోట్ల సినిమాను ప్రేక్షకుడి ఊహాశక్తికి వదిలేయకూడదు.
సుమారు 600 సినిమాలకు ట్రైలర్స్ కట్ చేశారు కదా.. మీకంటూ ఒక ఫిక్స్‌డ్ ఫార్మాట్ వచ్చేయలేదా?
అలా వచ్చిన రోజున నేను ఈ వృత్తిలోనే ఉండను. నాకు ప్రతి సినిమా కొత్తే! ప్రతి డైరక్టర్‌కు కొత్త రకంగా ట్రైలర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఏ రెండు సినిమాలు ఒకలా ఉండవు. ఉదాహరణకు.. సింహ, ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా, ప్రస్థానం, చందమామ కథలు, సరైనోడు, పటాస్, సరిలేరు నీకెవ్వరూ, గుంటూరు టాకీస్, ఒక మనసుతో, అశ్వత్థామ, ఎఫ్2, క్రాక్, బీబీ3- ఇలా ఒక్కో సినిమాది ఒక్కో కథ. కొన్ని కమర్షియల్ అయితే మరి కొన్ని కథమీదే ఆధారపడినవి. వీటన్నింటినీ చూసి ప్రేక్షకులకు నచ్చేలా ట్రైలర్‌ను చేయాల్సి ఉంటుంది. అంతే కాదు. నేను పనిచేసే తీరు కూడా వేరుగా ఉంటుంది.
టైటిల్స్ డిజైనింగ్ నుంచి మ్యూజిక్‌ను సూచించటం దాకా అన్ని నేనే చేస్తా. నేను తృప్తి చెందకపోతే ట్రైలర్ ఇవ్వను. నాకు నచ్చితేనే ట్రైలర్ బయటకు పంపుతా! కొన్ని సార్లు ట్రైలర్ చూసిన తర్వాత- కొందరు దర్శకులు కొన్ని మార్పులు సూచిస్తారు. మార్పులు చేయటానికి నేను సిద్ధమే. కేవలం డబ్బుల కోసమే ట్రైలర్స్ చేస్తే- నేను వేరే స్థితిలో ఉండేవాడిని.
ఎంతో మంది ఎడిటర్లు ఉన్నా.. ట్రైలర్స్ కట్ చేసేవారు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారన్నారు కదా.. దీనికి కారణాలేమిటి?
కచ్చితంగా ఒక కారణమని చెప్పలేం. నా దగ్గరకు పెద్ద పెద్ద సినిమాల రషెస్ అన్నీ వస్తూ ఉంటాయి. చిన్న లీక్ అయినా చాలా పెద్ద గొడవలవుతాయి. అందువల్ల అసిస్టెంట్‌లను పెట్టుకోకుండా నేనే పని చేసుకుంటూ ఉంటా. ఇదొక కారణం. ఇక రెండోది- ఇది ఒక క్రియేటివ్ ఫీల్డ్. కొత్త నీరు వస్తూ ఉంటుంది పాత నీరు పోతుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ కాకపోతే అవుట్‌డేట్ అయిపోతాం. ఒకరి నుంచి మరొకరు పని నేర్చుకోగలరేమో! అంత వరకే! ఎవరి క్రియేటివిటీ వారిదే! మీకో ఉదాహరణ చెబుతా. మణిరత్నం, రాజమౌళిలాంటి ఉద్ధండ దర్శకుల దగ్గర పనిచేసిన వాళ్లందరూ టాప్ డైరక్టర్లు అయ్యారా? లేదు.. ఈ వృతిలో కూడా అంతే!
నేపథ్యం..
మాది గుంటూరు పక్కన చిన్న పల్లెటూరు. పొలటెక్నిక్ చదువుకున్నా. హైదరాబాద్‌కు వచ్చేసి కొన్నాళ్లు ప్రసాద్ ల్యాబ్స్‌లో పనిచేశా. అక్కడి నుంచి నా సినిమా ప్రస్థానం ప్రారంభమయింది. ఇండస్ట్రీలో ఉన్న అందరు నిర్మాతలు.. దర్శకులకు.. హీరోలకు పనిచేశా. నన్ను టీవీల్లో, పత్రికల్లో చూడాలనేది మా అమ్మ కోరిక. నా పని కనబడాలే తప్ప.. నేను కనబడకూడదనేది నా ఉద్దేశం. అందుకే ఇప్పటి దాకా మీడియా వైపు చూడలేదు!
ఎన్నిట్రైలర్స్?
ఒకప్పుడు సినిమాకు ఒకే ట్రైలర్ ఉండేది. దానిని థియేటర్లలో విడుదల చేసేవారు. ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రతి సినిమాకు కనీసం 10 యాడ్స్ ఉంటున్నాయి. పెద్ద సినిమాలైతే 35 యాడ్స్ దాకా ఉంటాయి. ఒకప్పుడు సినిమా పబ్లిసిటీ 100 వరకూ చేసేవారు. ఇప్పుడు రెండు వారాలతో ముగిసిపోతోంది.
సినిమా తీసినంత..
మనకు రెండు నిమిషాల కనిపించే ట్రైలర్ కట్ చేయాలంటే- సినిమా తీసినంత పని ఉంటుంది. సినిమా రష్‌లు చూసి వాటిలో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల ఆధారంగా ట్రైలర్‌ను తయారుచేస్తాం. ఆ తర్వాత దీనిని రీ-రికార్డింగ్‌కు, మ్యూజిక్‌కు ఇలా రకరకాల శాఖలకు పంపుతాం అలా ట్రైలర్ తయారవుతుంది.
ర్యాపిడ్ ఫైర్
బాగా నచ్చిన ట్రైలర్: సత్య
పేరు తెచ్చిన ట్రైలర్: సింహ
కష్టపడి చేసిన ట్రైలర్: అన్నింటికీ సమానంగానే కష్టపడతా!
ఒత్తిడికి గురయిన సందర్భం: ‘లెజెండ్’ ట్రైలర్. అతి తక్కువ సమయంలో చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ బోయిపాటి శ్రీను చూడకుండానే ఈ ట్రైలర్‌ను రీ రికార్డింగ్‌కు పంపేశాం.
కోరిక: చలం నవలలు చదివి ప్రభావితమయ్యా. ఎప్పటికైనా సినిమా తీయాలనుకున్నాం. సంధ్యానమస్తుతే! అనే ఒక సినిమా తీస్తున్నా. కొవిడ్ నేపథ్యంలో కథ ఇది. షూటింగ్ చాలా వరకూ పూర్తయింది.
