అనుష్క... భూమి... ఇద్దరూ ఇద్దరే

ABN , First Publish Date - 2020-12-13T06:50:18+05:30 IST

టాలీవుడ్‌ చిత్రాలు ఇప్పుడు బాలీవుడ్‌కు క్యూ కడుతున్నాయి. ఇక్కడి కథతో అక్కడ హిట్‌ కొట్టిన తారలెందరో. అదే వరుసలో వచ్చిన మరో చిత్రం... ‘దుర్గమతి’. దాదాపు మూడేళ్ల కిందట తెలుగు, తమిళ భాషల్లో విడుదలై కాసుల వర్షం కురిపించిన ‘భాగమతి’కి రీమేక్‌ ఇది...

అనుష్క... భూమి... ఇద్దరూ ఇద్దరే

టాలీవుడ్‌ చిత్రాలు ఇప్పుడు బాలీవుడ్‌కు క్యూ కడుతున్నాయి. ఇక్కడి కథతో అక్కడ హిట్‌ కొట్టిన తారలెందరో. అదే వరుసలో వచ్చిన మరో చిత్రం... ‘దుర్గమతి’. దాదాపు మూడేళ్ల కిందట తెలుగు, తమిళ భాషల్లో విడుదలై కాసుల వర్షం కురిపించిన ‘భాగమతి’కి రీమేక్‌ ఇది. ఆసక్తికరమైన కథ... అద్భుతమైన కథనంతో ప్రేక్షకులను ఆద్యంతం కుర్చీల అంచుల్లో కూర్చొబెట్టిన ఈ హర్రర్‌ చిత్రానికి దర్శకుడు జి.అశోక్‌. ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో ఇటీవల విడుదలైన ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులనూ అలరిస్తోంది. ఆ విశేషాలు అశోక్‌ మాటల్లోనే... 


‘నాకు బాగా చేసివ్వండి’... హిందీలో ‘దుర్గమతి’ ఒప్పుకున్న తరువాత హీరో, ఈ చిత్ర నిర్మాత అక్షయ్‌కుమార్‌ గారు నాతో అన్న ఒకేఒక్క మాట. ఆ మాట నాకు ఎంతో మనోధైర్యాన్నిచ్చింది. స్వేచ్ఛగా పని చేసుకుపోయే అవకాశాన్నిచ్చింది. అదే సమయంలో బాధ్యతనూ పెంచింది. దాన్ని నిలబెట్టుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాను. అవడానికి ‘భాగమతి’ రీమేకే అయినా ఉత్తరాది నేపథ్యం ఉండేలా చూసుకున్నా. కథలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. అదే కథ... హర్రర్‌, పొలిటికల్‌ కాంబినేషన్‌. కానీ... కథనంలో, నేటివిటీలో అక్కడి పరిస్థితులకు సరిపోయేలా మార్పులు చేశాను. ఎందుకంటే మన దెయ్యం కథలు... వాళ్ల దెయ్యం కథల్లో గానీ, అలాగే ఇక్కడికి అక్కడికి రాజకీయ నేపథ్యాల్లో గానీ వ్యత్యాసం ఉంది. వాటికి తగినట్టు కొన్ని మార్పులు చేసుకున్నాను. మొత్తంగా తెలుగుతో పోలిస్తే హిందీలో మరింత స్పష్టత కనిపిస్తుంది. 


ఎవరి ప్రత్యేకత వారిదే... 

‘భాగమతి’లో అనుష్క అద్భుతంగా నటించారు. ఆమెకు ఏమాత్రం తీసిపోకుండా హిందీలో భూమీ పడ్నేకర్‌ అదరగొట్టారు. ఇద్దరిలో నేను గమనించిన అంశం అంకితభావం. కేవలం గ్లామర్‌తో పైకొచ్చినవారు కాదు. ప్రతిభ ఆధారంగా ఎదిగిన తారలు. ఎంతో కష్టపడతారు. ప్రతి రోజూ హోమ్‌వర్క్‌ చేసుకుని సెట్స్‌కు వస్తారు. అనుష్క గారైతే షూటింగ్‌ స్పాట్‌లో ఉన్నంతసేపూ సబ్జెక్ట్‌పైనే ధ్యాస పెడతారు. ‘ఈ షాట్‌ ఎలా చేద్దాం? ఎంత గ్రాఫ్‌లో వెళదాం’ అని ఎలా అడిగేవారో అదే తత్వం భూమి దగ్గర కూడా కనిపించింది. పైగా ఆమె మొదటి నుంచి కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేస్తూ వచ్చారు. దాంతో ఈ పాత్రలో సులువుగా ఒదిగిపోగలిగారు. అనుష్కను అనుకరించకుండా, ఆమె కంటే బాగా చేయాలనే ఒక తపన భూమిలో చూశాను. 


ఆ ఒత్తిడి లేదు... 

ఇక హిందీలో నాకిది తొలి చిత్రమే అయినా ఎక్కడా ఒత్తిడి అనేది లేదు. అక్కడివారంతా సాదరంగా స్వాగతం పలికారు. పైగా అక్షయ్‌కుమార్‌ సెన్సిబిలిటీ గల నిర్మాత కావడం నాకు ప్లస్‌ అయింది. అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. ఏ ఆర్టిస్ట్‌ కావాలంటే ఆ ఆర్టిస్ట్‌ను ఇచ్చారు. ‘ఇవాళ ఏంచేద్దామనుకుంటున్నారు? మీకేం కావాలి’ అని అడిగిమరీ సమకూర్చేవారు. ఓపిగ్గా ఎంత సమయమైనా వెచ్చించేవారు. ఖర్చుకూ వెనకాడలేదు. ఎడిటింగ్‌లో ఒక్క కట్‌ కూడా చెప్పలేదు. అంత నమ్మకం నామీద ఉంచారు. ఎవరూ నన్ను కొత్తవాడిగా చూడలేదు. నాకు హిందీ భాషపై పట్టు ఉంది. తమిళం, కన్నడం, మళయాళం, ఇంగ్లిష్‌ భాషలు కూడా  మాట్లాడగలను. చదవగలను. రాయగలను. దానివల్ల ఇబ్బంది లేకుండా సాంకేతిక సిబ్బంది, ఇతర నటుల నుంచి కావల్సింది రాబట్టుకోగలిగాను. కాకపోతే ఇంత మద్దతు లభిస్తున్నప్పుడు సినిమాను బాగా తీయాలనే తపన ఒకటి ఉంటుంది కదా! 


లాక్‌డౌన్‌లో ఇరుక్కుపోయాను... 

సినిమా అంతా మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో చిత్రీకరించాం. 45 రోజుల ఒకే షెడ్యూల్‌లో షూటింగ్‌ జరిపాం. లాక్‌డౌన్‌కు ముందే మార్చి 18కి షూటింగ్‌ పూర్తయింది. కానీ లాక్‌డౌన్‌తో నేను అక్కడే ఇరుక్కుపోయాను. మా కుటుంబ సభ్యులు షూటింగ్‌ చూడ్డానికి వచ్చారు. వారితో భోపాల్‌లో రెండున్నర నెలలు ఉండాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ తరువాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేశాం. ‘భాగమతి’కి భిన్నంగా ‘దుర్గమతి’ ఓటీటీలో వచ్చింది. నిజానికి థియేటర్‌ మిస్సవ్వడం ఏ ఆర్టిస్ట్‌కైనా, టెక్నీషియన్‌కైనా లోటుగానే ఉంటుంది. భూమి అయితే చాలా బాధపడింది. కానీ ప్రకృతి వైపరీత్యాలకు మనం అతీతులం కాదు కదా. మంచి డీల్‌కే అమెజాన్‌ కొనుక్కుందని తెలిసింది. ఓటీటీ ద్వారా మొత్తం 220 దేశాల్లో విడుదలైంది. ప్రచారానికి కూడా పది పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చివరగా నిర్మాతలు హ్యాపీ. నేనూ హ్యాపీ. 


తేడా పెద్దగా లేదు... 

బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కు నాకు పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. వంద అడుగుల రోడ్డుకు... ఎనభై అడుగుల రోడ్డుకు ఉన్న తేడా... అంతే! అల్లు అర్జున్‌, ప్రభాస్‌ లాంటి పెద్ద హీరోల తెలుగు సినిమాలు దేశమంతా విడుదల అవుతున్నాయి. అది మన తెలుగు చిత్రసీమ సత్తా. ఎక్కడ తీశామనేదాని కంటే కథ నచ్చితే ఎక్కడైనా ఆడుతున్నాయి. హిందీలో మరో రెండు సినిమాలు కమిట్‌ అయ్యాను. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను. వాళ్లు నన్ను పిలిపించుకుని అవకాశం ఇవ్వడం గర్వంగా అనిపిస్తుంది. ఒక తెలుగువాడిగా ఇక్కడి దాకా వచ్చి పనిచేయడం సంతోషంగా, సంతృప్తిగా ఉంది.


Updated Date - 2020-12-13T06:50:18+05:30 IST